న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మూడోసారి పార్టీ మీటింగ్కు గైర్హాజరయ్యారు. శుక్రవారం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీల సమావేశానికి ఆయన హాజరుకాలేదు. అయితే, ఆయన ముందుగానే తన గైర్హాజరీ గురించి అధిష్టానానికి సమాచారం అందించారని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ, కాంగ్రెస్ చీఫ్ విప్ మాత్రం తనకు సమాచారం లేదని చెప్పారు. కాగా, థరూర్ ఇలా కీలక సమావేశాలకు వరుసగా గైర్హాజరవుతుండడంతో పార్టీలో అసంతృప్తి, ఆయన పట్ల అనుమానాలు పెరుగుతున్నాయి.
ముందస్తు కార్యక్రమాలు, ప్రయాణాల వల్ల తాను హాజరుకాలేకపోతున్నానని ఆయన వివరణ ఇస్తున్నప్పటికీ.. కీలకమైన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్టీ ఐక్యతను కాపా డుకోవాల్సిన సమయంలో ఇలా గైర్హాజరు కావడం పట్ల పార్టీలో ఆందోళన కలిగిస్తున్నది. థరూర్ కొంత కాలంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పట్ల అనుకూలంగా ఉంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాగే, లోక్‌సభ సమావేశాలకు కాంగ్రెస్ తరఫున ఆయన క్రమంగా హాజరు కావడం లేదు.
