- బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం
- మంచిర్యాల కార్పొరేషన్ సహా చెన్నూరు, లక్సెట్టిపేట, నిర్మల్ మున్సిపాటీల్లో చైర్‌పర్సన్, వైస్చైర్పర్సన్లు కాంగ్రెస్ నేతలే..
- భైంసా మున్సిపల్ పీఠం ఇండిపెండెంట్‌కు పట్టం
- నిర్మల్ పీఠంపై భార్యాభర్తలు
- కోరం లేక వాయిదాపడ్డ కాగజ్ నగర్, ఖానాపూర్, క్యాతనపల్లి చైర్‌పర్సన్ ఎన్నిక
ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీల చైర్ పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ల ఎన్నిక తీవ్ర ఉత్కంఠ మధ్య సాగింది. సోమవారం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికలు జరిగాయి. ముందుగా గెలిచిన కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించగా.. ఆ తర్వాత ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులు చేతులెత్తి చైర్‌పర్సన్, చైర్ పర్సన్లను ఎన్నుకున్నారు. బల్దియా పీఠం కోసం గత మూడు రోజులుగా ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కొనసాగిన ట్విస్ట్ లు సోమవారం కూడా కొనసాగాయి.
నాటకీయ పరిణామాల మధ్య బెల్లంపల్లి పాలకవర్గం ఎన్నిక
బెల్లంపల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మున్సిపల్‌చైర్‌పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికకు అవసరమైన కౌన్సిలర్ల స్థానాలు కాంగ్రెస్, బీఆర్ఎస్కు సమానంగా ఉండటంతో ఇండిపెండెంట్లపై ఇరు పార్టీలు ఆధారపడ్డాయి. దీంతో ఎవరిని మున్సిపల్పీఠం వరిస్తుందోననే మూడు రోజుల ఉత్కంఠకు సోమవారం తెరపడింది.
మహారాష్ట్ర క్యాంపులో ఉన్న 14 మంది కాంగ్రెస్, ఐదుగురు ఇండిపెండెంట్లు, ఒక బీజీపీ కౌన్సిలర్ప్రత్యేక బస్సులో నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా వచ్చారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్ముందుగా కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించగా కౌన్సిలర్లు చేతులు పైకెత్తి మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే ఎక్స్అఫీషియో ఓటుతో మొత్తం 21 మంది చైర్‌పర్సన్, వైస్ చైర్పర్సన్లుకు మద్దతు తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున 7వ వార్డు నుంచి గెలిచిన కౌన్సిలర్ దావ స్వాతి చైర్ పర్సన్‌గా, 17వ వార్డు కౌన్సిలర్ రాగంశెట్టి సత్యనారాయణ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు ప్రతేకాధికారి ప్రకటించారు.
మంచిర్యాల తొలి మేయర్‌గా ధర్ని మధుకర్
మంచిర్యాల కార్పొరేషన్లో బీఆర్ఎస్కు చెందిన ఐదుగురు కార్పొరేటర్లు, ఏఐబీఎఫ్ నుంచి గెలిచిన మరో కార్పొరేటర్ సైతం కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ బలం 50కి చేరింది. వారంతా 11 గంటలకు మున్సిపల్ ఆఫీస్‌కు చేరుకోగా ఆర్డీవో శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కాంగ్రెస్ తరపున మేయర్, డిప్యూటీ మేయర్లుగా ధరణి మధుకర్, సల్ల రమ్య పేర్లను ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ప్రకటించారు. దీనికి కాంగ్రెస్ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు.
చెన్నూరు మున్సిపల్ చైర్ పర్సన్‌గా పెద్దింటి పద్మ
చెన్నూరు మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను 11 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపొందడంతో పార్టీ పూర్తి మెజారిటీ సాధించింది. కాంగ్రెస్‌కు చెందిన 2వ వార్డు కౌన్సిలర్పెద్దింటి పద్మ చైర్‌పర్సన్‌గా,6వ వార్డు కౌన్సిలర్ నాయకపు వినయ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. డీఆర్డీవో పీడీ కిషన్ ప్రమాణస్వీకారం చేయించి ఎన్నిక నిర్వహించారు.
లక్సెట్టిపేట చైర్ పర్సన్‌గా అంజలి
లక్సెట్టిపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ స్థానాలు కాంగ్రెస్‌కు దక్కాయి. మొత్తం 15 వార్డులున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు 11 మంది గెలవడంతో ఆ పార్టీ నుంచే పీఠాధిపతుల ఎంపిక లాంఛనమైంది. 2వ వార్డు నుంచి గెలిచిన దొంత అంజలి చైర్‌పర్సన్‌గా, 4వ వార్డు మోతుకూరి రాజేశ్వరి వైస్‌చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
భైంసాలో ఇండిపెండెంట్లు
ఎంఐఎంకు అడ్డాగా ఉన్న భైంసా మున్సిపాలిటీలో ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థికి పీఠం దక్కింది. 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్, ఐదుగురు స్వతంత్రులతోపాటు ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే రామరావు పటేల్ మద్దతు తెలిపి ఇండింపెడెంట్ అభ్యర్థి మున్సిపల్‌చైర్‌పర్సన్ గా ఎన్నుకున్నారు. చైర్‌పర్సన్‌గా తుమొల్ల దత్తాత్రి, వైస్ చైర్‌పర్సన్ గా ఇండిపెండెంట్ బీబీ కుతుజా సిద్ధిఖీ ఇద్రిజ్ ఎన్నికయ్యారు.
నిర్మల్ పీఠంపై భార్యాభర్తలు
నిర్మల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌గా భార్యాభర్తలు అప్పాల కావ్య, గణేశ్ చక్రవర్తి ఎన్నికయ్యారు. మొత్తం 42 వార్డులు న్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటి 24 వార్డులు గెలుచుకోగా.. బీజేపీ 13, మూడు ఎంఐఎం, రెండు బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచారు. దీంతో చైర్ పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు రెండు కాంగ్రెస్ కే దక్కాయి.
