- ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- ఖాళీ బకెట్లతో తిర్యాణి గురుకుల స్టూడెంట్ల ర్యాలీ
- స్పృహ కోల్పోయిన నలుగురు విద్యార్థులు, ఆసుపత్రికి తరలింపు
తిర్యాణి, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో స్టూడెంట్లు సోమవారం రోడ్డెక్కారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో సమస్య పరిష్కారం కావడం లేదని ఖాళీ బకెట్లతో ప్రధాన రోడ్డుపై ర్యాలీ తీశారు. కుమ్రం భీం చౌరస్తాలో ఏకంగా ఐదు గంటల పాటు ధర్నా చేశారు. స్కూల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని, పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడంలేదని స్టూడెంట్లు తెలిపారు. పరీక్షల పేరుతో ఒత్తిడి చేస్తున్నారని, చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేంతవరకు క్లాస్‌లకు వెళ్లేది లేదన్నారు. ఎండ తీవ్రతతో నిరసన తెలుపుతున్న నలుగురు స్టూడెంట్లు స్పృహ కోల్పోయారు. వారిని వెంటనే తోటి విద్యార్థులు, సిబ్బంది చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకొని స్టూడెంట్లకు ఇబ్బంది కలగకుండా టెంట్ ఏర్పాటు చేశారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకుని స్టూడెంట్లను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు ధర్నా విరమించలేదు. కలెక్టర్ స్వయంగా వచ్చి తమ సమస్యను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.
