ఏఐలో పురోగతి మన ఆశయాలకు ప్రతిబింబం

ఏఐలో పురోగతి మన ఆశయాలకు ప్రతిబింబం
  • ఏఐ ఇంపాక్ట్ సమిట్‌‌ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఏఐలో పురోగతి మన ఆశయాలను ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్‌‌కు ప్రపంచ నేతలను, పరిశ్రమల పెద్దలను, ఆవిష్కర్తలను, పరిశోధకులను, టెక్ ఔత్సాహికులందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ప్రధాని మోదీ ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌‌పోను ప్రారంభించారు. 20వ తేదీ వరకు జరగనున్న ఈ  ఎక్స్‌‌పో ఏఐ ఇంపాక్ట్ సమిట్‌‌లో 600కి పైగా  స్టార్టప్‌‌లు, 13 దేశాల పవిలియన్‌‌లు (ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఎస్టోనియా, తజికిస్తాన్, ఆఫ్రికా) పాల్గొన్నాయి. 

ప్రధాని మోదీ ఎక్స్‌‌పోను ప్రారంభించి, అనంతరం వివిధ స్టాల్స్‌‌ను సందర్శించి, స్టార్టప్ ప్రతినిధులతో సంభాషించారు.వారు ప్రదర్శిస్తున్న ఆవిష్కరణలపై ప్రశ్నలు అడిగి, వాటిని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.."ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌‌పో 2026ను ప్రారంభించాను. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలకు భారత యువత ప్రతిభ, సామర్థ్యం తెలుస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్‌‌ వేగంగా వృద్ధి చెందుతుందనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనం. 

గ్లోబల్ సౌత్‌‌లో నిర్వహిస్తున్న ఈ మొదటి ప్రధాన అంతర్జాతీయ ఏఐ  సమిట్‌‌ మన దేశంలో జరుగుతుండడం గర్వకారణం" అని చెప్పారు. సమిట్‌‌ ప్రారంభోత్సవానికి ముందు కూడా ట్వీట్ చేశారు. "ఏఐపై చర్చించడానికి ప్రపంచాన్ని ఒక్కటి చేస్తున్నాం! ఈ రోజు నుంచి ఏఐ ఇంపాక్ట్ సమిట్‌‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. 'సర్వజన హితాయ, సర్వజన సుఖాయ" ను సమిట్ థీమ్​గా నిర్ణయించాం. ఇది మానవ పురోగతికి ఏఐని మరింత ఉపయోగించాలనే మన దేశ నిబద్ధతను తెలియజేస్తుంది" అని మోదీ పేర్కొన్నారు.