V6 News

యువ షూటర్ ఇషా సింగ్‌‌ రికార్డు గోల్డ్‌‌

యువ షూటర్ ఇషా సింగ్‌‌ రికార్డు గోల్డ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  హైదరాబాద్‌‌ యువ షూటర్‌‌ ఇషా సింగ్‌‌ తన గురితో మరోసారి అదరగొట్టింది. నేషనల్‌‌ షూటింగ్‌‌ ట్రయల్స్‌‌లో జూనియర్‌‌ వరల్డ్‌‌ రికార్డ్‌‌ను మించిన స్కోరుతో గోల్డ్‌‌తో పాటు కాంస్యం పతకం సాధించింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన జూనియర్‌‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌‌ పిస్టల్‌‌ ఫైనల్లో ఇషా 244 పాయింట్లతో టాప్‌‌ ప్లేస్‌‌ దక్కించుకుంది. చైనా షూటర్‌‌ జియాంగ్‌‌ రాంక్సిన్‌‌ 243.3 పాయింట్లతో జూనియర్‌‌ వరల్డ్‌‌ రికార్డు నెలకొల్పగా..  ఇషా అంతకంటే ఎక్కువ స్కోరు చేసి ఔరా అనిపించింది. అయితే  ఇంటర్నేషనల్‌‌ టోర్నీ కాదు కాబట్టి  ఆమె రికార్డును పరిగణలోకి తీసుకోరు. కానీ, ఇది నేషనల్‌‌ రికార్డు కానుంది. 242.5 పాయింట్లతో మను భాకర్‌‌ పేరిట ఉన్న నేషనల్‌‌ రికార్డును హైదరాబాదీ అధిగమించింది. దాంతో,  జూనియర్‌‌ మహిళల 10 మీ. ఎయిర్‌‌ పిస్టల్‌‌లో  నేషనల్‌‌ రికార్డు నెలకొల్పడంతో  పాటు నేషనల్‌‌ చాంపియన్‌‌గా నిలిచిన యంగెస్ట్‌‌ షూటర్‌‌గా ఇషా నిలిచింది. అలాగే,  నవంబర్‌‌లో దోహాలో జరిగే ఆసియా చాంపియన్‌‌షిప్‌‌కు కూడా ఎంపికైంది. కాగా, యూత్‌‌ మహిళల 10 మీటర్ల విభాగంలో ఇషా 216.3 స్కోరుతో కాంస్య పతకం గెలిచింది.