వెన్నుపోటు రాజకీయాలను సహించం : మంత్రి సీతక్క 

వెన్నుపోటు రాజకీయాలను సహించం  : మంత్రి సీతక్క 
  • వాటివల్లే ములుగు మున్సిపాలిటీలో 4 స్థానాల్లో ఓడిపోయాం : మంత్రి సీతక్క 

ములుగు, వెలుగు: కాంగ్రెస్​లో వెన్నుపోటు రాజకీయాలను సహించేది లేదని, పార్టీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ములుగులోని ఓ ఫంక్షన్ హాల్​లో మున్సిపల్​చైర్ పర్సన్ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి, వైస్​చైర్​పర్సన్​ఆసియా, కౌన్సిలర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కృతజ్క్షతలు తెలిపారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్ని అంశాలను పరిశీలించి చైర్ పర్సన్​గా చంద్రకళను ఎంపిక చేశామన్నారు.

చైర్​పర్సన్ ​పదవి రాలేదని కౌన్సిలర్లు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పారు. ములుగు మున్సిపాలిటీలో 4 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవడానికి వెన్నుపోటు రాజకీయాలే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరమని, అలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. ఎవరు ఈ పని చేశారో తమకు తెలుసని, పద్ధతి మార్చుకోవాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్, నాయకులు పాల్గొన్నారు.