9 మందిలో ఒకరికి క్యాన్సర్ రాబోతోంది: వాయు కాలుష్యంపై వినీత సింగ్ తీవ్ర ఆందోళన

9 మందిలో ఒకరికి క్యాన్సర్ రాబోతోంది: వాయు కాలుష్యంపై వినీత సింగ్ తీవ్ర ఆందోళన

ముంబై: పెరిగిపోతున్న వాహనాల వినియోగం, ఇతర కారణాలతో దేశంలో రోజురోజుకు వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో దేశ ఆర్ధిక రాజధానిగా పేరొందిన ముంబైలో కూడా గాలి నాణ్యత భారీగా క్షీణిస్తుంది. ముంబైలో గాలి నాణ్యత సూచిక (AQI) 250 దాటింది. ఈ క్రమంలో ముంబైలో క్షీణిస్తోన్న గాలి నాణ్యతపై ప్రముఖ టీవీ షో షార్క్ ట్యాంక్ జడ్జి, షుగర్ కాస్మెటిక్స్ సహ వ్యవస్థాపకురాలు వినీతా సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసిన ఆమె.. ముంబై గాలి కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘నేను ఈరోజు బయటకు వెళ్ళినప్పుడు బస్ స్టాప్‌లలో చిన్న పాఠశాల పిల్లలు నిలబడి ఉండటం, వృద్ధులు వాకింగ్ చేయడం, కొందరు వ్యాయమం చేయడం చూశా. ఏక్యూఐ 160 దాటిన ప్రమాదకరమైన గాలిలో వీరంతా తిరగడం డేంజర్. ప్రమాదకరమైన ఈ వాతావరణంలో వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటాయి’’ అని ఫిట్‌నెస్ ఔత్సాహికులను హెచ్చరించారు.

 ముంబైలో గాలి నాణ్యత పడిపోకుండా అధికారులు తక్షణమే దిద్దుబాటు చర్యలకు దిగాలని ఆమె డిమాండ్ చేశారు. నగరంలో ఏక్యూఐ స్థాయిలు 200కి చేరుకునే వరకు వేచి ఉండాలనుకుంటున్నారా అని అధికారులను ప్రశ్నించారు. నిర్మాణ ప్రదేశాలలో తాత్కాలిక విరామాలు లేదా కఠినమైన దుమ్ము, కాలుష్య నియంత్రణ నిబంధనలు అమలు చేయాలని సూచించారు. 

ముంబైలో గాలు కాలుష్యాన్ని నియంత్రించడానికి చైనా, దక్షిణ కొరియా మాదిరిగా క్లౌడ్ సీడింగ్ (కృతిమ వర్షం) వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు. ఐసీఎంఆర్ అధ్యయనాన్ని ఉటంకిస్తూ.. కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు తీసుకోకపోతే తొమ్మిది మంది భారతీయులలో ఒకరికి వారి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ పురుషులు, స్త్రీలలో క్యాన్సర్‌కు ప్రముఖ కేంద్రాలని అన్నారు. 2020 తో పోలిస్తే 2025 నాటికి క్యాన్సర్ సంభవం 12.8 శాతం పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు.