కోల్కతా: ప్రతిపక్షాల ఇండియా కూటమిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాటమార్చారు. కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి నేతృత్వంలోని సర్కారేనని చెబుతూ.. కూటమికి బయటి నుంచి అన్నిరకాలుగా మద్దతిస్తామని టీఎంసీ చీఫ్ చెప్పారు. కూటమిలో బెంగాల్ కాంగ్రెస్, సీపీఎం పార్టీలు లేవని, అవి రెండూ బీజేపీతో అంటకాగుతున్నాయని ఆరోపించారు.
అందుకే రాష్ట్రంలో ఆ రెండు పార్టీలనూ దూరం పెట్టినట్లు చెప్పారు. ఇండియా కూటమిలో తొలినాళ్లలో చురుగ్గా వ్యవహరించిన మమతా బెనర్జీ.. కాంగ్రెస్ పార్టీతో సీట్ల పంపకంపై విభేదించి బెంగాల్లో సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే రాష్ట్రంలోని మొత్తం 42 లోక్ సభ స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులను నిలబెట్టి మమతా బెనర్జీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇండియా కూటమిలో భాగస్వామ్యంపై తాజాగా మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తప్పకుండా సాయం చేస్తామన్నారు. అయితే, కూటమిలో ఒకటిగా కాకుండా టీఎంసీ బయటినుంచి మద్దతిస్తుందని మమతా బెనర్జీ ట్విస్ట్ ఇచ్చారు.