శృతి అర్జున్ ఆనంద్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది. కష్టపడి బీటెక్ కంప్లీట్ చేసి, మంచి ఉద్యోగం సంపాదించింది. కానీ.. పెళ్లి తర్వాత ఉద్యోగం వదిలేసి, యూట్యూబ్‌నే కెరీర్‌గా ఎంచుకుంది. తక్కువ టైంలోనే సక్సెస్ అయింది. అంతేకాదు.. తర్వాత వాళ్ల ఫ్యామిలీని కూడా యూట్యూబ్ దారిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ మొత్తంగా ఐదు యూట్యూబ్ ఛానెళ్లను నడుపుతున్నారు.
శృతి అర్జున్ ఆనంద్ ఒక ఫ్యాషన్ -బ్లాగర్, యూట్యూబ్ స్టార్. యూట్యూబ్‌లో అమ్మాయిల కోసం ఫ్యాషన్, బ్యూటీ టిప్స్ చెప్తుంటుంది. అంతేకాకుండా మేకోవర్ ట్యుటోరియల్స్, హెయిర్ స్టైల్స్, కాస్మొటిక్ ట్యుటోరియల్స్, స్కెచ్ కామెడీ బేస్‌డ్ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలు ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంటుంది. అయితే.. యూట్యూబ్‌లో బాగా పేరొచ్చినప్పటి నుంచి మేకప్ ప్రొడక్ట్స్‌ని అన్‌బాక్సింగ్ కూడా చేస్తోంది. వీటితో పాటు లైఫ్ స్టైల్ కంటెంట్‌ని కూడా ఛానెల్‌లో పోస్ట్ చేస్తోంది.
బీటెక్ చదివి..
శృతి అర్జున్ ఆనంద్ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో 27 అక్టోబర్ 1985న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది. ఝాన్సీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. తర్వాత బుందేల్‌ఖండ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ (బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్) పూర్తి చేసింది. తర్వాత కొన్నాళ్లు ఒక కంపెనీలో కంప్యూటర్ ఇంజనీర్‌గా కూడా పనిచేసింది. 21 నవంబర్ 2009న ఇంజనీర్ అర్జున్ సాహుని పెళ్లి చేసుకుంది.
కెరీర్
శృతి బీటెక్ తర్వాత ఒక ఐటీ సర్వీస్ కంపెనీలో కంప్యూటర్ ఇంజనీర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. కానీ.. 2011లో భర్తతో అమెరికా వెళ్లింది. అక్కడామె ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఆ ఒంటరితనం నుంచి బయటపడేందుకే వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ‘‘శృతి అర్జున్ ఆనంద్” పేరుతో ఆమె యూట్యూబ్ కెరీర్‌ని స్టార్ట్ చేసింది. మొదట్లో ‘‘హెయిర్ స్టైల్స్–స్ప్రింగ్ ఫిష్ బ్రెయిడ్” పేరుతో ఒక వీడియో చేసి అప్‌లోడ్ చేసింది. అందులో టిప్స్, ట్రిక్స్ చెప్పింది. మొదటగా ఆ వీడియోకు పెద్దగా వ్యూస్ రాలేదు. అయినా, వరుసపెట్టి వీడియోలు చేసింది.
యూట్యూబ్‌లోనే కెరీర్
ఎక్కువగా బ్యూటీ టిప్స్, ట్రిక్స్, హెయిర్ స్టైల్, మేకప్ ట్యుటోరియల్స్ చేసేది. ఎందుకంటే.. యూఎస్‌లో మేకప్ ప్రొడక్ట్స్ చాలా తక్కువ ధరకు దొరికేవి. కాబట్టి వాటితోనే వీడియోలు చేసేది. తర్వాత 2012లో యూట్యూబ్ ఛానెల్స్‌లోని చాలా వీడియోలు చూసింది. వాటి ద్వారా చాలా కొత్త విషయాలు నేర్చుకుంది. కొన్నాళ్లకు యూట్యూబ్‌లోనే తన కెరీర్ ఉందని డిసైడ్ అయింది. క్వాలిటీ కంటెంట్ చేయడం మొదలుపెట్టింది. 2013 నుంచే యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం మొదలైంది. అదే టైంలో 2013లోనే ఆమె తన ఫ్యామిలీతో పాటు ఇండియాకు తిరిగి వచ్చేసింది. తర్వాత నోయిడాలో సెటిల్ అయ్యారు. శృతి గుర్గావ్‌లో ఉద్యోగం చూసుకుంది. కానీ.. అంత దూరం రోజూ ట్రావెల్ చేయడం ఆమెకు ఇష్టం లేదు. దాంతో ఉద్యోగాన్ని కాదని, వీడియోలు చేయడంపైనే దృష్టి పెట్టింది. భర్త అర్జున్ కూడా ఆమెకు సపోర్ట్ చేశాడు. ఛానెల్ కోసం అతను కూడా పనిచేశాడు. కొన్నాళ్లకు అర్జున్ పూర్తిగా ఛానెల్ కోసమే పనిచేయడం మొదలుపెట్టాడు. శృతి చేసే వీడియోలను 15-–30 ఏండ్ల మధ్య వయసు వాళ్లు ఎక్కువగా చూస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఛానెల్‌కు 9.87 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. శృతి, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎనైస, టాయ్ స్టార్స్, డీఐవై క్వీన్, ఎనైస షార్ట్స్ అనే ఐదు యూట్యూబ్ ఛానెల్స్‌ని నడుపుతున్నారు. వాటిని నడిపేందుకు ‘‘శృతి అర్జున్ ఆనంద్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్”పేరుతో ఒక కంపెనీ కూడా పెట్టారు. ‘‘ఎనైస” ఛానెల్‌కు 13.1 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. అందులో అమ్మాయిలకు మాత్రమే సంబంధించిన అంశాలపై చేసిన వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారు.
నా పని నేను చేశా
‘‘పదకొండేండ్ల క్రితం మొదటి వీడియో చేసినప్పుడు ఒక కంటెంట్ క్రియేటర్ ఎలా ఉండాలో కూడా నాకు తెలియదు. కెమెరాను ఎలా వాడాలో కూడా పూర్తిగా తెలియదు. అంతెందుకు అప్పుడు నా దగ్గర కనీసం ట్రైపాడ్ కూడా లేదు. ఆ వీడియో బాత్రూమ్‌లో షూటింగ్ చేశాను. ఆ వీడియో చూసినవాళ్లు చాలామంది ఎగతాళి చేశారు. కానీ.. ఏమీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ పోయా. నా కష్టానికి ఫలితం దక్కింది. ఇప్పుడు నా సబ్‌స్క్రయిబర్స్ నన్ను ఒక ఫ్రెండ్‌లా భావిస్తున్నారు. నేను కూడా వాళ్లతో బాగా కనెక్ట్ అయ్యా. ఇప్పుడు వీడియోలు చేయడంలో కూడా చాలా మార్పు వచ్చింది. ముందుగా టీమ్‌తో కంటెంట్ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత స్క్రిప్టింగ్, కాస్టింగ్, ఇతర ప్రి -ప్రొడక్షన్ పనులు మొదలుపెడతాం. అవి పూర్తికాగానే షూటింగ్ చేస్తాం. చివరకు పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌కి వీడియోని పంపిస్తాం. తర్వాత వీడియో గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రమోట్ చేస్తాం. వీడియోలను ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు అప్‌లోడ్ చేస్తాం”అంటూ... ఆమె యూట్యూబ్ జర్నీని చెప్పుకొచ్చింది శృతి.
మరిన్ని వార్తల కోసం
