Shubman Gill: గిల్‌నే వరించిన ఐసీసీ అవార్డు.. స్టోక్స్, ట్రిపుల్ సెంచరీ వీరుడిని ఓడించిన టీమిండియా కెప్టెన్

Shubman Gill: గిల్‌నే వరించిన ఐసీసీ అవార్డు.. స్టోక్స్, ట్రిపుల్ సెంచరీ వీరుడిని ఓడించిన టీమిండియా కెప్టెన్

టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. 2025 జూలై నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్ తో ఇటీవలే జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన గిల్ ను ఐసీసీ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం నామినీలుగా ఎంపికైన ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సౌతాఫ్రికా దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్ ను టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఓడించాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకోవడం గిల్ కెరీర్ లో ఇది నాలుగోసారి. ఫిబ్రవరి 2025, జనవరి 2023, సెప్టెంబర్ 2023లో శుభమాన్ కు ఈ అవార్డు దక్కింది.

జూలై నెలలో గిల్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఈ నెలలో ఆడిన మూడు టెస్టుల్లో 94.50 యావరేజ్ తో 567 పరుగులు చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో ఒక డబుల్ సెంచరీతో పాటు రెండు సెంచరీలు ఉన్నాయి. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి గిల్ 430 పరుగులు చేయడం విశేషం. సౌతాఫ్రికా ఆల్ రౌండర్ ముల్డర్ జింబాబ్వే పై 367 పరుగులు చేసి ఈ రేస్ లో నిలవగా.. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇండియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆల్ రౌండ్ షో తో మెప్పించిన అవార్డు సొంతం చేసుకోలేకపోయారు. 

మెన్స్ క్రికెట్ లో ఎక్కువగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న ప్లేయర్ గా గిల్ రికార్డ్ సృష్టించాడు. "జూలై నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సారి కెప్టెన్‌గా నా తొలి టెస్ట్ సిరీస్‌లో నా పెర్ఫార్మెన్స్ కారణంగా ఈ అవార్డు రావడం గర్వంగా అనిపిస్తోంది. బర్మింగ్‌హామ్‌లో డబుల్ సెంచరీ నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నా ఇంగ్లాండ్ టూర్ లో ఈ ఇన్నింగ్స్ హైలెట్ గా నిలుస్తుంది". అని ఐసీసీ మీడియా ప్రకటనలో గిల్ అన్నాడు. మహిళా విభాగంలో ఇంగ్లాండ్ ప్లేయర్ సోఫియా డంక్లీ మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ అవార్డు గెలుచుకుంది.