- ఏఐ సమిట్కు 100 దేశాల నుంచి ప్రతినిధులు
- 20 మంది దేశాధినేతలు, 500 మంది ఎక్స్ పర్ట్స్ రాక
- భారత్ మంటపంలో సదస్సు ప్రారంభించిన ప్రధాని
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సు ‘ఏఐ ఇంపాక్ట్ 2026’ ఢిల్లీలో ప్రారంభమైంది. ప్రపంచం నలుమూలల నుంచి టెక్ దిగ్గజాలు ఢిల్లీకి చేరుకున్నారు. దాదాపు 20 మంది దేశాధినేతలు, వందకు పైగా దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓపెన్ ఏఐ లాంటి అంతర్జాతీయ టెక్ సంస్థల
ప్రతినిధులతో పాటు స్టార్టప్‌ల ఆవిష్కర్తలు సందడి చేశారు. సుమారు 500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సమిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ ఎగ్జిబిషన్ ‘ఏఐ ఎక్స్ పో’ లో దాదాపు 600కు పైగా స్టార్టప్‌లు తమ ఏఐ ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నాయి. విదేశీ ప్రతినిధుల డిజిటల్ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా 'యూపీఐ వన్ వరల్డ్' సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవం కోసం కేంద్రం చేపట్టిన స్మార్ట్ అసిస్టెన్స్ ఫర్ హెల్త్ ఇనిషియేటివ్ లాంటి ప్రాజెక్టుల గురించి ఈ సదస్సులో చర్చించనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే చర్చల్లో ఏఐ భద్రత, ఉపాధి అవకాశాలు, మరియు వ్యవసాయం-ఆరోగ్య రంగాల్లో ఏఐ వినియోగంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
రాబోయేది ఏఐ దశాబ్దం: మోదీ
రాబోయేది ఏఐ దశాబ్దమని, దాంతో దేశ అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సదస్సు ప్రారంభించిన తర్వాత మోదీ వివిధ స్టాల్స్ ను పరిశీలించారు. సాంకేతికతను కేవలం లాభాల కోసమే ఉపయోగించకుండా సామాన్యుల సమస్యలకు పరిష్కారం చూపేలా అభివృద్ధి ఉండాలని మోదీ వారికి సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, వైద్యం, విద్య రంగాల్లో ఏఐ వినియోగాన్ని పెంచడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ నియంత్రణ మరియు నైతిక వినియోగంపై జరుగుతున్న చర్చల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కాగా, ఈ సదస్సు కోసం దేశవిదేశాల నుంచి వచ్చిన ఏఐ నిపుణులు తమ ఆవిష్కరణలను ‘ఏఐ ఎక్స్ పో’ లో ప్రదర్శించారు. స్వదేశీ స్టార్టప్‌లు రూపొందించిన అత్యాధునిక రోబోలు, ఏఐ టూల్స్ ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
