డేటా ప్రొటెక్షన్‌‌ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

డేటా ప్రొటెక్షన్‌‌ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: డిజిటల్‌‌ పర్సనల్‌‌ డేటా ప్రొటెక్షన్‌‌ (డీపీడీపీ) చట్టం 2023లోని పలు నిబంధనలకు సంబంధించి రాజ్యాంగబద్ధతను సవాల్‌‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సోమవారం నోటీసులు జారీ చేసింది. అయితే, మధ్యంతర స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్‌‌ సూర్యకాంత్‌‌, జస్టిస్‌‌ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్‌‌ విపుల్‌‌ ఎం.పంచోలలీల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 

సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) నిబంధనలను సవరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘ది రిపోర్టర్స్‌‌ కలెక్టివ్‌‌’నేషనల్‌‌ క్యాంపెయిన్‌‌ ఫర్‌‌‌‌ పీపుల్స్‌‌ రైట్ టు ఇన్ఫర్మేషన్‌‌ (ఎన్‌‌సీపీఆర్‌‌‌‌ఐ) వంటి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ‘‘డీపీడీపీ చట్టంలోని సెక్షన్‌‌ 44(3) ద్వారా ఆర్‌‌‌‌టీఐలోని సెక్షన్‌‌ 8(1)(జే)ని సవరించడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

గతంలో ప్రజా ప్రయోజనం ఉన్నప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉండేదని, కానీ కొత్త చట్టం ఆ మినహాయింపును తొలగించి పారదర్శకతను దెబ్బతీస్తోంది”అని న్యాయవాదులు ప్రశాంత్‌‌ భూషణ్‌‌, బృందా గ్రోవర్‌‌‌‌ వాదించారు.