మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీరు తాగి పది మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బిజెపి ప్రభుత్వం ప్రజలకు నీటిని కాదు, విషాన్ని సప్లయ్ చేస్తోందని మండిపడ్డారు.
ఇండోర్ నగరంలో మురుగునీరు కలిసిన తాగునీటి వల్ల ఐదు నెలల పసిపాపతో సహా పలువురు మరణించడంపై రాహుల్ గాంధీ Xలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండోర్‌లో రాష్ట్ర ప్రభుత్వం గాఢ నిద్రలో ఉంది. మురికి నీరు వస్తోందని ప్రజలు మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఆరోపించారు.
తాగునీటి పైపుల్లోకి మురుగునీరు ఎలా వచ్చిందని, అధికారులు ఎందుకు సకాలంలో చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడం ప్రభుత్వం చేసే ఉపకారం కాదు, అది వారి ప్రాథమిక హక్కు. ఈ హక్కును కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. గతంలో జరిగిన మరణాల ఘటనలను గుర్తు చేస్తూ, పేదలు చనిపోతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని విమర్శించారు.
ఇండోర్‌లోని భగీరత్‌పుర ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతోంది. ఈ నీరు తాగిన వారికి తీవ్రమైన విరేచనాలు, వాంతులు అయ్యాయి. అక్కడి మేయర్ పుష్యమిత్ర భార్గవ పది మంది మరణించినట్లు ధృవీకరించగా, స్థానికులు మాత్రం 14 మంది వరకు చనిపోయి ఉంటారని చెబుతున్నారు.
శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యాన్ని తప్పుబట్టారు. ప్రజలు చనిపోతే ప్రభుత్వం కేవలం క్షమాపణలు చెప్పి, పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇలాంటి దారుణాలు దేశంలో సర్వసాధారణం అయిపోవడం బాధాకరం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆరోగ్య శాఖ అధికారులు ఆ ప్రాంతంలో పర్యవేక్షిస్తూ, వ్యాధి వ్యాప్తికి గల కారణాలను విచారిస్తున్నారు.
