టీమిండియాలో ప్రస్తుత పరిస్థితుల్లో చోటు దక్కడమనది గగనం. సీనియర్లు, కొత్తవాళ్ల నుంచి విపరీతమైన పోటీ నెలకొంది. ఎంతో మంది దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటి భారత జట్టు పిలుపు అందుకోవడం కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో బీసీసీఐ నుంచి పిలుపు అందుకుని రాణించలేక చోటు కోల్పోయిన వారున్నారు. అయితే ఇలాంటి సమయంలో తొలిసారి టీమిండియాకు ఎంపికవడమే కాదు..తుది జట్టులో స్థానం దక్కించుకుని సత్తా చాటాడు బౌలర్ శివం మావి. ఆడిన తొలి మ్యాచ్లోనే నాలుగు వికెట్లతో చెలరేగి తన కెరీర్ ను ఘనంగా ప్రారంభించాడు.
అరంగేట్రంలోనే అదుర్స్
శ్రీలంకతో జరిగిన ముంబై టీ20లో ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా శుభమన్ గిల్, శివమ్ మావిలకు అవకాశం ఇచ్చాడు. ఇందులో శుభ్‌మన్ గిల్ అరంగేట్రం చేయడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇతడు కొద్ది కాలంగా వన్డేలు, టెస్టుల్లో రాణిస్తున్నాడు. అయితే శివమ్ మావి తొలిసారిగా భారత్ జట్టులో స్థానం సంపాదించాడు. అంతేకాదు మొదటి మ్యాచ్‌లోనే అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని శివం మావి చక్కగా ఉపయోగించుకున్నాడు. ఏకంగా నాలుగు వికెట్లు తీసి..జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రెండు బౌండరీలు..తర్వాత వికెట్లు..
ఈ మ్యాచ్లో రెండో ఓవర్ వేసిన శివం మావి..వేసిన మొదటి ఓవర్లోనే వికెట్ సాధించాడు. తొలి బంతికి పరుగులేమి ఇవ్వలేదు. అయితే రెండు, మూడు బంతులను మెండిస్ బౌండరీకి తరలించాడు. నాల్గో బంతికి సింగిల్ తీశాడు. ఆ తర్వాత 5వ బంతికి నిస్సంకను ఔట్ చేసి ఇంటర్నేషనల్ క్రికెట్లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఇదే క్రమంలో మరో ఓవర్ వేసిన శివం..మరోసారి వికెట్ దక్కించుకున్నాడు. నాల్గో ఓవర్లో మూడు, నాల్గు బంతులకు ఫోర్లు ఇచ్చిన శివం..ఐదో బంతికి ధనంజయను పెవీలియన్ చేర్చాడు. సెకండ్ స్పెల్లోనూ మనోడు మరోసారి విజృంభించాడు. 15 ఓవర్లో హసరంగాను ఔట్ చేశాడు. 18 ఓవర్లో తీక్షణను ఔట్ చేసి..నాల్గో వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అరంగేట్రంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు.
కల నెరవేరింది..
శ్రీలంకపై నాలుగు వికెట్లు తీసుకోవడంపై శివం మావి సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియా తరఫున ఆడాలనే తన కల నెరవేరిందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి 6 ఏళ్లుగా అరంగేట్రం చేసేందుకు కృషి చేశానని చెప్పాడు. ఇన్నాళ్లకు ఆ కృషి ఫలించిందన్నాడు.
మావి కెరీర్..
శివం మావి తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో టీ20ల్లో 46 వికెట్లు తీశాడు. అదే సమయంలో10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 44 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్ ఏలో మావికి 59 వికెట్లు దక్కాయి.