తల్లడిల్లిన తల్లి ప్రేమ

తల్లడిల్లిన తల్లి ప్రేమ
  •     దూడపై పులి పంజా.. ఒంటరిగా ఇంటికెళ్లి ఆవు వింత ప్రవర్తన
  •     దూడను చంపిన ప్రాంతానికి యజమానిని తీసుకెళ్లిన ఆవు
  •     రైతు సమాచారం తో ఆవువెంట నడిచిన ఫారెస్ట్ ఆఫీసర్లు

కాగ జ్ నగర్, వెలుగు: పులి పంజాతో తన దూడను కోల్పోయిన తల్లి ఆవు పుత్ర శోకంతో తల్లడిల్లింది. నిత్యం దూడతో అడవికెళ్లే ఆ తల్లి ఆదివారం ఒంటరిగా ఇంటికొచ్చి వేదనతో అల్లాడిపోయింది. సోమవారం ఉదయం ఆవును వదిలేయగానే అటవీ ప్రాంతంవైపు పరుగులు తీసింది. దీంతో యజమాని ఆవును అనుసరించాడు. విషయాన్ని ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలియజేశాడు. వారి సైతం ఆవును అనుసరించారు. చివరకు ఆవు తన దూడను పులి చంపిన చోటుకు తీసుకెళ్లి ఆగిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

మాతృ ప్రేమకు సాక్ష్యంగా నిలిచే ఈ ఘటన సోమవారం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) ఫారెస్ట్ రేంజ్ లో జరిగింది. ఇటికెల పహాడ్ కు చెందిన నాగోసే భీంరావుకు చెందిన ఆవు, తన దూడతో కలిసి సమీపంలోని అడవీ ప్రాంతంలోకి మేతకు వెళ్లగా మాటువేసిన పులి.. లేగ మీద దాడి చేసింది. సాయంత్రం ఆవు ఒక్కటే ఇంటికి రాగా, లేగ కోసం భీంరావు వెతికినా దొరకలేదు. దీంతో భీంరావు రాత్రి అటవీ  అధికారులకు సమాచారం ఇచ్చాడు. సోమవారం ఉదయం ఆవు కట్టేసిన చోట ఉండకుండా వింతగా ప్రవర్తిస్తుండడంతో దాన్ని విడిచిపెట్టాడు. 

ఆవు పరుగున అడవీ ప్రాంతం వైపు వెళుతుండడంతో అనుమానంతో అధికారులకు విషయం చెప్పాడు. వెంటనే రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ మోహన్ రావు, సిబ్బంది అక్కడకు చేరుకొని ఆవును అనుసరించారు. అడవిలోకి వెళ్లిన ఆవు సరిగ్గా తన లేగను పులి పంజా విసిరిన చోట ఆగింది. అక్కడ రక్తపు మరకలు, పాదముద్రలను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు పులి దాడిలో లేగ చనిపోయినట్లు నిర్ధారించారు. వెంటనే పరిహారం ఇచ్చేలా చూస్తామని రైతుకు భరోసా ఇచ్చారు. దూడను కోల్పోయి ఆవు వ్యవహరించిన తీరు స్థానికంగా హాట్​టాపిక్​గా మారింది.