హ్యాట్రిక్ విజయంతో సూపర్‌‌‌‌‌‌‌‌–8కు శ్రీలంక.. ఆస్ట్రేలియా ఆశలు గల్లంతు!

హ్యాట్రిక్ విజయంతో సూపర్‌‌‌‌‌‌‌‌–8కు శ్రీలంక.. ఆస్ట్రేలియా ఆశలు గల్లంతు!

పల్లెకెలె:   ఓపెనర్ పాథుమ్ నిశాంక (52 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 నాటౌట్‌‌‌‌) టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో తొలి సెంచరీతో విజృంభించిన వేళ శ్రీలంక అద్భుత విజయం అందుకుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి సూపర్‌‌‌‌‌‌‌‌–8 రౌండ్‌‌‌‌కు దూసుకెళ్లింది. తొలుత జింబాబ్వే చేతిలో కంగుతిని.. ఇప్పుడు లంక చేతిలో దెబ్బతిన్న ఆసీస్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ దశలోనే టోర్నీ నుంచి నిష్ర్కమించే ప్రమాదంలో నిలిచింది. నిశాంకకు తోడు కుశాల్ మెండిస్ (38 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 51) ఫిఫ్టీ దంచడంతో సోమవారం జరిగిన గ్రూప్‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌లో లంక 8 వికెట్ల తేడాతో ఆసీస్‌‌‌‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడిన ఆసీస్ తొలుత 20 ఓవర్లలో 181 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (29 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 56),  కెప్టెన్ మిచెల్ మార్ష్ (27 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 54) రాణించారు. దుషన్ హేమంత (3/37) మూడు, దుష్మంత చమీర (2/36) రెండు వికెట్లతో దెబ్బకొట్టారు. అనంతరం లంక 18 ఓవర్లలోనే 184/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. వరుసగా మూడు విక్టరీలతో లంక (6 పాయింట్లు) ముందుకెళ్లగా.. ఒమన్, ఆసీస్‌‌‌‌పై నెగ్గిన జింబాబ్వే (4) రెండో ప్లేస్‌‌‌‌లో నిలిచింది. ఒమన్‌‌‌‌తో ఆఖరి మ్యాచ్ ఆడాల్సిన ఆస్ట్రేలియా (2) మూడో ప్లేస్‌‌‌‌లో ఉంది. ఐర్లాండ్ (మంగళవారం), శ్రీలంక (గురువారం) తో జరిగే తమ తర్వాతి మ్యాచ్‌‌‌‌ల్లో జింబాబ్వే ఒక్కటి గెలిచినా సూపర్‌‌‌‌‌‌‌‌–8 చేరుకుంటుంది. ఆసీస్‌‌ ఇంటిదారి పడుతుంది.

దంచికొట్టి డీలా పడి..

తొలి పది ఓవర్లలో దంచికొట్టిన.. ఆస్ట్రేలియాను సెకండాఫ్‌‌‌‌లో లంక బౌలర్లు అద్భుతంగా నిలువరించారు.   ఆరంభంలో ఓపెనర్లు మిచెల్ మార్ష్‌‌‌‌, ట్రావిస్‌‌‌‌ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫస్ట్ ఓవర్లో చమీరకు మార్ష్‌‌‌‌ 4,6తో వెల్‌‌‌‌కం చెబితే.. తీక్షణ బౌలింగ్‌‌‌‌లో హెడ్ 4, 4తో స్పీడందుకున్నాడు. షనక బౌలింగ్‌‌‌‌లో హెడ్ 6, 4 కొడితే.. తీక్షణ వేసిన ఆరో ఓవర్లో మార్ష్ వరుసగా ఐదు ఫోర్లతో విజృంభించడంతో పవర్ ప్లేలోనే ఆసీస్ 70 రన్స్ రాబట్టింది.  ఓపెనర్లిద్దరూ పోటాపోటీగా ఆడుతూ ఫిఫ్టీలు పూర్తి చేసుకోగా..  8.2 ఓవర్లకే స్కోరు వంద దాటింది. దాంతో ఆసీస్ భారీ స్కోరు చేసేలా కనిపించింది.  కానీ, ఈ దశలో లంక బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. తన వరుస ఓవర్లలో హెడ్‌‌‌‌, మార్ష్‌‌‌‌ను  ఔట్ చేసిన   లెగ్ స్పిన్నర్ దుషన్ హేమంత  ఆ టీమ్ జోరుకు బ్రేక్ వేయగా.. గ్రీన్‌‌‌‌ (3)ను వెల్లాలగె స్టంపౌట్‌‌‌‌ చేశాడు.  మరో హిట్టర్ టిమ్ డేవిడ్ (6)ను కమిందు మెండిస్ పెవిలియన్ చేర్చడంతో 103/0 నుంచి ఆసీస్ 130/4తో కష్టాల్లో పడింది. స్లాగ్ ఓవర్లలో పోరాడే ప్రయత్నం చేసిన  గ్లెన్ మ్యాక్స్‌‌‌‌వెల్ (27).. నిషాంక పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌‌‌‌కు ఔటయ్యాడు.  చివరి 4 ఓవర్లలో ఆరు వికెట్లు పడగొట్టి 21 రన్స్ మాత్రమే ఇచ్చిన లంక.. ఆసీస్‌‌‌‌ భారీ స్కోరును అడ్డుకుంది.

లంక అలవోకగా..

టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో నిశాంక స్టార్టింగ్‌‌‌‌ నుంచే దుమ్మురేపాడు. రెండో ఓవర్లోనే ఓపెనర్ కుశాల్ పెరీర (1)ను స్టోయినిస్ ఔట్ చేసినా.. తను ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. బార్ట్‌‌‌‌లెట్‌‌‌‌ వేసిన మూడో ఓవర్లో మూడు ఫోర్లతో స్పీడు పెంచాడు. మరో ఎండ్‌‌‌‌లో వన్‌‌‌‌డౌన్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ కుశాల్ మెండిస్ కూడా ఫోర్లు, సిక్సర్లతో జోరు చూపడంతో పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేలో లంక 61/1తో నిలిచింది. ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా ఈ ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు కొడుతూ ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. 12 ఓవర్లకు  లంక స్కోరు వంద దాటగా.. 13వ ఓవర్లో కుశాల్‌‌‌‌ మెండిన్‌‌‌‌ను ఔట్ చేసిన స్టోయినిస్‌‌‌‌ ఆసీస్‌‌‌‌ను రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, నిశాంక ఆ చాన్స్ ఇవ్వలేదు. వచ్చీరాగానే రెండు ఫోర్లు కొట్టిన పవన్ రత్నాయకే (28 నాటౌట్‌‌‌‌)తో  కలిసి మరింత స్పీడు పెంచాడు. స్టోయినిస్ వేసిన 15వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌‌‌‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇంకో ఎండ్‌‌‌‌లో పవన్ సైతం అస్సలు తగ్గలేదు. ఎలీస్ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన నిశాంక.. జంపా వేసిన 18వ  ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లాస్ట్ బాల్‌‌‌‌కు పవన్ ఫోర్‌‌‌‌తో మ్యాచ్ ముగించాడు. టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో శ్రీలంకకు ఇదే హయ్యెస్ట్ టార్గెట్ ఛేజ్‌‌‌‌ కావడం విశేషం. 

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 181 ఆలౌట్‌‌‌‌ (హెడ్ 56, మార్ష్ 54,
హేమంత 3/37).
శ్రీలంక: 18 ఓవర్లలో 184/2 (నిశాంక 100 నాటౌట్‌‌‌‌, కుశాల్ మెండిస్ 51, స్టోయినిస్ 2/46)

టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై  సెంచరీ కొట్టిన తొలి బ్యాటర్ నిశాంక. 2014లో ఉమర్ అక్మల్ (పాక్) ఆ టీమ్‌పై అత్యధికంగా చేసిన 94 
రన్స్‌ రికార్డును  బ్రేక్ చేశాడు.