‘సైకిల్’కు మళ్లీ పెరుగుతున్న క్రేజ్

‘సైకిల్’కు మళ్లీ పెరుగుతున్న క్రేజ్

ఒకప్పుడు పక్క ఊరికి, పొలం పనులకి, కిరాణా, బట్టల షాపుకి... ఎక్కడికి పోవాలన్నా... సైకిల్‌‌ ఎక్కాల్సిందే. పెడల్​ తొక్కాల్సిందే.
ఇంటింటికీ తిరిగి పాలపోసే వాళ్ల దగ్గరి నుంచి మొదలు.. పేపర్‌‌ బాయ్స్​, పోస్ట్ మ్యాన్​ల వరకు సైకిల్​ లేనిదే పని కాదు. 
కానీ, ఇప్పుడు... ఎటు చూసినా, ఖరీదైన కార్లు, రయ్​మని దూసుకెళ్లే డుగ్గుడుగ్గు బండ్లు. 

ఎవరి కెపాసిటీని బట్టి వాళ్లు రకరకాల వెహికల్స్​ వాడుతున్నారు. అలాగని సైకిల్​ని వదిలేశారా! అంటే లేదు.
అందుకే ఒకప్పుడు రెండుచక్రాలు, చెయిన్​తో నడిచిన సైకిల్స్​ కాస్తా రూపురేఖలు మార్చుకుంది.
గేర్లు పెట్టుకుని ఇప్పటి జనరేషన్​కు తగ్గట్టు మోడర్న్​ లుక్​తో ఎవర్​గ్రీన్​గా ఉన్నానంటోంది. 
అడ్వెంచర్​ చేసేందుకు, హెల్త్​ ఇచ్చేందుకు, ఫ్యాషన్​ ఐకాన్​గా ఉండేందుకు ‘నేనున్నా’ అంటున్న సైకిల్​ కథాకమామీషు ఇది.

మనదేశంలో సైకిల్​ను 90ల్లో బాగా వాడేవాళ్లు. ఏ ఊళ్లో చూసినా సైకిళ్లు చాలా ఎక్కువగా కనిపించేవి. అంతెందుకు పెండ్లిండ్లకి కట్నకానుకల్లో సైకిల్‌‌ పెట్టడం ఆనవాయితీగా కూడా ఉండేది అప్పట్లో. సొంతంగా సైకిల్​ లేకపోయినా పావలా, అర్థ రూపాయి ఇస్తే సైకిల్​ అద్దెకు దొరికేది ఒకప్పుడు. దాంతో సైకిళ్లు అద్దెకు ఇచ్చే సెంటర్లు పల్లెటూళ్ల నుంచి పట్టణాల వరకు బాగానే ఉండేవి. ఇప్పుడు కూడా అక్కడక్కడ సైకిల్స్​ అద్దెకు ఇచ్చే సెంటర్లు ఉన్నాయి. పెద్ద పెద్ద సిటీల్లో సైకిల్​ క్లబ్​లు నడుస్తున్నాయి కూడా. వీటిలో మామూలు సైకిల్​ నుంచి అల్ట్రామోడర్న్​ గేర్​ సైకిళ్ల వరకు అద్దెకు దొరుకుతున్నాయి. అంటే ట్రెండ్​ మారిందే కానీ సైకిల్​ మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది కదా.    
ఇప్పటి విషయాల్లోకి వెళ్లేముందు... ఒకప్పుడు మన జీవితాలతో సైకిల్​ ఎంతగా ముడిపడి ఉండేదో తెలుసుకోవాల్సిందే. ఉన్న ఊళ్లో తిరగడానికే కాదు, పక్క ఊరికి వెళ్లాలన్నా... ఎన్ని కిలోమీటర్లైనా అవలీలగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేవాళ్లు. ఇంటిల్లిపాదీ సైకిల్​ మీదే పెండ్లిండ్లకు, పేరంటాలకూ వెళ్లేవాళ్లు. చిన్నపిల్లలకి సైకిల్​ తొక్కడం రాకపోయినా, కాళ్లు అందకపోయినా నానా తిప్పలు పడేవాళ్లు. నాన్నదో, బాబాయిదో సైకిల్​ తీసుకుని కాంచీ తొక్కుడు నేర్చుకునేవాళ్లు. అలా నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు పడతారో, ఎన్ని దెబ్బలు తగిలించుకుంటారో.. తిరిగి ఇంటికి వచ్చాక దెబ్బలకు మందు పూయించుకుంటూ అంతకు రెట్టింపు చివాట్లు తింటారు అమ్మతో. అయినా సరే మరుసటి రోజు మళ్లీ యథా మామూలే. ఇది పిల్లల సరదా... అంతేనా కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేసేది సైకిల్. ఉదాహరణకు ఇంట్లో సరుకులు అయిపోయాయి, చేతిలో డబ్బుల్లేవు. ఏంటి పరిస్థితి? వెంటనే సైకిల్​ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుని ఇంటి అవసరాలు తీర్చుకునే వాళ్లు. ఆ రోజుల్లో మోటారు బైక్​లు తక్కువ. అయితేనేం సైకిలే అన్ని రకాలుగా దారి చూపేది. రాత్రిళ్లు ఎక్కడికైనా వెళ్లాలంటే ‘తోడున్నా... పద’ అనేది సైకిల్. హెడ్​లైట్ (డైనొమొ) పెట్టుకుని,  సైకిల్ చక్రాలకు లైట్లు, రేడియం స్టిక్కర్స్ అతికించుకుని రయ్​మంటూ చీకట్లో ప్రయాణాలు చేసేవాళ్లు. చెప్పుకుంటూ పోతే సైకిల్​తో ముడిపడిన జ్ఞాపకాలు.... బోలెడు ఉంటాయి. ఇప్పటికీ చిన్నపిల్లలు సైకిల్ తొక్కడం చూసి, తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోని పెద్దవాళ్లు ఉండరు. ఆ కాలం సినిమాల్లో కూడా కార్లకంటే సైకిల్​కే క్రేజ్​ ఎక్కువ.

‘మగమహారాజు’ సినిమాలో ఒక పాటలో చిరంజీవి ఎనిమిది రోజుల పాటు నాన్‌‌ స్టాప్‌‌గా సైకిల్‌‌ తొక్కడం ఏ రేంజ్​లో పాపులర్ అయిందో అప్పటివాళ్లకు తెలుసు. ఆ తర్వాత ‘ఆర్య’లో అల్లుఅర్జున్, ‘నాన్నకు ప్రేమతో’లో జూనియర్ ఎన్టీఆర్, ‘శ్రీమంతుడు’లో మహేశ్‌‌బాబు.. ఇలా సినిమా హీరోలు కూడా సైకిల్​ను ఇప్పటికీ వాడుతున్నారు. దాంతో యూత్​లో కూడా సైకిల్ క్రేజ్​ పెరుగుతూనే ఉంది. 

రన్నింగ్ మెషిన్
అయితే ఈ సైకిల్ ఇప్పటిది కాదు. చరిత్రలో కొన్ని పేజీలు ముందుకెళ్లి తిరగేయాల్సిందే. మొదట్లో ‘దండి హార్స్’ అనే రెండు చక్రాల వాహనం ఉండేది. దీన్ని జర్మనీకి చెందిన బ్యారన్ కార్ల్ వాన్ డ్రైస్​ అనే వ్యక్తి తయారుచేశాడు. దండి హార్స్ అంటే.. ‘రన్నింగ్ మెషిన్’ అని అర్థం. దీన్ని మొదటి సైకిల్ అనేవాళ్లు. కాకపోతే ఈ సైకిల్​కి పెడల్స్ ఉండవు. దీన్ని1817లో మన్హెమ్​లో, 1818లో పారిస్​లో జనాల కోసం ఎగ్జిబిట్​ చేశారు. పెడల్స్ లేవంటున్నారు? అవి లేకపోతే నడిపేది ఎలా? అనే సందేహం వచ్చిందా. దానికో టెక్నిక్​ ఉంది. సైకిల్ మీద కూర్చుని, కాళ్లని వెనక్కి నెడుతూ హ్యాండిల్​ని ముందుకు నెడుతూ నడపాలన్నమాట.పెడల్ ఉండే సైకిల్స్1839లో వచ్చాయి. స్కాటిష్ బ్లాక్​స్మిత్ అయిన కిర్క్​పాట్రిక్​ మెక్​మిల్లన్ అనే ఆయన దీన్ని తయారుచేశాడు. ఆ తరువాత నుంచి సైకిల్ వాడకం పెరిగింది. దాంతోపాటు రోడ్డు మీద ట్రాఫిక్ కూడా పెరిగింది. ఆ ట్రాఫిక్​లో ఒకసారి ఒక పెద్దాయన చిన్నపిల్లని ఢీ కొట్టాడు. దానికి శిక్షగా ఐదు షిల్లాంగ్స్ ( ప్రస్తుతం 24యూరోలు) జరిమానా విధించారు. ఆ విషయం వార్త అయ్యి న్యూస్​ పేపర్​లో కూడా పబ్లిష్​ అయింది.

ఆ తర్వాత1860లో ఫ్రాన్స్​​కి చెందిన​ పియర్రె మిచాక్స్, పియర్రె లాల్లెమెంట్ అనే ఇద్దరు కలిసి సైకిల్​కి మరో డిజైన్​ కనిపెట్టారు. దాన్ని ‘వెలోసిపెడ్​’ అనేవాళ్లు. దాని తరువాత డగ్లస్ గ్రాసో, థామస్ మెక్ కాల్ అనే వ్యక్తులు వాటి మీద రకరకాల ప్రయోగాలు చేశారు. పారిస్​కు చెందిన యుజీన్ మేయర్ అనే అతను కూడా ఎక్స్​పరిమెంట్స్​ చేసి, వైర్​తో సైకిల్ చువ్వలు తయారుచేసి పేటెంట్ తీసుకున్నాడు. ఇదంతా బాగానే ఉంది అసలు సైకిల్ అనే పేరు ఎప్పుడొచ్చింది?

వెలోసిపెడ్​ని ఇనుము, చెక్కతో తయారుచేశారు. దాన్ని ‘పెన్ని ఫార్తెనింగ్’ అని పిలిచేవారు. అంటే ఫ్రెంచ్​లో దాని అర్థం ‘బైసైకిల్’​ అని. కాకపోతే దీని చక్రాలు ఒకేలా ఉండవు. ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. దీనికి గొట్టంలాంటి స్టీల్ ఫ్రేమ్, వైర్​తో చేసిన చువ్వలు, గట్టిగా ఉండే రబ్బరు టైర్లు ఉండేవి. అయితే పెద్ద చక్రం వల్ల దీన్ని నడపడం కష్టమయ్యేది. ఆ తర్వాత1868, కొవెంట్రీ సూయింగ్ మెషిన్ కంపెనీలో సేల్స్ ఏజెంట్​గా పనిచేస్తున్న రోలె టర్నర్ అనే వ్యక్తి మిచాక్స్ సైకిల్​ని కొవెంట్రీకి తీసుకెళ్లాడు. అక్కడ అతని అంకుల్ జోసియా టర్నర్ దాన్ని చూశాడు. అది నచ్చి వెంటనే తన బిజినెస్ పార్ట్​నర్​ జేమ్స్ స్టార్లేకి చూపించాడు. అప్పుడు వాళ్లకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఇద్దరూ కలిసి ‘కొవెంట్రీ మోడల్’ పేరుతో బ్రిటన్​లో మొదటిసారిగా సైకిల్ ఫ్యాక్టరీ మొదలుపెట్టారు. 

రోరింగ్ ‘రోవర్’
సైకిల్ ఫ్యాక్టరీ వచ్చాక కూడా ఎన్నో ఎక్స్​పరిమెంట్స్​  జరిగాయి. రకరకాల సైకిల్స్ మార్కెట్​లోకి వచ్చాయి. మొదటి సైకిల్​కి పెడల్స్ లేవు. ఆ తర్వాత వచ్చినవాటికి చెయిన్ లేదు. అలా రకరకాల మార్పులు జరిగి ఒక పర్ఫెక్ట్ సైకిల్ రెడీ కావడానికి చాలాకాలమే పట్టింది. దాన్ని తయారుచేసింది.. స్టార్లే కంపెనీ.1886లో ‘రోవర్’ అనే మోడల్ కనిపెట్టారు. అదే మనం ఇప్పుడు వాడుతున్న సైకిల్. దాన్ని గుర్తుగా బ్రిటీష్ మోటార్ మ్యూజియంలో భద్రంగా ఉంచారు. 1870లో సైకిల్ క్లబ్​లు కూడా వచ్చాయి.1878లో అట్లాంటిక్​లో ‘ది బైసైకిల్ టూరింగ్ క్లబ్’ నడిపారు.1888లో ఇంగ్లాండ్​లోని నాటింగ్హామ్​లో రాల్హీ బైసైకిల్ కంపెనీ మొదలుపెట్టారు. అది సైకిల్స్ తయారుచేసే అతిపెద్ద కంపెనీగా ఫేమస్ అయింది. ఏడాదికి రెండు మిలియన్​ల సైకిల్స్ తయారుచేసేది ఆ కంపెనీ. 
ఆ తర్వాత సైకిల్ క్రేజ్ పెరగడంతో..1890ని ‘గోల్డెన్ ఏజ్​ ఆఫ్​ బైసైకిల్స్’ గా పిలిచేవారు.

అయితే ఇన్ని మార్పులు చేసుకున్న సైకిల్స్​కు అప్పటికీ బ్రేక్​లు లేకపోవు. అదే ఏడాది కోస్టర్ బ్రేక్స్​ని కూడా తయారుచేశారు. దానికంటే ముందు1889లోనే ఐర్లాండ్​లో మొట్టమొదటిసారి సైకిల్ రేస్​లు జరిగాయి. ఆ తర్వాత ఇంగ్లాండ్​లోనూ సైకిల్ రేస్​లు జరిగాయి.19వ శతాబ్దంలో సైకిల్ గురించి అడ్వర్టైజ్​మెంట్​లు, ప్రొడక్షన్, వాడకం ఎక్కువైంది. 21వ శతాబ్దం మొదట్లో సైకిల్ అనేది కామన్ వెహికల్ అయిపోయింది. మరి అంత కామన్ అయిందంటే... వాడకం పెరిగిపోతుంది. వాడకం పెరిగింది అంటే అవసరాలకు తగ్గట్టు ప్రొడక్ట్​లో మార్పులు మొదలవుతాయి. అలానే సైకిల్ స్టోరీలో ఛేంజెస్​ చాలా వచ్చేశాయి. టూర్​లకు వెళ్లడానికి, పర్వతాల్లో నడపడానికి, ఫిజికల్ ఫిట్​నెస్​కి, రకరకాల సైకిల్ రేసింగ్​లకు... సైకిల్​ను​ వాడుతున్నారు. వాటిలో కొన్ని రకాలు ఇవి.

సైకిల్​లో చాలా రకాలున్నాయి. మామూలుగా సైకిల్ అంటే రెండు చక్రాలుండాలి. కానీ, ఒకటి, మూడు, నాలుగు చక్రాలుండేవి కూడా ఉన్నాయి. ఒక చక్రం ఉంటే ‘యూనీ సైకిల్’, మూడుంటే ‘ట్రైసైకిల్’, నాలుగుంటే ‘క్వాడ్ర సైకిల్’ అంటారు. మామూలు సైకిల్ రకాల్లో యుటిలిటీ, మౌంటైన్, రేసింగ్, టూరింగ్, హైబ్రిడ్, క్రూయిజర్, బిఎంఎక్స్​ ఉన్నాయి. కొంచెం తక్కువగా టాండెమ్, లో రైడర్స్, టాల్, ఫిక్స్​డ్​ గేర్, ఫోల్డింగ్ మోడల్స్, యాంబిషియస్, కార్గో, రికంబెంట్స్, ఎలక్ట్రిక్​ సైకిల్స్ అనే రకాలు వాడుతున్నారు. 

మనదగ్గర టాప్ ఇవి...
మనదగ్గర టాప్​లో పది రకాలున్నాయి. లీడర్ స్కౌట్ మౌంటెన్ బైక్, ఓమో బైక్స్ హైబ్రిడ్ సైకిల్, హీరో స్ప్రింట్ మాంక్, హీరో స్ర్పింట్ ప్రొ సెరలో, బిఎస్ఎ ఫోటాన్ ఎక్స్, బిఎస్​ఎ లేడీబర్డ్ హేజల్, హెర్క్యులస్ డైనర్ రోడ్, హెర్క్యులస్ ఫ్లంక్, కొక్కటు మౌంటెయిన్, స్ట్రైడర్ ఐ–రైడ్ రోడ్ బైక్​.

టాప్ టెన్ బ్రాండ్స్​
మనదేశంలోనే అతిపెద్ద సైకిల్ బ్రాండ్ హీరో. ఈ కంపెనీ ఏడాదికి 7.5 మిలియన్ సైకిల్స్​ తయారు చేస్తుంది. పంజాబ్​లోని లూధియానా, ఉత్తరప్రదేశ్​లోని ఘజియాబాద్, బిహార్​లోని బిహ్తలతోపాటు శ్రీలంకలోనూ మాన్యుఫాక్చరింగ్​ యూనిట్స్​ ఉన్నాయి. అంతేకాకుండా 70 దేశాలకు ఎగుమతి కూడా అవుతున్నాయి. 
రెండో అతిపెద్ద భారతీయ సైకిల్ బ్రాండ్ అట్లాస్. చిన్నపిల్లల నుంచి అథ్లెట్స్ వరకు ఎవరైనా తొక్కగలిగే సైకిల్స్ తయారుచేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. ఈ సైకిళ్లను ఆన్​లైన్​లో కూడా ఆర్డర్ చేయొచ్చు.
ఆ తరువాతి స్థానాల్లో అవొన్, హెర్క్యులస్, లా సావరిన్, బిఎస్​ఎ లేడీబర్డ్, ఫైర్ ఫాక్స్, మాంట్రా, మాచ్ సిటీ, రోడ్ మాస్టర్​లు టాప్​ టెన్ లిస్ట్​లో ఉన్నాయి.  
ఎలక్ట్రిక్ సైకిల్ హవా
లేటెస్ట్​గా ఎలక్ట్రిక్​ సైకిల్స్ మార్కెట్​లో సందడి చేస్తున్నాయి. వాటి క్రేజ్​ రోజురోజుకీ పెరుగుతోంది. చాలా రోజులుగా గ్లోబల్‌‌ వార్మింగ్‌‌ గురించి ప్రపంచమంతా చర్చ నడుస్తోంది. నేచర్​ని కాపాడుకోవాలని చెప్తోంది. సైకిల్‌‌ తొక్కడం వల్ల హెల్త్​కి మంచిది. అలాగే సైకిల్‌‌తో అనేక ఉపయోగాలు ఉన్నాయి.. అంటూ సైకిల్​ వాడాలని ప్రచారం చేస్తోంది. దాంతో ఎలక్ట్రిక్ సైకిళ్ల వైపు మొగ్గు చూపేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు భారీ ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. 
పాత సైకిల్​.. కొత్త ఇ– బైసైకిల్
భారత్‌‌లో ఎలక్ట్రిక్‌‌ వాహనాల వాడకం బాగా పెరిగింది. పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరుగుతుండడంతో ఎలక్ట్రిక్‌‌ వాహనాలే మేలంటున్నారు చాలామంది. ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్​పై సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్​ కూడా ఆఫర్లు అందిస్తున్నాయి. అంతేకాదు, కొన్ని ఎలక్ట్రిక్‌‌ వెహికల్​కంపెనీలు కూడా కస్టమర్స్​కు భారీగా ఆఫర్లు ఇస్తున్నాయి. 
ఇ–-బైక్స్‌‌పై అమ్మకాలను మరింత పెంచేందుకు గోజీరో మొబిలిటీ ‘‘స్విచ్’’ అనే ఒక ఎక్స్ఛేంజ్​ ఆఫర్ ప్రకటించింది. అందులో భాగంగా కస్టమర్స్‌‌ దగ్గరున్న పాత సైకిల్‌‌ ఇచ్చి, ఇ-–బైసైకిల్ తీసుకెళ్లొచ్చని గోజీరో చెప్పింది. అలాగని ఫలానా బ్రాండ్​ సైకిలే తీసుకుంటామని చెప్పలేదు. ఏ బ్రాండ్ సైకిల్​ అయినా సరే, ఏడు వేల రూపాయల నుంచి పాతిక వేల రూపాయల విలువ చేసేదైతే చాలు. దాన్ని ఇచ్చేసి కొత్త ఇ–-బైసైకిల్​ను తీసుకెళ్లొచ్చని చెప్పింది. ఈ ఆఫర్ కోసం గోజీరో కంపెనీ ఎలక్ట్రిక్ వన్, సారధి ట్రేడర్స్, గ్రీవ్స్​ ఈవీ ఆటో మార్ట్, ఆర్యేంద్ర మొబిలిటీ వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇ–-బైక్స్‌‌ ధర 34,999 రూపాయల నుంచి 45,999 రూపాయలు. ఈ ఆఫర్‌‌ ఈ ఏడాది జనవరి10 నుంచి ఏప్రిల్ 9వరకు అమల్లో ఉండింది.

వెంట పట్టుకెళ్లొచ్చు!
సైకిల్ ఎక్కడికెళ్లినా చంకలో పెట్టుకుని వెళ్లగలమా? కానీ, ‘ఈ సైకిల్​ అయితే భేషుగ్గా తీసుకెళ్లొచ్చు’ అని గట్టిగా చెప్తున్నారు. దానిపేరే ఫోల్డబుల్‌‌ ఎలక్ట్రిక్‌‌ సైకిల్‌‌. ఏదైనా వస్తువుని చేత్తో పట్టుకుని తీసుకెళ్లినట్లు, ​సైకిల్​ని కూడా తీసుకెళ్లొచ్చు. దీన్ని కచ్‌‌బో డిజైన్స్ ఫౌండర్​లు నిషిత్‌‌ పారిఖ్, రాజ్‌‌కుమార్‌‌ కేవత్‌‌లు తయారుచేశారు. వీళ్లిద్దరూ ఐఐటీ స్టూడెంట్స్. ఈ హార్న్‌‌ బ్యాక్‌‌ సైకిల్​ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 30 కి.మీ దాకా మైలేజ్‌‌ ఇస్తుందని వాళ్లు చెప్పారు. 

పాత సైకిల్‌‌ రీమోడల్ 
ఆదిలాబాద్‌‌ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన బైక్‌‌ మెకానిక్‌‌ అబ్దుల్‌‌ జలీల్‌‌ ఇ–సైకిల్‌‌ తయారుచేశాడు. కేవలం ఆరువేల రెండొందల రూపాయలతో పాత సైకిల్‌‌ను ఇ–సైకిల్‌‌గా మార్చేశాడు. 20 ఏండ్లుగా బైక్‌‌ మెకానిక్​గా పనిచేస్తున్న జలీల్‌‌కు ఒక ఐడియా వచ్చింది.  ఆలస్యం చేయకుండా ఐడియా షురూ చేశాడు. రెండు బ్యాటరీలు, ఎక్స్‌‌లేటర్, మోటార్‌‌లతో     ఇ–సైకిల్‌‌ తయారుచేశాడు.
దీనికి గంటన్నర ఛార్జింగ్‌‌ పెడితే, గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఇరవై కిలోమీటర్లు జర్నీ చేసేయొచ్చు అంటున్నాడు జలీల్‌‌. ముందుగా పాత సైకిల్‌‌తో ఈ ఎక్స్​పరిమెంట్ చేశాడట. 21 వేల రూపాయలతో కొత్త సైకిల్‌‌తోపాటు 40 కిలోమీటర్లు ప్రయాణించే సైకిల్‌‌ను త్వరలో తయారు చేస్తా అంటున్నాడు జలీల్. 

అతి పెద్ద సైకిల్‌‌ పార్కింగ్‌‌


ఒకప్పుడు మనదేశంలో స్కూల్స్​, కాలేజీ​లు, సినిమా హాల్స్ వంటి వాటి దగ్గర సైకిల్ స్టాండ్​లు ఉండేవి. ఇప్పుడవి దాదాపుగా లేవని చెప్పొచ్చు. ఎందుకంటే మన దేశంలో సైకిల్‌‌ వాడకం చాలా తగ్గిపోయింది. కానీ, నెదర్లాండ్స్‌‌లో మాత్రం సైకిళ్లను విపరీతంగా వాడతారు. స్కూల్​, కాలేజీ, ఆఫీస్​లకు వెళ్లడం దగ్గర నుంచి షాపింగ్‌‌ మాల్స్‌‌, సినిమా హాల్స్​ వరకు సైకిల్‌‌ మీదే వెళ్తారు. వెరైటీ కార్లు, బైక్​లు వస్తున్నాయి కదా! అంటే... ‘‘ఆ వెహికల్స్​ వాడి, పొల్యూషన్​ పెంచి నేచర్​ని దెబ్బతీయడం కంటే, హ్యాపీగా సైకిల్​ వాడడమే మంచిది. దానివల్ల నేచర్​కే కాదు, మనం కూడా ఫిట్​గా ఉంటాం’’ అంటారు వాళ్లు. కాలుష్యాన్ని తగ్గించాలనే ఆలోచనతోనే సైక్లింగ్‌‌కే ఓటేస్తున్నారు వాళ్లు.

ఫ్రీ పార్కింగ్​ 
అందరూ సైకిల్స్ వాడుతుంటే సైకిల్ పార్కింగ్​ల సంఖ్య కూడా పెరుగుతుంది కదా. నెదర్లాండ్స్‌‌లోనూ అదే జరిగింది. సైకిల్‌‌ పార్కింగ్‌‌లు చాలా చోట్ల ఉంటాయి. అంతేకాదు, వాటిలోనూ ఉట్రెచ్‌‌ సిటీలోని స్టేషన్‌‌కి దగ్గర్లో ఉన్న సైకిల్‌‌ పార్కింగ్‌‌ ప్రపంచంలోనే అతి పెద్దది. 2019 ఆగస్టు 19న దీన్ని ప్రారంభించారు. దీన్ని ఉట్రెచ్​ మునిసిపాలిటీ, ప్రోరైల్, ఎన్‌‌ఎస్‌‌ (డచ్‌‌ రైల్‌‌) కలిసి నిర్వహిస్తున్నాయి.

రైల్‌‌ ప్రయాణం చేసేవాళ్లు తమ సైకిల్‌‌ను పార్క్‌‌ చేసుకోవడానికి ఈ భారీ పార్కింగ్‌‌ బిల్డింగ్‌‌ కట్టారు. మూడు అంతస్తులు ఉండే ఈ బిల్డింగ్‌‌లో ప్రతి చోట సైకిల్స్​ను గమనించేందుకు బాయ్స్ ఉంటారు. ఆ ప్లేస్​ల్లో దాదాపు12, 656 సైకిల్స్ పెట్టొచ్చు. దానిలో కొంత ప్లేస్​ రెంట్‌‌ సైకిల్స్‌‌కు ఉంటుంది. రెండు ఎంట్రన్స్‌‌లు ఉండే ఈ బిల్డింగ్‌‌లో వన్‌‌వే ఫెసిలిటీ మాత్రమే ఉంది. ఇది ఉట్రెచ్​ రైల్వేస్టేషన్​కు దగ్గర్లో ఉంటుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా రోజంతా తెరిచే ఉంటుంది ఈ పార్కింగ్ ప్లేస్. పైగా ఫ్రీ పార్కింగ్​.

పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ చిప్‌‌కార్డు సాయంతో పార్కింగ్‌‌ చేసుకోవచ్చు. ఇది పెద్ద బిల్డింగ్‌‌లో ఉంటుంది. కాబట్టి సైకిళ్లకు ఎండ తగలదు. వానలో తడవవు. సేఫ్​గా ఉంటాయి. ఇక్కడి కారిడార్లలో కూడా సైకిల్‌‌ తొక్కొచ్చు. ఈ పార్కింగ్​లోనే.. వెరైటీ మోడల్​ సైకిళ్లకు స్పెషల్ ప్లేస్ ఉంది. అంటే పెద్ద హ్యాండిల్‌‌ బార్, డెలివరీ బ్యాగ్‌‌లను తీసుకెళ్లే సైకిళ్ల కోసం స్పెషల్​ పార్కింగ్‌‌ అన్నమాట. అంతేకాదు, ఒక వేళ సైకిల్ పాడైతే అనే బెంగ అక్కర్లేదు. అక్కడే సైకిల్‌‌ రిపేర్​కి కావాల్సిన సామాన్లు కూడా ఉంటాయి. 

మూడు చక్రాల సైకిల్
స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్​ కోసం, ట్రై సైకిల్ కనిపెట్టారు. వాటిని నడపాలంటే కాళ్లతో పనిలేదు. చేతులతో నడపొచ్చు అనే ఉద్దేశంతో అలా తయారుచేశారు. అయితే ఇంకాస్త సులువు చేస్తూ ఈ మధ్య ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ మార్కెట్​లోకి వచ్చాయి. వాటికైతే బ్యాటరీ ఉంటుంది. కాబట్టి ఛార్జింగ్ పెట్టుకుని వాడొచ్చు. చేతులకు అంత పని కూడా ఉండదు. సైకిల్ మీద ప్రయోగాలు ఇంతటితో ఆగలేదు. ఛార్జింగ్​ పెట్టే అవసరం లేకుండా, సోలార్ పవర్​తో నడిచేలా ఎక్స్​పరిమెంట్స్​ చేశారు. 

వాచ్​ మేకర్ కనిపెట్టాడు
మొట్టమొదట ట్రైసైకిల్ తయారుచేసింది జర్మనీకి చెందిన స్టెఫన్ ఫార్​ఫ్లెర్. ఈయన ఫిజికల్లీ ఛాలెంజ్డ్. 1600ల కాలంలో దీన్ని కనిపెట్టాడు. వాచ్​లు తయారుచేస్తుండే స్టెఫన్‌‌ నడవలేడు. దాంతో ‘ఉన్నచోటనే ఉండిపోకూడదు. ఎలాగైనా సరే నేను కదలాలి’ అనుకున్నాడు. చేతులతో నడిపేలా ఒక వెహికల్ తయారుచేశాడు. 1789లో పెడల్స్​తో వాడేలా మూడు చక్రాల సైకిల్​ని డెవలప్​ చేశారు ఇద్దరు ఫ్రెంచ్​ ఇన్వెంటర్​లు. ఆ తర్వాత బ్రిటీష్ ఇన్వెంటర్ డెనిస్ జాన్సన్ పేటెంట్ కూడా తీసుకున్నాడు.  

సోలార్ ట్రైసైకిల్ 


మహబూబ్‌‌నగర్‌‌కు చెందిన పవన్‌‌కుమార్, పి. సుమేల్ అనే ఇద్దరు స్టూడెంట్స్ 2014 సైన్స్​ ఎగ్జిబిషన్​లో భాగంగా సోలార్ ట్రైసైకిల్​ తయారుచేశారు. ట్రైసైకిల్‌‌కు సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, ఛార్జింగ్ కంట్రోల్ కోసం డీసీ మోటారు వాడారు. పూర్తిగా సోలార్ పవర్‌‌తోనే నడుస్తుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా పవర్​, బ్యాటరీలకు చేరి వాటిలో నిల్వ ఉంటుంది. తర్వాత అవసరం ఉన్నప్పుడు ఆ పవర్​ను వాడుకోవచ్చు. ట్రై సైకిల్​కి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టారు. అందువల్ల రెండు లాభాలు ఒకటి ఛార్జింగ్ పెట్టుకునే బాధ ఉండదు. రెండోది ఎండలో, వానలో కూడా సేఫ్​గా బయటికి వెళ్లొచ్చు. 


సైక్లింగ్ క్లబ్


ఒకప్పుడు సైకిల్ అవసరం, కానీ, ఇప్పుడు ఫ్యాషన్. అయితే ‘‘ఫ్యాషన్​ కోసం కాదు, సైక్లింగ్ అనేది స్పోర్ట్. ఫిట్​నెస్​ కోసం తొక్కాలి. సైకిల్ తొక్కడం వల్ల ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. నేచర్​ని, హెల్త్​ని కాపాడుకోవడానికి సైకిల్ వాడాలి’’ అంటున్నారు  తెలంగాణలో  ‘హైదరాబాద్ సైకిల్ క్లబ్’ వాళ్లు. 2007లో కృష్ణ వాడి అనే అతను ఈ క్లబ్​ మొదలుపెట్టాడు. దీని ఛైర్మన్, ఆర్గనైజర్ డి.వి. మనోహర్​. ఈ క్లబ్ పొద్దున ఆరు గంటల నుంచి పది గంటల వరకు.., సాయంత్రం నాలుగింటి నుంచి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది.

ఆదివారాల్లో ఉదయం ఐదున్నర నుంచి పదకొండు వరకు ఓపెన్​ చేస్తారు. హైదరాబాద్‌‌ సిటీలోని ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కరోజైనా సైకిల్‌‌ నడిపి ఆరోగ్యంగా ఉండాలనేది ఆ గ్రూపు ల‌‌క్ష్యమ‌‌ట. ప్రతి ఆదివారం హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల100 కిలోమీటర్ల దూరం వెళ్లి వస్తారు. మొన్నామధ్య సుచిత్ర రోడ్ నుంచి శంషాబాద్‌‌లోని అమ్మపల్లి దేవాలయం వరకు 90 మంది సభ్యులతో సైకిల్​ యాత్ర చేశారు. ఎకో ఫ్రెండ్లీ రైడ్స్​ చేయించడం, సైక్లింగ్​ కూడా ఒక స్పోర్ట్ అనే అవేర్​నెస్ కల్పించడం, అడ్వెంచర్ స్పోర్ట్​ ఇష్టపడేవాళ్ల కోసం ఈ క్లబ్​ పని చేస్తుంది.   

రెంటల్​ ఫ్రీ సైకిల్స్​ 
ఈ క్లబ్​లో సైక్లింగ్ చేసేవాళ్లకు చాలా ఆఫర్లు ఉన్నాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా నెలలో ఒక వారంపాటు అద్దె లేకుండా ఫ్రీగా సైకిల్ తొక్కే అవకాశం ఇచ్చారు. అలాగే కిందటి ఏడాది డిసెంబర్​లో ఇయర్ ఎండ్ ఆఫర్ అని వారం రోజులు రెంట్ తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చారు. ఆగస్ట్​లో నేషనల్ స్పోర్ట్స్​ డే సందర్భంగా కూడా వారం రోజులు రెంట్​ తీసుకోకుండా సైకిల్స్ ఇచ్చారు.

నవంబర్​లో శ్రీనగర్​ నుంచి​ మొదలుపెట్టి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్​ చేశారు. వాళ్లలో16 ఏండ్ల టీనేజర్స్​ నుంచి 67ఏండ్ల వ్యక్తి కూడా పాల్గొన్నారు.  డిసెంబర్​ 25 నుంచి 31 వరకు ‘నో మోటార్​ వెహికల్ డే’ పేరుతో సైక్లింగ్ చేశారు. ఇది ఇప్పుడు అమెరికాలోని డెన్వర్ ఫ్రంట్ రేంజ్ సైక్లింగ్ క్లబ్‌‌ను దాటి ప్రపంచంలోనే అతిపెద్ద సైక్లింగ్ క్లబ్ అయింది.


ఫేస్‌‌బుక్‌‌లో 7,500 మంది, 2,800 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఈ క్లబ్​లో హైదరాబాద్, సికింద్రాబాద్​లతో కలిపి రెండు వేల మంది ఉన్నారు. వీళ్ల స్టేషన్స్ గచ్చిబౌలి, నెక్లెస్ రోడ్​లలో ఉన్నాయి. జీహెచ్ఎంసీ సాయంతో నెక్లెస్​రోడ్​లో ‘హెచ్​బీసీ బైక్ (సైకిల్) స్టేషన్​’ని స్టార్ట్ చేశారు. అక్కడ 30 హైబ్రిడ్ , 30 ఎంటీబి,10 టెండెమ్,15 రోడ్​,15 కిడ్ బైసైకిల్స్ వంటి కొన్ని రకాలు ఉన్నాయి. ఈ సైకిల్స్​ని రెంట్​కి తీసుకుని రైడ్ చేయొచ్చు. అంతేకాదు, ఎప్పటికప్పుడు రైడింగ్ అప్​డేట్స్ మీట్​అప్, ఫేస్​బుక్​ల్లో పోస్ట్ చేస్తుంటారు. ఇప్పటికే ఈ గ్రూప్ జీహెచ్​ఎంసీతోపాటు హైదరాబాద్ మెట్రో రైల్, ఎస్​ఐఐసిలతో టై – అప్ అయింది. ట్రాఫిక్ పోలీస్​లు కూడా ‘సైకిల్ టు వర్క్’ పేరుతో సైబరాబాద్​ ఏరియాల్లో సైక్లింగ్​ని ప్రమోట్ చేస్తున్నారు.

 

సైకిల్​కూ దారి ఉంది
ప్రపంచవ్యాప్తంగా చాలా సిటీల్లో సైకిల్స్ వెళ్లడానికి స్పెషల్ ట్రాక్​లు ఉంటాయి. దానివల్ల ట్రాఫిక్, ఎయిర్ పొల్యూషన్​ తగ్గుతుంది. కొన్ని సిటీల్లో అయితే సైకిల్ షేరింగ్ సిస్టమ్, కమ్యూనిటీ సైకిల్ ప్రోగ్రామ్స్​ చేస్తున్నారు. ఇప్పటికే మనదేశంతోపాటు మరికొన్ని దేశాలు సైకిల్ వాడకాన్ని పెంచాయి. రోడ్లపై సైక్లింగ్‌‌కు కొంత చోటు ఉంచుతున్నాయి. 

హైదరాబాద్​లో... 
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ రోడ్, శిల్పారామం, హైటెక్ సిటీలోని బొటానికల్ గార్డెన్, నెక్లెస్ రోడ్, గచ్చిబౌలీ స్టేడియం, కేబిఆర్ పార్క్, దుర్గం చెరువు . కొండాపూర్​లోని పాలపిట్ట సైక్లింగ్ పార్క్, చేవెళ్ల రోడ్​లో వాల్ రైడ్ పార్క్, నెహ్రూ జూలాజికల్ పార్క్​ల్లో సైక్లింగ్ లేన్స్ ఉన్నాయి. అక్కడే సైకిల్స్ రెంట్​కు తీసుకోవచ్చు కూడా. 

ఎక్సర్​సైజ్ కంటే ఇదే బెస్ట్


రన్నింగ్, స్కిప్పింగ్, జాగింగ్ వల్ల మోకాళ్లు, మడమల మీద ప్రెజర్ పడుతుంది. లో– ఇంపాక్ట్, నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్​సైజ్ అంటే సైక్లింగ్. ఆర్థరైటిస్ ఉన్నవాళ్లు కూడా సైకిల్ తొక్కొచ్చు. వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్లు ఎక్సర్​సైజ్​లు చేయడం వల్ల అరుగుదల ఎక్కువ అవుతుంది. అయితే సైకిల్ తొక్కడం వల్ల అరుగుదల తక్కువే. అందువల్ల ఏ వయసు వాళ్లైనా సైకిల్ తొక్కొచ్చు.

హెవీ  బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి. రోజూ అరగంట నుంచి 45 నిమిషాల పాటు సైక్లింగ్ చేయొచ్చు. ఏ ఎక్సర్​సైజ్ చేయాలన్నా తిన్న తర్వాత ఆరు గంటలు గ్యాప్​ ఉండాలి. మార్నింగ్ బ్రేక్​ ఫాస్ట్ చేసేలోపే ఒక రౌండ్ సైకిల్ తొక్కొచ్చు. వీలు కాకపోతే సాయంత్రాలు కూడా తొక్కొచ్చు. కొందరు కొన్నిరోజులు సైకిల్ తొక్కి, తర్వాత మధ్యలో ఆపేసి మళ్లీ మొదలుపెడతారు. అలా చేసినప్పుడు కూడా కండరాలు ఏం దెబ్బతినవు. కానీ, హెవీ ఎక్సర్​సైజ్​లు చేస్తే మాత్రం కండరాల మీద ఎఫెక్ట్ పడుతుంది. అవి మధ్యలో ఆపేసి తిరిగి స్టార్ట్ చేయాలంటే వామప్ చేయాల్సిందే. 
సైకిల్ తొక్కడం వల్ల ఎండార్ఫిన్​లు రిలీజ్​ అవుతాయి. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడ్యూస్ అయ్యి యాంగ్జైటీ, డిప్రెషన్ తగ్గుతాయి. వెయిట్ లాస్ కూడా అవుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్​ రాకుండా నివారిస్తుంది. 
జిమ్​ల్లో అయితే ఫిట్​నెస్​ కోసమని స్టాటిక్ సైకిల్స్ ఉంటాయి. అయితే, మామూలు సైకిల్స్ తొక్కినా చాలు. నిజానికి బయట రోడ్​ మీద సైకిల్ తొక్కడం వల్ల స్ట్రెస్‌‌ తగ్గుతుంది. నలుగురు కలిసి ఒక గ్రూప్​గా సైక్లింగ్ చేయడం వల్ల సోషల్ బిహేవియర్, కమ్యూనికేషన్ బాగుంటాయి. జిమ్​లో చేయడం వల్ల సోషల్ ఇంటరాక్షన్​ తగ్గుతుంది.  - డాక్టర్ ప్రశాంత్ చంద్ర,  జనరల్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్

30 కిలోమీటర్లు సైకిల్ పైనే.. 


మా రోజుల్లో అరక దున్నేవాళ్లం. మోట బావి తోడి పంటలు పండించేవాళ్లం. ఇప్పుడు అన్నింటికీ మెషిన్​లు వచ్చేసరికి శారీరక శ్రమ లేకుండా పోయింది. తిని కూర్చోవడం అలవాటు లేనివాళ్ళం. చేతనైనంత పని చేయాలని తపన ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఏ పని ఉన్న సైకిల్ మీదనే వెళ్తా. సైకిల్​తో నా అనుబంధం 50 ఏండ్లకు పైనే. మా చుట్టుపక్కల గ్రామాల్లో మొదటి సైకిల్ నాదే. మా అమ్మాయి వాళ్ళు పెనుబల్లి మండలం యడ్లబంజర్ గ్రామంలో ఉంటారు. వాళ్ళను చూడాలనిపించిన ప్రతిసారి తెల్లవారు జామునే సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి సాయంత్రం చల్లబడ్డాక తిరుగు ప్రయాణం అవుతా. రాను, పోను సుమారు 50 కిలోమీటర్ల జర్నీ. ఇప్పుడు నాకు 80 ఏండ్లు. ఇప్పటి వరకు అలసట లేకుండా సైకిల్ పై వెళ్లిరాగలుగుతున్నా. - దూళ్ళ పుల్లయ్య, రైతు, దూళ్ల కొత్తూరు, వేంసూర్ మండలం

సైకిల్ ప్రపంచం

సైకిల్ డే
ప్రతి ఏటా జూన్ 3న ప్రపంచ సైకిల్ డే జరుపుతారు. పోలాండ్‌‌కి చెందిన లెస్జెక్ సిబిల్స్కి అనే సోషల్ సైంటిస్ట్ అమెరికాలో చేసిన వర్క్​ ద్వారా సైకిల్‌‌ డే మొదలైంది. ఆయనేం చేశాడంటే... వరల్డ్ సైకిల్‌‌ డే జరపాలని సైకిల్‌‌ మీద తిరుగుతూ ప్రచారం చేశాడు. 57 దేశాల మద్దతు కూడా వచ్చింది. చివరకు ఆయన కష్టం ఫలించింది. 2018లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో జూన్ 3ను ‘ప్రపంచ సైకిల్‌‌ దినోత్సవం’గా ప్రకటించారు. 

సిటీ ఆఫ్ సైకిల్స్
ప్రపంచంలోనే ది సిటీ ఆఫ్​ సైకిల్​గా ఫేమస్ కోపెన్ హాగన్. అక్కడివాళ్లు రోజుకి దాదాపు 1.44 మిలియన్ కిలోమీటర్​లు సైకిల్ తొక్కుతారు. అక్కడి జనాభా​లో సగానికిపైగా సైకిల్ వాడతారు. వెహికల్స్​ వెళ్లడానికి హైవేలు ఉన్నట్టే ఇక్కడ సైకిల్స్​ వెళ్లడానికే హైవేలు కట్టారు. 390 కిలోమీటర్ల మేర సైకిల్ దారులు, వందల కిలో మీటర్ల వరకు రీజనల్ సైకిల్ హైవేలు ఉన్నాయక్కడ. అంతేకాదు, ఆల్బర్ట్స్​ల్యాండ్ అనే ఊరికి కనెక్ట్ చేస్తూ సైకిల్ సూపర్​ హైవే కూడా ఉంది. సైకిళ్ల సంఖ్య ఇలా ఉంటే, వాటికి గాలి కొట్టించడానికి, రిపేర్​లు చేయడానికీ ఎన్ని షాపులు ఉండాలి? అందుకే అక్కడ సైకిల్ రిపేర్​ షాపులు చాలానే ఉన్నాయి. 

జనాభా కంటే సైకిల్స్ ఎక్కువ
మరొక సిటీ నెదర్లాండ్స్​లోని ఆమ్​స్టర్​డామ్. దీన్ని ‘ది కాపిటల్ సిటీ ఆఫ్ సైకిల్​’ అంటారు. ఎందుకంటే ఇక్కడ జనాభాకంటే సైకిళ్లే ఎక్కువ ఉన్నాయి మరి. ఆమ్​స్టర్​డామ్ జనాభా 8లక్షలకు పైనే. అయితే అక్కడున్న సైకిల్స్​ సంఖ్య తొమ్మిది లక్షలు. 50శాతానికి పైగా జర్నీలన్నీ సైకిల్​మీదే. అందుకని ఇక్కడ 400 కిలోమీటర్లకుపైగా సైకిల్ పాత్​వేస్​ ఉన్నాయి. అందుకే ఈ సిటీని ‘సైక్లింగ్ హెవెన్’​ అని కూడా అంటారు. ఇంటి నుంచి బయటికి అడుగుపెడితే చాలు ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్​ ఎక్కాల్సిందే. టూరిస్ట్​ల కోసం సైకిల్స్​ రెంట్​కి ఇస్తారు. 
ఈ రెండు సిటీలే కాదు... కెనడాలోని మాంట్రియల్, ఫ్రాన్స్​లోని స్ట్రాస్​బోర్గ్, బెల్జియంలోని యాంట్​వెర్ప్, జపాన్​లోని టోక్యో, స్పెయిన్​లోని బార్సిలోనా, జర్మనీలోని బెర్లిన్, స్వీడన్​లోని మాల్మో సిటీల్లో కూడా సైకిల్ వాడకం ఎక్కువే. 

మనదేశంలో...
దాదాపు పన్నెండేండ్ల ముందు వరకు కూడా పుణె ‘ది సిటీ ఆఫ్ సైకిల్స్’గా పాపులర్. కానీ, ఇప్పుడు అదే పుణె ఎక్కువ వెహికల్స్ ఉన్న సిటీగా మారిపోయింది. ముంబై, ఢిల్లీ కంటే ఎక్కువ వెహికల్స్ తిరిగే సిటీ ఇదే. సైకిల్స్ వాడాలని చాలా క్యాంపెయిన్​లు కూడా నడిచాయి. పుణె బస్ ర్యాపిడ్ ట్రాన్స్​పోర్ట్ సిస్టమ్ 2006లో బస్​ కారిడార్స్​ అన్నింటిలో సైకిల్ ట్రాక్​లు ఉండాలనే రూల్ ఒకటి పెట్టింది. బెంగుళూరు, హైదరాబాద్​లు కూడా ఒకప్పుడు సిటీ ఆఫ్​ సైకిల్స్​గా ఉండేవి. 

సైకిల్ వదలని సారు


రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ గోగర్ల గంగన్నకు 83 ఏండ్లు. ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచే సైకిల్ జర్నీ అలవాటయింది. తాను టీచర్​గా పని చేస్తున్నప్పటి నుంచి సొంత ఊరు వెంగ్వాపేట నుండి చుట్టుపక్కల గ్రామాల స్కూల్స్​కు సైకిల్ పైనే వెళ్లేవాడు. గంగన్న 1997లో రిటైర్​ అయ్యాడు. కొంతకాలం నుంచి నిర్మల్​లోని ప్రియదర్శి నగర్​లో ఉంటున్నాడు. టీచర్​గా రిటైర్​ అయినప్పటికీ గంగన్న తనకున్న అనుభవంతో నలుగురికీ విద్యను పంచాలని ఓ ప్రైవేట్ స్కూల్లో స్వచ్ఛందంగా పనిచేస్తున్నాడు. 83 ఏండ్ల వయసులోనూ ఇప్పటికీ తన సొంత సైకిల్ పైనే ఇంటికి దూరంగా ఉన్న స్కూల్​కు వెళతాడు. ప్రతిరోజు ఉదయం మార్కెట్​కు సైకిల్ పై వెళ్లి కూరగాయలను తీసుకొస్తాడు. ఈ వయసులో కూడా గంగన్న సైక్లింగ్​తోపాటు ప్రతి రోజు సూర్య నమస్కారాలు, యోగ కూడా చేస్తాడు. - గోగర్ల గంగన్న, రిటైర్డ్ టీచర్, వెంగ్వాపేట

సైక్లింగ్​ వల్ల లాభాలు

  • హార్ట్​కి చాలామంచిది. కండరాలు బలంగా, ఫ్లెక్సిబుల్​గా ఉంటాయి. కీళ్ల పనితీరు మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. ఒంట్లో కొవ్వు తగ్గుతుంది. రోగాలు రాకుండా నివారించొచ్చు. యాంగ్జైటీ, డిప్రెషన్​ తగ్గుతాయి. 
  • ఎక్సర్​సైజ్​ చేయడం వల్ల వారానికి  రెండు వేల క్యాలరీలు తగ్గితే, సైకిల్ తొక్కడం వల్ల గంటకు మూడు వందల క్యాలరీలు తగ్గుతాయని ఒక స్టడీలో తేలింది. అంతేకాదు, రోజుకి అరగంట సేపు సైకిల్​ తొక్కినా, సంవత్సరానికి ఐదు కిలోలు తగ్గొచ్చని బ్రిటీష్ రీసెర్చ్​లు చెప్తున్నాయి. 
  • సైకిల్ తొక్కడం వల్ల గుండె కండరాలు ఫిట్​గా ఉంటాయి. ఊపిరితిత్తులు, గుండె, రక్తప్రసరణ పనితీరు మెరుగుపడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారిస్తుంది.
  • పద్నాలుగేండ్లపాటు 30వేల మందిపై జరిపిన డానిష్ రీసెర్చ్ రిపోర్ట్స్‌‌ ప్రకారం, రెగ్యులర్​గా సైకిల్ తొక్కే 20 నుంచి 93 ఏండ్ల వాళ్లకు హార్ట్ ప్రాబ్లమ్స్​ ముప్పు తప్పిందట. 
  • రెగ్యులర్​గా సైకిల్ తొక్కడం వల్ల బొవెల్, బ్రెస్ట్ క్యాన్సర్​లు రావు.   
  • రోజూ అరగంటపైన సైకిల్​ తొక్కే వాళ్లలో డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువని ఫిన్లాండ్ రీసెర్చ్​లో తేలింది.
  • సైకిల్ తొక్కడం వల్ల దృఢత్వం, బ్యాలెన్స్, కో – ఆర్డినేషన్​ మెరుగవుతుంది. దానివల్ల పడిపోవడం వంటి ఇబ్బందులు ఉండవు.
  •  ట్రైసైకిల్ వాడేవాళ్లు చేతులు వాడతారు. అలా కూడా బాడీకి ఎక్సర్​సైజ్​ అవుతుంది. ఎలాంటి హెల్త్​ ప్రాబ్లమ్స్​ రావు.

అంతా సీట్ అడ్జస్ట్​లోనే ...


ఐదేండ్ల నుంచి సైక్లింగ్ చేస్తున్నా. మిగిలిన అన్ని ఎక్సర్ సైజ్​ల కన్నా ఇది చాలా ఈజీగా చేయొచ్చు.  చాలామంది మోకాళ్ల నొప్పులు వస్తాయని భయపడుతుంటారు. సైకిల్ సీట్​ను సరిగా అడ్జస్ట్ చేసుకుంటే చాలు.. ఎలాంటి నొప్పులు రావు. కంఫర్ట్​గా సైకిల్ తొక్కొచ్చు. చాలామంది ఈ విషయం తెలియక ఇబ్బంది పడుతుంటారు. ప్రతిరోజు సుమారుగా గంట నుంచి గంటన్నరసేపు సైకిల్ తొక్కుతా. 20 నుంచి 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తా.  సైకిల్ తొక్కితే వెయిట్ లాస్ అవుతారు. సుమారుగా కరీంనగర్​లో 50 మంది వరకు రెగ్యులర్​గా సైక్లింగ్ చేస్తాం. మా స్కూళ్లో పిల్లలు కూడా ఎంకరేజ్​మెంట్ కోసం సైకిల్ మీద వచ్చేవారికి డిస్కౌంట్ ఇస్తున్నాం.  పారిస్​లో ఉన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజషన్​తో  కో– ఆర్డినేట్ అయి, రెగ్యులర్​గా ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. లాంగ్ రైడ్​లకు కూడా వెళ్తుంటాం. - పసుల మహేశ్, కరీంనగర్ 

రి కా ర్డు లు 

పేద్ద చక్రాల సైకిల్.. అయినా తొక్కొచ్చు!
సైకిల్ అంటే మనిషి ఎత్తు కంటే కాస్త తక్కువగా ఉండాలి. అప్పుడే తొక్కడానికి వీలుంటుంది. కానీ, ఈ సైకిల్ చూశారా? ఏకంగా చెట్టంత ఎత్తుంది. ఇదేదో బొమ్మ సైకిల్​, అట్రాక్షన్​ కోసం తయారుచేశారనుకుంటే పొరపాటు. ఈ సైకిల్​ తొక్కడానికేనట. ఇంత ఎత్తుగా ఉంటే.. తొక్కడం వీలవుతుందా? అనే డౌట్ రావొచ్చు. కానీ, ఇది ఎంత ఎత్తు ఉన్నప్పటికీ దీన్ని తొక్కేందుకు వీలుగా ఉండేలాగానే తయారుచేశారట.

అందుకే దీనికి గిన్నిస్ బుక్​లో కూడా చోటు దక్కింది. ఈ సైకిల్​ పొడవు 25 అడుగుల 7.09 అంగుళాలు, 12 అడుగుల1.67 అంగుళాల ఎత్తు, 150 కిలోల బరువు ఉంది. దీనికి ఉన్న ఒక్కో చక్రమే పది అడుగుల 9.92 అంగుళాల వ్యాసం ఉంది. దీన్ని 2012లో జర్మనీలోని పుడగాలలో డిడి సెంట్ అనే అతను తయారుచేశాడు. ఇలా చెప్పుకుంటూపోతే గిన్నిస్​ బుక్​లో చోటు దక్కించుకున్న వెరైటీ సైకిల్స్​లిస్ట్ పెద్దదే.
అతి పొడవైన సైకిల్ 
మామూలు సైకిల్‌‌ని అతి పొడవైన సైకిల్‌‌గా మార్చాడు. దాంతో గిన్నిస్​ బుక్​లోనూ చోటు దక్కించుకున్నాడు. ఆడమ్‌‌ అనే వ్యక్తి అతి పొడవైన సైకిల్‌‌ను రీసైక్లింగ్‌‌ మెటీరియల్స్​తో డిజైన్​ చేశాడు. దీన్ని తయారుచేయడానికి దాదాపు నెలరోజులు పట్టింది. సైకిల్ తయారయ్యాక ఎక్కి, తొక్కేయడమేగా! అంటారేమో.. కానీ, ఈ సైకిల్ ఎక్కి సరిగా తొక్కడానికే కొన్ని వారాలు పట్టిందట.

‘నాకెప్పుడూ పెద్దపెద్ద ప్రాజెక్టులు చేయడమే ఇష్టం. నా ఆలోచనలు ఎప్పడూ పెద్దస్థాయిలోనే ఉంటాయి’ అంటాడు ఆడమ్. అయితే ఈ సైకిల్‌‌ 24 అడుగుల మూడు అంగుళాలు ఉంటుంది. ఈ మేరకు గిన్నిస్‌‌ వరల్డ్‌‌ బుక్‌‌ తన ఇన్‌‌స్టాగ్రామ్‌‌ అకౌంట్​లో పొడవాటి సైకిల్‌‌ పై​ రైడింగ్‌‌ చేస్తున్న వీడియో పోస్ట్‌‌ చేసింది. 

సైక్లింగ్ రివల్యూషన్
డిసెంబర్ 31న, 44ఏండ్ల సైక్లిస్ట్​ నితిన్ అగర్వాల్ రోడ్​ యాక్సిడెంట్​లో చనిపోయాడు. ఆయన ఫ్రెండ్స్​తో కలిసి​ సైక్లింగ్ చేస్తుండగా.. వెహికల్​ ఒకటి నితిన్​ని గుద్దేసింది. దానికి కారణం ఆ వెహికల్ డ్రైవర్ ఆల్కహాల్​ తాగి బండి నడపడం వల్లనే ఇదంతా జరిగింది. దాంతో సైక్లింగ్ గ్రూప్​ వాళ్లంతా కలిసి ‘సైక్లింగ్​ రివల్యూషన్​’ స్టార్ట్​ చేశారు. నడిచేవాళ్లు, రన్నర్లు, సైక్లిస్ట్​ల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సైక్లిస్ట్​ల కోసం స్పెషల్ లేన్​లు ఏర్పాటు చేయాలని కోరారు. వాహనాలు నడిపేటప్పుడు అతివేగం, రాంగ్‌‌ సైడ్, డ్రంకెన్​ డ్రైవింగ్​ల పట్ల పోలీసులు దృష్టిపెట్టాలన్నారు.    ::: మనీష పరిమి  ::: వెలుగు నెట్​వర్క్.