- బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసి సీఎం, మంత్రులు చేసిన కుట్రలన్నీ తెలుసు: బండి సంజయ్
- మీ మెడలు వంచేదాకా పోరాడుతూనే ఉంటాం
- కరీంనగర్ వేదికగా మా దమ్ము ఏందో చూపిస్తామన్న కేంద్ర మంత్రి
కరీంనగర్, వెలుగు: మెజారిటీ సీట్లను సాధించిన బీజేపీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవి దక్కకుండ మంత్రులు, బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసి సీఎం చేయని కుట్రలు లేవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అయినా బండి సంజయ్ రాజకీయం ముందు, బీజేపీ సైనికుల పోరాట పటిమ ముందు ఆ కుట్రలన్నీ పటాపంచలయ్యాయని తెలిపారు.
తనను అనవసరంగా, అప్రజాస్వామికంగా కెలికి ఆట మొదలుపెట్టారని, ఈ ఆటకు ముగింపు పలుకుతానని అన్నారు. కరీంనగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం.. కొత్తగా ఎన్నికైన మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కార్పొరేటర్లతో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విరుచుకుపడ్డారు.
‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటి కావడానికి కారణమేంటి? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఫామ్ హౌస్ వేదికగా కుట్రలు ఎందుకు చేశారు? ఎవరిపై మీ కోపం? కాంగ్రెస్ గెలిచింది 14 సీట్లు, ఎంఐఎం గెలిచింది 3 సీట్లు, బీఆర్ఎస్ గెలిచింది 9 సీట్లు.. అన్నీ కలుపుకున్నా 26 సీట్లు మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ దాటనే లేదు. ఇవన్నీ తెలిసి ఎందుకు బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీ చీకటి ఒప్పందాలేమిటి?” అని సంజయ్ ప్రశ్నించారు.
కరీంనగర్‌కు అత్యధిక నిధులు తీసుకొస్త
తెలంగాణ వచ్చినా.. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలన్నా.. కరీంనగర్ వేదికగా మార్పు మొదలైన సంగతి తెలిసిందేనని బండి సంజయ్ అన్నారు. అందుకే కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంటే రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలన్నీ ఒక్కటై కుట్ర చేశాయని ఆరోపించారు.
ఈ విషయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరును చూసి అభినందించకుండా ఉండలేకపోతున్నానని, ప్రజాస్వామ్య తీర్పును శిరసావహించాలనే ఉద్దేశంతో పార్టీ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించిన తీరు గొప్ప విషయమన్నారు. 2005లో ఇదే రోజున నేను కార్పొరేటర్ గా తొలిసారి ఎన్నికైనప్పుడు ఎంతో సంతోషపడ్డానని, మళ్లీ ఈరోజు ఇదే కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకున్నందుకు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉందన్నారు.
తమ మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు గుణవంతులు, నీతిమంతులని, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తారని హామీ ఇచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, అమిత్ షాను కలిసి కరీంనగర్ కు అత్యధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేసేందుకు యత్నిస్తానని తెలిపారు. కరీంనగర్ నుంచే యుద్ధం మొదలుపెట్టామని, 6 గ్యారంటీలను అమలు చేసేదాకా మీ మెడలు వంచుతామని అన్నారు.
