వన్యప్రాణులు, ముఖ్యంగా పులుల వంటి పెద్ద జాతి పిల్లుల ప్రవర్తన ఈ సీజన్లో ఆకర్షణీయంగా ఉంటాయి. ఎందుకంటే అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వీటికి సంభోగం కాలం అలాగే ఈ జాతుల పులుల మనుగడ, పరిరక్షణకు చాలా కీలకం. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక మగ పులి ప్రాణహిత నదిని ఈదుతూ మహారాష్ట్ర నుండి తెలంగాణ వరకు ఈదుతూ ప్రయాణించింది. కారణం ఏంటో తెలుసా...
మన భారతదేశంలోని అడవుల్లో జంతువులకు ఇదొక ప్రేమ సీజన్. సమాచారం ప్రకారం సంతానోత్పత్తి కాలం ప్రారంభం కాగానే ఈ పులి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని కన్హర్‌గావ్ వన్యప్రాణుల అభయారణ్యం నుండి తెలంగాణ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ కారిడార్‌కు వలస వచ్చిందని భావిస్తున్నారు. ఈ పులి ఆడపులి తోడు కోసం వెతకడమే కాకుండా అది ఉండే చోటు నుండి కూడా చాల సుదీర్ఘ ప్రయాణం చేసింది.
అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఉండే ఈ నెలల్లో భారతదేశంలో పులులకు ముఖ్యంగా సంతానోత్పత్తి సమయాన్ని సూచిస్తాయి. మగ పులులు ఆడ భాగస్వామిని వెతుక్కుంటూ చాలా దూరం ప్రయాణించడం సర్వసాధారణం. కానీ ఈసారి నడవడానికి బదులుగా, ఈ పులి ఈత కొడుతూ చేరడం ఆశ్చర్యపర్చింది.
వివరాల ప్రకారం, మహారాష్ట్రలోని రిజర్వ్ నుండి పెద్ద పులులకు ప్రవేశ ద్వారం అయిన కర్జెల్లీ పరిధిలోని ఇతిఖల్ పహాడ్ అటవీ ప్రాంతం ద్వారా ఈ పులి తెలంగాణలోకి ప్రవేశించిందని అధికారులు తెలిపారు. ఈ పులి దాదాపు 40-50 కి.మీ ప్రయాణించి చివరిగా మంచిర్యాల అటవీ ప్రాంతం సమీపంలో కనిపించింది.
అధికారులు కెమెరా ట్రాప్‌లు, ఇతర పర్యవేక్షణ పరికరాలు ఉపయోగించి అక్కడ ఉండే పులులతో పాటు దాని కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. కాగజ్‌నగర్ FDO సుశాంత్ సుఖ్‌దేవ్ మాట్లాడుతూ, చలికాలంలో కూడా పులులు తరచుగా ప్రాణహిత నదిని దాటుతాయని చెప్పారు. అవి అడ సహచరులు/ తోడు, ఆహారం, నీటి కోసం ఈదుతూ దాటుతాయి. చాలా పులులు వాటి సొంత భూభాగానికి తిరిగి వెళ్లే ముందు కొంతకాలం ఇక్కడే ఉంటాయి కూడా అని అన్నారు.
ఆడపులిని వెతుక్కుంటూ నదిని దాటిన ఈ పులి వార్త వన్యప్రాణుల ప్రపంచాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. అటవీ అధికారులు కూడా పులిని నిశితంగా పరిశీలిస్తున్నారు. గత సంవత్సరం, నాలుగు కంటే ఎక్కువ పులులు ఈ ప్రాంతంలోకి వలస వచ్చాయని, అందులో ఒకటి దాని సొంత భూభాగానికి తిరిగి వెళ్ళే ముందు సిద్దిపేట వరకు ప్రయాణించిందని అన్నారు.
