సమాజ్‌వాదీ పార్టీలో చేరిన శివపాల్ యాదవ్

సమాజ్‌వాదీ పార్టీలో చేరిన శివపాల్ యాదవ్

ఉత్తరప్రదేశ్ లో  కీలక పరిణామం చోటుచేసుకుంది.  ప్రగతి శీల సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ తిరిగి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అంతేకాకుండా తన పార్టీని కూడా సమాజ్‌వాదీ పార్టీలో విలీనం చేశారు.  ఈ మేరకు ఆయన కీలక ప్రకటన చేశారు. పార్టీ విలీన ప్రకటన తరువాత తన వాహనం పైన  ఉన్న జెండాను కూడా మార్చారు.  బాబాయ్, అబ్బాయ్ కలిసిపోవడంతో బీజేపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఎస్పీ మద్దతుదారులు అంటున్నారు.   

అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ మధ్య  చాలా సార్లు విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. 2017లో అఖిలేష్  ఎస్పీ బాధ్యతలు స్వీకరించాక.. శివపాల్ సింగ్ యాదవ్  ఎస్పీ నుంచి బయటకు వచ్చి  ప్రగతి శీల సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. అయితే మెయిన్‌పురి లోక్‌సభ ఉపఎన్నికలో ఎస్పీకి సపోర్ట్ చేయాలని అఖిలేష్ ఆయన్ని కోరడంతో కలిసి ప్రచారం చేశారు. 

భారీ మెజార్టీతో డింపుల్ గెలుపు

మెయిన్‌పురి లోక్‌సభ ఉపఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి  డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొంది ఎస్పీ విజయ పరంపరను కొనసాగించారు. బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ షాక్యా పై ఆమె 2.88 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. డింపుల్‌కు 6,18,120 ఓట్లు రాగా, రఘురాజ్ షాక్యాకు 3,29,659 ఓట్లు వచ్చాయి. అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ కు ఉపఎన్నిక అనివార్యమైంది. 

సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోట

మెయిన్‌పురి నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి 1996లో ములాయం తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత  2004, 2009, 2019లో ఈ స్థానం నుంచి విజయం సాధించారు.  2014 ఉప ఎన్నికలో అఖిలేశ్ మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ సీటును గెలుచుకున్నారు.  శివపాల్ సింగ్ యాదవ్ అసెంబ్లీ నియోజకవర్గమైన  జస్వంత్‌నగర్, అఖిలేష్ అసెంబ్లీ నియోజకవర్గమైన కర్హల్.. మెయిన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గం కిందికే వస్తాయి.