మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. 71 మంది నక్సలైట్లు సరెండర్

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. 71 మంది నక్సలైట్లు సరెండర్

హైదరాబాద్: ఆపరేషన్ కగార్, అగ్రనేతల వరుస లొంగుబాట్లతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్ట్ పార్టీకి చెందిన మరో 71 మంది నక్సలైట్లు ఛత్తీస్‎గఢ్ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారు కాంకేర్, నారాయణ్ పూర్ జిల్లాలకు చెందిన మావోయిస్టులుగా తెలుస్తోంది. ఇందులో డివిజన్ కమిటీ నాయకులు, పలువురు ముఖ్య నేతలు ఉన్నట్లు సమాచారం. 

కాంకేర్ ప్రాంతం నుంచి 50 మంది, నారాయణ్ పూర్ జిల్లాలో 21 మంది.. మొత్తం 71 మంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. సరెండర్ అయినవారిలో13 మంది మహిళా నక్సల్స్ కూడా ఉన్నట్లు సమాచారం. లొంగిపోయిన నక్సలైట్లు 18 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా, ఆపరేషన్ కగార్, పార్టీ సుప్రీం కమాండర్ నంబాల మరణం తర్వాత మావోయిస్టు పార్టీ రెండు వర్గాలు చీలిపోయింది. 

మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ, పొలిటిబ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, సెంట్రల్ కమిటీ మెంబర్ ఆశన్న అలియాస్ సతీష్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయం తీసుకోగా.. మరో వర్గం మాత్రం ఆయుధాలు వీడే ప్రసక్తే లేదని ప్రకటించాయి. ఈ క్రమంలో మల్లోజుల, ఆశన్న గన్ డౌన్ చేసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ దెబ్బ నుంచి పూర్తిగా తేరుకోకముందే మరో 71 మంది మల్లోజుల, ఆశన్న బాటలోనే నడవడంతో మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లైంది. 

.