
టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ తన తొలి టెస్ట్ సిరీస్ లోనే దుమ్ములేపుతున్నాడు. కోహ్లీ వారసుడిగా నాలుగో స్థానంలో ఆడుతున్న గిల్.. అంచనాలను అందుకుంటూ ఇంగ్లాండ్ సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కెప్టెన్ గా తొలి నాలుగు టెస్టుల్లోనే నాలుగు సెంచరీలు చేసి ఔరా అనిపించాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌లలో 90.25 సగటుతో 722 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్ గా నిలిచాడు. గురువారం (జూలై 31) లండన్ లోని ఓవల్ లో వేదికగా చివరి టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు గిల్ టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ మూడు రికార్డ్స్ ను బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఓకే టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు:
ఓకే టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టడానికి శుభ్‌మాన్ గిల్ కేవలం 53 పరుగుల దూరంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో గవాస్కర్ 154.8 సగటుతో 774 పరుగులు చేశాడు. 54 ఏళ్లుగా ఈ రికార్డ్ చెక్కు చెదరకుండా పదిలంగా ఉంది. గత ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఓపెనర్ జైశ్వాల్ కు ఈ అవకాశం వచ్చినా 712 పరుగుల వద్ద ఆగిపోయాడు. ఈ సిరీస్ లో ప్రస్తుతం గిల్ 722 పరుగులు చేశాడు. గిల్ ఉన్న ఫామ్ కు రెండు ఇన్నింగ్స్ ల్లో 53 పరుగులు చేయడం కష్టం కాకపోవచ్చు.
అత్యధిక పరుగులు చేసిన భారత టెస్ట్ కెప్టెన్:
ఇంగ్లాండ్ పై ఓవల్ టెస్టులో గిల్ మరో 11 పరుగులు చేస్తే ఓకే టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా గవాస్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు. 1979లో వెస్టిండీస్‌పై గవాస్కర్ 732 పరుగులు చేసిన రికార్డ్ ఇప్పటికీ టాప్ లో ఉండడం విశేషం. 46 ఏళ్ళ తర్వాత గిల్ కెప్టెన్ గా గవాస్కర్ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం వచ్చింది. రెండు ఇన్నింగ్స్ ల్లో 11 పరుగులు చేయడం కష్టం కాకపోవచ్చు. ఈ రికార్డ్ మాత్రం గిల్ ఖచ్చితంగా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒకే టెస్ట్ సిరీస్ లో అత్యధిక సెంచరీలు:
ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ లో సెంచరీ కొట్టిన గిల్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే సిరీస్‌లో నాలుగు సెంచరీలు సాధించిన మూడో మూడవ కెప్టెన్‌గా నిలిచి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ ఘనత ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే సాధించారు. ఆస్ట్రేలియా ఆల్ టైం బెస్ట్ టెస్ట్ బ్యాటర్ సర్ డాన్ బ్రాడ్‌మాన్ (1947/48), టీమిండియా దిగ్గజ సునీల్ గవాస్కర్ (1978/79) మాత్రమే కెప్టెన్ గా ఒకే సిరీస్ లో నాలుగు సెంచరీలు కొట్టారు. గిల్ నాలుగు సెంచరీలతో వీరి రికార్డ్ సమం చేశాడు. ఇంగ్లాండ్ తో జరగనున్న చివరి టెస్టులో గిల్ సెంచరీ కొడితే గవాస్కర్ ను వెనక్కి నెట్టి ఒకే సిరీస్ లో అత్యధిక సెంచరీలు చేసిన భారత కెప్టెన్ గా ప్లేయర్ గా నిలవనున్నాడు.