వర్ని, వెలుగు : యూరియా కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్యాప్ను రద్దు చేయాలని మోస్రా మండలం గోవూరుకు చెందిన రైతులు డిమాండ్‌చేశారు. సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని ఆరోపస్తూ సోమవారం వర్ని-, నిజామాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ యూరియా యాప్ సర్వర్‌డౌన్ అని చూపిస్తుందని మండిపడ్డారు.
చాలామంది రైతులకు యాప్‌పై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 15 రోజుల నుంచి యూరిమా కోసం పడిగాపులు కాస్తున్నామని, సొసైటీలు, ప్రైవేటు దుకాణాల్లో యూరియా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. సరిపడా యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.
