వాషింగ్టన్ డీసీ: రోజురోజుకు పెరిగిపోతున్న టెక్నాలజీ, మార్కెట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఎంట్రీతో ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన బడా కంపెనీల నుంచి చిన్నాచితక ఆఫీసుల్లో కూడా లే ఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. మొన్నటి వరకు ఐటీ కంపెనీలకే పరిమితమైన లే ఆఫ్స్ క్రమంగా ఇతర రంగాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని ప్రముఖ అంతర్జాతీయ వార్తాపత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ లే ఆఫ్స్ ప్రకటించింది.
కంపెనీలోని దాదాపు మూడింట ఒక వంతు మంది సిబ్బందిని తొలగించింది.
ఉద్యోగాలు కోల్పోయిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ కూడా ఉన్నాడు. వాషింగ్టన్ పోస్ట్ ప్రకటించిన లేఫ్స్లో ఇషాన్ థరూర్ కూడా ఉద్యోగం కోల్పోయాడు. అంతర్జాతీయ వ్యవహారాల సీనియర్ కాలమిస్ట్ అయిన ఇషాన్ థరూర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి తొలగించడం, సంవత్సరాలుగా సంస్థలో పని చేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
గుండె పగిలిపోయింది: ఇషాన్ థరూర్
‘‘నన్ను వాషింగ్టన్ పోస్ట్ నుంచి తొలగించారు. నాతో పాటు చాలా మంది అంతర్జాతీయ సిబ్బంది, సహోద్యోగులు కూడా ఉద్యోగాలు కోల్పోయారు. మా న్యూస్ రూమ్.. ముఖ్యంగా పోస్ట్‌కు అంతర్జాతీయంగా సేవలందించిన అసమాన జర్నలిస్టులను తొలగించడంతో నా గుండె పగిలిపోయింది. దాదాపు 12 సంవత్సరాలుగా నా స్నేహితులు, సహకారులుగా ఉన్న ఎడిటర్లు, కరస్పాండెంట్లతో కలిసి పనిచేయడం గౌరవంగా ఉంది” అని ఇషాన్ థరూర్ ట్వీట్లో పేర్కొన్నారు
మరొక పోస్ట్‌లో ఖాళీగా ఉన్న న్యూస్‌రూమ్ చిత్రాన్ని పోస్ట్ చేసి ఇదొక చెత్త రోజు అని అభివర్ణించాడు. కాగా, 2006లో టైమ్ మ్యాగజైన్‌లో రిపోర్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. అంచెలంచెలు ఎదిగి న్యూయార్క్ నగర ప్రాంతానికి సీనియర్ ఎడిటర్‌గా అయ్యాడు. 2014లో న్యూయార్క్ టైమ్‌ను విడిచిపెట్టి వాషింగ్టన్ పోస్ట్‌లో చేరాడు. ఇషాన్ 2017లో వాషింగ్టన్ పోస్ట్‌లో వరల్డ్ వ్యూ కాలమ్‌ను ప్రారంభించారు.
