ముంబై: వరుస సెషన్లలో నష్టపోయిన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సోమవారం లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు ఒక శాతం మేర ర్యాలీ చేశాయి. ఎనర్జీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో కొనుగోళ్లు పెరగడం, విదేశీ మార్కెట్లలో మిశ్రమ ధోరణి ఉన్నప్పటికీ రూపాయి స్థిరంగా ఉండటం, క్రూడ్ ఆయిల్ ధరలు నియంత్రణలో ఉండటం కలిసొచ్చింది. 30-షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ సోమవారం 650 పాయింట్లు పెరిగి 83,277 వద్ద, నిఫ్టీ 211 పాయింట్లు పెరిగి 25,682 వద్ద స్థిరపడ్డాయి బీఎస్‌ఈలో 2,565 స్టాక్స్ పడగా, 1,747 పెరిగాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3.11 లక్షల కోట్ల మేర పెరిగి రూ.469 లక్షల కోట్లకు చేరింది.
సెన్సెక్స్‌లో పవర్‌గ్రిడ్ 4.45శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఐటీసీ, రిలయన్స్, ఎస్‌బీఐ లాభపడ్డాయి. మరోవైపు టెక్ మహీంద్రా, మారుతి, ఇన్ఫోసిస్, టైటాన్ నష్టాల్లో ముగిశాయి. మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు పెరగడంతో ప్రభుత్వ బ్యాంక్ షేర్లు సోమవారం మెరిశాయి. సెక్టోరల్ సూచీలలో పవర్ 2.40శాతం, యుటిలిటీస్ 2.15శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.65శాతం లాభపడ్డాయి. ఆటో, కన్స్యూమర్ డిస్క్రిషనరీ మాత్రం తగ్గాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవ్వగా, యూరప్‌లో లాభాలు కనిపించాయి.
అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. అమెరికా 10-ఏళ్ల బాండ్ యీల్డ్ తగ్గడం, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు మెరుగవ్వడంతో గ్లోబల్‌గా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. రూపాయి డాలర్‌తో 90.66 వద్ద స్థిరంగా ముగిసింది. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) శుక్రవారం నికరంగా రూ. 7,395 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, సోమవారం మరో రూ.400 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 67.59 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
