పెండ్లయ్యేదాకా ఎవర్నీ నమ్మొద్దు.. యువతీయువకులకు సుప్రీంకోర్టు హితవు

పెండ్లయ్యేదాకా ఎవర్నీ నమ్మొద్దు.. యువతీయువకులకు సుప్రీంకోర్టు హితవు
  • ప్రి మారిటల్ బంధం విషయంలో జాగ్రత్తపడాలని సూచన
  • పెండ్లి చేసుకుంటానని చెప్పిమోసం చేశాడంటూ యువతి కేసు
  • విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన అత్యున్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ: పెండ్లికి ముందు యువతీ, యువకుడు పూర్తిగా అపరిచితులని, అందుకే పెండ్లయ్యేదాకా ఎవరినీ నమ్మకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పెండ్లికి ముందు ఫిజికల్ రిలేషన్  పెట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికింది. పెండ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశాడంటూ ఓ యువతి రేప్ కేసు పెట్టగా.. జైలుపాలైన యువకుడు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్  బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో కూడిన బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. 

వివాహానికి ముందు యువతి దుబాయ్ వెళ్లి మరీ యువకుడిని కలిసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇద్దరూ పరస్పర సమ్మతితోనే బంధంలోకి ఎంటరయ్యారని అభిప్రాయపడింది. ‘‘పరస్పర అంగీకారంతోనే మీరు శారీరకంగా దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య సంబంధం ఎంత బలంగా ఉన్నా.. పెండ్లికి ముందు ఇలాంటి సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహం అయ్యేదాకా ఎవరూ ఎవరినీ నమ్మకూడదు” అని బెంచ్  పేర్కొంది. 

యువతి తరపు న్యాయవాది మాట్లాడుతూ 2022లో ఓ మ్యాట్రిమోనిలో నిందితుడితో తన క్లైంట్ కు పరిచయం ఏర్పడిందని తెలిపారు.  పెండ్లి చేసుకుంటానని  నిందితుడు తన క్లైంట్ ను నమ్మించి ఢిల్లీ, దుబాయ్ కి తీసుకెళ్లాడని ఆరోపించారు.

అతను బలవంతం చేయడం వల్లే

నిందితుడు బలవంతం చేయడం వల్లే అతనితో కలిసి దుబాయ్ కు వెళ్లానని, పెండ్లి సాకుతో అక్కడ అతను తనతో ఫిజికల్  రిలేషన్ షిప్  పెట్టుకున్నాడని యువతి తెలిపింది. అంతేకాకుండా తన అంగీకారం లేకుండా వీడియోలు తీశాడని, అలా బెదిరించి తనను రేప్  చేశాడని ఆరోపించింది. వాదనలు విన్న బెంచ్.. ఈ కేసులో రాజీకి ప్రయత్నించేందుకు అవకాశం ఇస్తున్నామని చెబుతూ కేసును ఈ నెల 18 కి వాయిదా వేసింది. యువతికి పరిహారం చెల్లించాలని నిందితుడిని ఆదేశించింది.