- వెండి ధరలు పెరగడంతో ఏడాదిగా సగానికి పడిపోయిన అమ్మకాలు, ఆర్డర్స్
- అరకొర పనితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరీంనగర్ సిల్వర్ ఫిలీగ్రీ కళాకారులు
- ఏడాదిలోనే రెండింతలైన వెండి ధరలు
- ఆశించిన ఆదాయం లేకపోయినా నెట్టుకొస్తున్న వ్యాపారులు
కరీంనగర్, వెలుగు: సిల్వర్ రేట్లు అసాధారణ రీతిలో పెరుగుతుండడంతో.. వెండితో తయారు చేసే ఫిలిగ్రీ కళాఖండాల సేల్స్ భారీగా పడిపోయాయి. దీంతో కరీంనగర్ లో జియో ట్యాగ్ గుర్తింపు కలిగిన ఫిలిగ్రీ ఇండస్ట్రీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. కొన్నేళ్లుగా వెండి రేటు క్రమంగా పెరుగుతూ వస్తున్నప్పటికీ.. ఏడాది కాలంలో మాత్రం అమాంతం రెండింతలు కావడంతో వెండితో పాటు వెండితో తయారయ్యే ఆభరణాలు, సిల్వర్ ఫిలిగ్రీ హ్యాండ్ క్రాఫ్ట్స్ కొనుగోలుకు ఉన్నతవర్గాల వారు వెనకాడే పరిస్థితి నెలకొంది. సేల్స్ తగ్గడంతో వ్యాపారులకు ఆశించిన ఆదాయం రావడం లేదు. దీంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన కళాకారులకు చేతి నిండా పని ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే కరీంనగర్ తో పాటు హైదరాబాద్ లో సిల్వర్ ఫిలిగ్రీ మీద ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు.
పెరిగిన ధరలతో తిప్పలు..
వివిధ కార్పొరేట్ ఫంక్షన్లు, సమావేశాల్లో అతిథులకు, కార్యక్రమ నిర్వాహకులకు ఇచ్చే గిఫ్ట్ గ్రాండ్ గా, ఆకట్టుకునేలా కనిపించేందుకు సిల్వర్ ఫిలిగ్రీ గిఫ్ట్స్ ను అందిస్తుంటారు. నెమలి, చార్మినార్, తాజ్ మహల్, ఏనుగు, జింకలు, ఓడలు, దేవతా ప్రతిమల నుంచి కుంకుమ భరిణె, గాజుల పెట్టె వరకు అనేక రకాలైన గిఫ్ట్ ఐటెమ్స్ ను ఫిలిగ్రీ కళాకారులు తయారు చేస్తారు.
ఒకటి, రెండు నుంచి బల్క్ గా కూడా ఆర్డర్స్ వస్తుంటాయి. అయితే ఇప్పుడు వీటికి ముడి సరుకు అయిన వెండి ధరలు భారీగా పెరగడంతో ఫిలిగ్రీ హ్యాండ్ క్రాఫ్ట్స్ రేట్లు కూడా పెరిగాయి. దీంతో వీటి కొనుగోలుకు చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే.. 100 గ్రాముల బరువు ఉన్న ఐటెంకు బదులు 50 గ్రాముల ఐటంకు ఆర్డర్ పెడుతున్నారు.
కరీంనగర్ ఫిలిగ్రీకి అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్..
కరీంనగర్ లో గత 400 ఏళ్లకు పైగా వారసత్వంగా వస్తున్న ఫిలిగ్రీ గిఫ్ట్ ఆర్టికల్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందాయి. ఫిలిగ్రీ కళాఖండాలు జిగేల్ మంటూ ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. కరీంనగర్ జిల్లాలో ఈ పరిశ్రమపై ఆధారపడి సుమారు వంద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నిరుడు నవంబర్ లో దక్షిణాఫ్రికాలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న దేశాల అధినేతలకు మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారు చేసిన ఫిలిగ్రీ గిఫ్ట్ ఆర్టికల్స్ ను అందజేశారు.
2023సెప్టెంబర్ లో ఢిల్లీలో జరిగిన జరిగిన జీ-20 సదస్సులో వివిధ దేశాల అధ్యక్షులు కోట్కు అలంకరించుకునేందుకు అశోకచక్రంతో కూడిన బ్యాడ్జీలను కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులే తయారు చేసి పంపించారు. గతంలో కరీంనగర్ ఫిలిగ్రీ కళ గురించి ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లోనూ ప్రస్తావించారు. తాజాగా ఐదు దేశాల పర్యటనలోనూ ప్రధాని మోదీ భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా కరీంనగర్ ఫిలిగ్రీ హస్తకళాకారులు రూపొందించిన కానుకలను అందజేశారు. యూఏఈ రాణి మదర్ షేక్ ఫాతిమాకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ పెట్టెను గిఫ్ట్ గా ఇచ్చారు.
మా వ్యాపారం సగానికి పడిపోయింది.
రెండు, మూడేళ్లుగా సిల్వర్ రేట్ బాగా పెరిగింది. చాలా మంది వెండిని ఆభరణాలుగా కాకుండా ఇన్వెస్ట్ మెంట్ కోసం కడ్డీల రూపంలో కొంటున్నారు. వెండి ధరలు పెరగడంతో వెండితో తయారు చేసే హ్యాండ్ క్రాఫ్ట్స్ కొనుగోళ్లు తగ్గాయి. ధరలు తక్కువ ఉండేలా చిన్న సైజు, బరువు తక్కువ ఐటెమ్స్ ను తయారు చేస్తున్నాం. ఇటీవల ఫిలిగ్రీని పోలిన గిఫ్ట్స్ అమ్ముతూ ఇండస్ట్రీని దెబ్బతీస్తున్నారు. మాకు నేషనల్, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లలో ఫ్రీగా ఫిలిగ్రీ పొడక్ట్స్ ను అమ్ముకునే అవకాశం కల్పిస్తే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది.–అశోక్ కుమార్, జనరల్ సెక్రటరీ, సిఫ్కా
