ఈవీఎంలపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది..:కర్ణాటక ప్రభుత్వ సర్వేతో బీజేపీ విమర్శలు..

 ఈవీఎంలపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది..:కర్ణాటక ప్రభుత్వ సర్వేతో బీజేపీ విమర్శలు..

రాహుల్ గాంధీ చేస్తున్న 'ఓటు చోరీ' ఆరోపణలు అబద్దం అని నిరూపించేందుకు బీజేపీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వమే స్వయంగా నిర్వహించిన ఒక సర్వేను ఉదాహరణగా చూపిస్తూ బీజేపీ విమర్శలు కురిపించింది.

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కర్ణాటక ప్రభుత్వానికి చెందిన ఓ సంస్థ (KMEA) ప్రజల అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో కర్ణాటక రాష్ట్రంలోని 83.61% మంది ప్రజలు ఈవీఎంలను పూర్తిగా నమ్ముతున్నామని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ నమ్మకం ఇంకా పెరిగిందని సర్వే తెలిపింది. ఇంకా మన దేశంలో ఎన్నికలు చాలా స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతున్నాయని 84.55% మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. దాదాపు 95% మంది  పేర్లు ఓటరు లిస్టులో కరెక్ట్‌గా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

 ఈ సర్వే వివరాలను ప్రస్తావిస్తూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా Xలో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ ఈవీఎంల మీద, ఎన్నికల సంఘం మీద అబద్ధాలు చెబుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన సొంత పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వమే ఆయన అబద్ధాలను బయటపెట్టింది. ప్రజలకు ఈవీఎంలపై పూర్తి నమ్మకం ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తోందిని  అన్నారు. మరో బీజేపీ నేత  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలను తప్పుబడుతుందని, గెలిస్తే మాత్రం మౌనంగా ఉంటుందని అన్నారు.