వెలుగు ఓపెన్ పేజీ : కేసీఆర్ వ్యక్తి కాదు శక్తి

వెలుగు ఓపెన్ పేజీ :  కేసీఆర్ వ్యక్తి కాదు శక్తి

కేసీఆర్ అనే  మూడు అక్షరాలు  తెలంగాణ  ప్రజల  ఆకాంక్షలకు ప్రతి రూపం.  తెలంగాణ తమ విముక్తి కోసం దశాబ్దాలుగా పోరాడింది.  వేలమంది ఈ నేల తల్లి విముక్తి కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు.  వివిధ సామాజిక ఉద్యమాలలో పాల్గొని ప్రపంచంలోనే తెలంగాణ పదానికి గొప్ప పేరు సాధించిన నేలలో  కేసీఆర్ జన్మించడం ఒక చరిత్ర.  మొట్టమొదటి  రాష్ట్రాల విభజనపై వేసిన ఫజల్ అలీ కమిషన్ నుంచి శ్రీకృష్ణ కమిటీ వరకు ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేసినా పాలకులు పట్టించుకోలేదు,  1952లో జరిగిన  నాన్  ముల్కీ గోబ్యాక్, 1969  తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమం పెద్ద ఎత్తున జరిగాయి.  అనేకమంది ప్రభుత్వ  దమనకాండలో ప్రాణాలు కోల్పోయారు.  ప్రజాస్వామ్యానికి పర్యాయ పదంగా నిలిచే ఎన్నికలలో సైతం ప్రజలు తెలంగాణ కోసం అనేక సందర్భాలలో  తమ నిరసనను ఓటురూపంలో వ్యక్తపరిచినా రాజకీయ పరిష్కారం లభించలేదు.

ఈ చారిత్రక  సందర్భంలో  కేసీఆర్  ఆలోచనతో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ ఆవిర్భావం  తెలంగాణ ప్రజలలో  కొండంత ధైర్యాన్ని నింపింది.  అప్పటివరకు తెలంగాణ పదాన్ని వాడకుండా నిరోధించే ప్రయత్నం పాలకులు కుట్ర పూరితంగా  చేశారు.  తెలంగాణ అంటే నక్సలైట్ అని ముద్ర వేసి తీవ్రమైన నిర్బంధాన్ని అమలుచేశారు.  వందలాది మందిని  ఎన్​కౌంటర్​ పేరిట హత్యలు చేశారు.  

గ్రామాలన్నీ  విధ్వంసం చేసి  యువకులు గ్రామాలలో  ఉండకుండా  చేశారు.   టీఆర్ ఎస్ పార్టీ  పుట్టుక వలన  ప్రజలు తమ ఆకాంక్షల కోసం గొంతు విప్పే అవకాశం దొరికింది.  2001 నుంచి రాజకీయ వ్యక్తీకరణకు కేసీఆర్ కేంద్రంగా మారారు.  2001 నుంచి  తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజకీయ పార్టీని బలోపేతం చేయడానికి  కేసీఆర్ ఆలోచనలతో  అనేక వర్గాల  సహకారంతో ఒక రాజకీయ శక్తిగా మారడం జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం. అనేక ప్రజా ఉద్యమాలతోపాటు తెలంగాణ ప్రాంతానికి  అన్ని రంగాలలో జరిగిన అన్యాయాలను, వివక్షలను ఉద్దేశపూర్వకంగా చేసిన అసమాన అభివృద్ధిని వివిధ రూపాలలో వివరించడంతో  కేసీఆర్ ప్రజలకు కనెక్ట్ అయ్యారు.  గ్రామీణ భాషలో ఉన్న పట్టు ప్రజలు లోతుగా ఆలోచించే వైపు అడుగులు పడ్డాయి.  నీళ్లు,  నిధులు,  నియామకాలు,  ఆత్మగౌరవం అనే నినాదాలు తూటాలుగా మారి తెలంగాణ కొలిమిగా  మారడంలో  కేసీఆర్ ఆలోచన ఆరని అగ్ని జ్వాలగా మారింది. 

ఫ్రీజోన్ ఉద్యమం ఉధృతం

ఫ్రీజోన్ ఉద్యమం మరింత ఉధృతం అయ్యింది.  అనేక ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనలకు  కేసీఆర్  సంఘీభావం  ప్రకటించారు.  అన్ని ఉద్యమాలకు  కేసీఆర్  కేంద్ర బిందువుగా మారి తెలంగాణ ప్రజా రాజకీయాలను శాసించారు.  అన్ని రాజకీయ  పార్టీలను  ఏకతాటిపైకి తెచ్చి  తెలంగాణ  ప్రజల ఆకాంక్షలను అనివార్యంగా మద్దతు తెలిపేలాగ  ప్రజాకోర్టులో నిలపడంలో  కేసీఆర్ విజయం సాధించారు.  32 రాజకీయ పార్టీల మద్దతుతో  పాటు సబ్బండ వర్గాల  ఐక్యతతో  జాక్ నిర్మాణం సకల జనులు సమ్మె,  సహాయ నిరాకరణ,  మిలియన్ మార్చ్,  సంసద్ యాత్ర , సడక్ బంద్,  రైల్ రోకో లాంటి ఎన్నో కార్యక్రమాలు,  విద్యార్థులు, యువకుల అసహజ మరణాల వలన తెలంగాణ  యుద్ధరంగంగా మారింది.  కేసీఆర్  ఆమరణ దీక్షతో ప్రజలలో  తెలంగాణ ఏర్పాటు ఖాయం అనే విశ్వాసాన్ని కలిగించడంలో  కేసీఆర్ పాత్ర కీలకం.  చివరకు  పార్లమెంట్​లో  తెలంగాణ ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది  అని  మొదటిసారి కేంద్రం ప్రకటించడం,  కేసీఆర్ తెలంగాణ వచ్చుడో..  కేసీఆర్ చచ్చుడో  అని  భావోద్వేగ ప్రకటన చేయడం  తెలంగాణ రాష్ట సాధనలో కీలకంగా మారింది.   అ తరువాత  సీమాంధ్ర  రాజకీయాలు మొదలుకావడం  ప్రకటన వెనక్కి తీసుకోవడంలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.   వాటిని సమర్థవంతంగా ప్రజల సహకారంతో  కేసీఆర్  ప్రతిఘటించి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో ఆవిష్కరించిన చరిత్రకారుడిగా  తెలంగాణ రాష్ట్ర  ప్రజల గుండెల్లో నిలిచిపోవడం ఖాయం.  అయితే  కొందరు ఎన్నికల పలితాలు చూసి కేసీఆర్ చరిత్రను తెరమరుగుచేసే  కుట్రపూరిత రాజకీయాలకు తెర లేపుతున్నారు.

ఆయనే ఒక  రాజకీయ శక్తి

రాష్ట్రం ఏర్పడగానే  సుదీర్ఘ కాలం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా  కేసీఆర్​ పరిపాలన కొనసాగించారు,  దశాబ్దాల తరబడి పేరుకుపోయిన ఎన్నో సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేశారు.  నీటికోసం కరెంట్ కోసం తల్లడిల్లిన తెలంగాణ తేరుకొని వ్యవసాయ రంగంలో గణనీయ మార్పు దిశగా అడుగులు వేసింది.  చిన్న రాష్ట్రాల పరిపాలన  దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.   కేసీఆర్ వ్యక్తి కాదు శక్తిగా మారడం కొన్ని పార్టీలకు ఇబ్బందిగా మారింది.   తెలంగాణ కోసం తపించి రాష్ట్ర సాధనతోపాటు అభివృద్ధిని సాధించిన  కేసీఆర్​ను తీవ్రమైన బాధతో నిందించడం సమాజం సహించదు.  ప్రభుత్వ విధానాలపై  విమర్శించడం, ప్రజల కేంద్రంగా  పరిపాలన  జరగాలని  కోరుకోవడాన్ని ఎవరూ  తప్పుబట్టరు.  ఇప్పటికైనా  కేసీఆర్ పాలనకంటే మెరుగైన పాలన అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేయాలి.  ఉద్యమ నేతను నిరంతరంగా నిందించే  ప్రయత్నం  మానుకోవాలి.  కేసీఆర్  లేకుంటే తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటు ఎప్పడు జరిగేదో  తెలియదు.  కేసీఆర్  ప్రజాసమస్యలపై నిబద్ధతతో ఆలోచించడం వల్లనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అయ్యిందనే విషయం వాస్తవం,  కేసీఆర్ రాజనీతి ప్రదర్శిస్తూ తనను నిందించినా  నిబ్బరంగా ప్రజా సమస్యల ఎజెండాగా ముందుకు సాగడం ప్రశంసించాల్సిందే.  రాజకీయాలలో మౌలిక విలువలు ఉండాలనే అరుదైన రాజకీయ నేతగా నిరంతరం ప్రజల గుండెల్లో చర్చలలో  నిలిచే అసాధారణ రాజకీయ నేత  కేసీఆర్.

- దేవి ప్రసాద్ 
టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు