- సవరణలు పూర్తి జాబితాల ప్రదర్శన
- సిద్దిపేట సర్కిల్లో 31 సంఘాలు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట సర్కిల్లోని చేనేత సహకార సంఘాలకు అధికారులు ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాలతో రెండు నెలలుగా ఓటరు జాబితాల ఖరారు ప్రక్రియను నిర్వహించిన అధికారులు అర్హులైన వారి పేర్లతో ఆయా సొసైటీల వద్ద జాబితాలను ప్రదర్శనకు ఉంచారు. సిద్దిపేట సర్కిల్ పరిధిలో నాలుగు జిల్లాల్లో 31 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఓటరు జాబితాలను అధికారులు విడుదల చేశారు.
గత నెలలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితాల ప్రక్రియను నిర్వహించిన అధికారులు మూడు రోజుల కింద ఆయా సంఘాల జాబితాలను విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు 2013లో ఎన్నికలు నిర్వహించగా 2018లో పాలకవర్గాల గడువు ముగిసిపోయింది. అప్పటి నుంచి గడువు పెంచుతూ పర్సన్ ఇన్‌చార్జుల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నారు.
సొసైటీ ఆఫీసుల్లో ఓటరు జాబితాల ప్రదర్శన
చేనేత, జౌళి శాఖ సిద్దిపేట సర్కిల్ పరిధిలో మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట ఉండగా.. వీటి పరిధిలో 31 చేనేత సహకార సంఘాలున్నాయి. వీటిల్లో 6,411 మంది సభ్యులున్నారు. ఆయా సంఘాల్లోని అర్హులైన సభ్యుల వివరాలు, అర్హతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించి, తుది సభ్యత్వ జాబితాను అధికారికంగా ఆమోదించి ఆయా సొసైటీల వద్ద ప్రదర్శిస్తున్నారు.
గతంలో విడుదల చేసిన ప్రాథమిక ఓటర్ల జాబితాకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలు, పేర్ల సవరణ మార్పులు చేర్పులను పరిష్కరించి నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ జాబితాలను రూపొందించారు.
సభ్యుల సమాచారం కోసం ఖరారు చేసిన జాబితాను సిద్దిపేట సర్కిల్లోని చేనేత, వస్త్ర పరిశ్రమల శాఖ కార్యాలయ నోటీసు బోర్డుపై, ప్రాథమిక చేనేత సహకార సంఘాల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. తుది ప్రతిపాదనలను రాష్ట్ర సహకార ఎన్నికల అధికారులకు సమర్పించి ఎన్నికల ప్రక్రియ మొత్తం ఈ తుది జాబితా ఆధారంగానే నిర్వహించనున్నారు.
జూన్ లో ఎన్నికలకు అవకాశం?
చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో 33 రోజుల ప్రణాళికను అమలు చేసిన అధికారులు జూన్‌లో ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. చేనేత, జౌళి శాఖ కమిషనర్ విడుదల చేసిన షెడ్యూల్ కు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుంటే జూన్ నెలలో ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తుది జాబితాలను సహకార శాఖకు అందించిన తర్వాత ఎన్నికలను నిర్వహించనున్నారు.
ఓటరు జాబితాల కసరత్తు పూర్తి
సిద్దిపేట సర్కిల్ పరిధిలోని 31 ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఓటరు జాబితాలను సిద్ధం చేశాం. కమిషనర్ ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితాలను సిద్ధం చేసి ఆయా సంఘాల వద్ద ప్రదర్శిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
- ఎం.సాగర్, ఏడీ, చేనేత, జౌళిశాఖ–
