Sing Geetham Review: 94 ఏళ్ల వయసులోనూ తగ్గని సింగీతం క్రియేటివిటీ.. ఆడియన్స్ టాక్ ఇదే!

Sing Geetham Review: 94 ఏళ్ల వయసులోనూ తగ్గని సింగీతం క్రియేటివిటీ.. ఆడియన్స్ టాక్ ఇదే!

పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో దశాబ్దాలుగా ఇండియన్ సినిమాని రీ డిఫైన్ చేసిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఈ లెజండరీ డైరెక్టర్ 94 ఏళ్ల వయసులోనూ తన సృజనాత్మకతకు పదును తగ్గలేదని మరోసారి నిరూపించారు. మాటలే పాటలైతే అనే ఆలోచనతో ఓ వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

మ్యూజికల్ ఫాంటసీ బ్యాక్డ్రాప్లో ‘సింగ్ గీతం’ (Sing Geetham) తెరకెక్కించారు. ఈ చిత్రం ఇవాళ జూన్ 12, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి లీడ్ రోల్స్‌‌లో నటించిన ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై ‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించారు.

మాటలు లాంటి పాటలతోనే సినిమాపై అంచనాలు పెంచిన దర్శక దిగ్గజం సింగీతం, ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు? సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? అనేది ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటంటే:

బీహార్ జైలు నుంచి విడుదలైన ప్రతాప్ మన్నెం (అయాన్) తన తండ్రికి చెందిన బంగారు గనులను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో కుబేర పురం అనే గ్రామానికి వస్తాడు. అదే సంపదపై కన్నేసిన బ్రహ్మయ్య (బెనర్జీ), అతని కుమార్తె రేణు (షాలిని కొండెపూడి) కూడా తమకే ఆ సంపద దక్కేలా కుట్రలు పన్నుతుంటారు. అత్యాశతో మైనింగ్‌కు అంగీకరించిన ప్రతాప్, గ్రామంలోని ఏకైక చెట్టును తన తల్లిగా భావించే గౌరీ (అహిల్యా బమ్రూ) ప్రాణంగా చూసుకునే ఆ చెట్టును నరికివేయిస్తాడు.

ఈ పరిణామాల మధ్య ఆగ్రహానికి గురైన రేణు, గ్రామ ప్రజల ఆరాధ్య దైవమైన కుబేరుడిని దూషిస్తూ కోరుకున్న కోరికల కారణంగా కుబేరపురం ప్రజలందరూ మాటలు కోల్పోయి పాటలతో మాట్లాడడం మొదలుపెడతారు. ఈ విచిత్ర పరిస్థితి వెనుక ఉన్న శాపం ఏమిటి? రేణు కోరుకున్న మిగతా కోరికల వల్ల గ్రామానికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? కుబేరుడి శాపం నుంచి గ్రామాన్ని రక్షించేందుకు ప్రతాప్ ఏం చేశాడు? అసలు కుబేరపురం చరిత్ర ఏమిటి? చివరకు గ్రామస్తులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చారా? లేదా? అనేదే మిగతా కథ.

ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే:

ఇవాళ మార్నింగ్ షోస్ చూసిన పలువురు ఆడియన్స్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ రివ్యూలను షేర్ చేస్తున్నారు. 94 ఏళ్ల వయసులోనూ సింగీతం శ్రీనివాసరావు చూపించిన క్రియేటివిటీని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా సింగీతం రాసుకున్న కొత్త సబ్జెక్టుకి దేవిశ్రీ సంగీతం ప్రాణం పోసిందని ఆడియన్స్ అంటున్నారు.

ప్రతి ఎమోష‌న్‌నీ పాట‌గా చెప్ప‌డం వల్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ‘వినరా వినరా’ పాట నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోందని, దేవిశ్రీ నేపథ్య సంగీతంతో క్లైమాక్స్ ఎమోషన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడా కామెడీ పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదని, కొన్ని మ్యూజికల్ ఎపిసోడ్స్ కాస్త సాగదీసినట్లు అనిపించాయని చెబుతున్నారు. అయితే సెకండాఫ్ మాత్రం అద్భుతమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోందని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ ఎపిసోడ్, హృదయాన్ని కదిలించే క్లైమాక్స్ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయని అంటున్నారు.

ఒక నెటిజన్ తన రివ్యూ షేర్ చేస్తూ “సింగీతం శ్రీనివాసరావు గారికి వయసు 94 మాత్రమే సంఖ్యల్లో. కానీ ఆయన ఆలోచనలు, సృజనాత్మకత మాత్రం ఇప్పటి యువతతో సమానంగా ఉన్నాయి. ‘సింగ్ గీతం’లో ఆయన ఆలోచన, ప్రెజెంటేషన్, విజన్ ఇప్పటివరకు చూడని థియేట్రికల్ అనుభూతిని అందించాయి. ఈ దిగ్గజ దర్శకుడు ఎప్పటికీ పాతబడరు.. ఎప్పటికప్పుడు కొత్తగా మెరిసిపోతూనే ఉంటారు. నాగ్ అశ్విన్, దేవిశ్రీ ప్రసాద్, స్వప్న సినిమాస్ బృందానికి అభినందనలు.” అని ట్వీట్ చేశాడు. 

మరో ప్రేక్షకుడు.. “ఇది సంగీతానికి నివాళి, సినిమాకు నివాళి, అలాగే సింగీతం గారికి అంకితమైన నివాళి. దేవిశ్రీ ప్రసాద్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ కృషి అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి అసలు హీరో డీఎస్పీనే. టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు ప్రతి క్షణం అద్భుతంగా అనిపించింది” అంటూ ప్రశంసలు కురిపించాడు.

మరో నెటిజన్ ట్వీట్ చేస్తూ ఆసక్తికర రివ్యూ ఇచ్చారు. “మాట్లాడుకుంటూ థియేటర్‌లోకి వెళ్లిన వాళ్లంతా.. పాటలు పాడుకుంటూ బయటికి వస్తున్నారు. నవ్విస్తారు, ఏడిపిస్తారు, చివరికి మనసుతో పాడించేస్తారు. ఇది కేవలం ఒక సినిమా కాదు.. సంగీతానికి ఓ నివాళి, సినిమాకు ఓ నివాళి, సింగీతం శ్రీనివాసరావు గారికి అంకితమైన ఓ అందమైన వందనం.

94 ఏళ్ల వయసులో కూడా ఆయన సృజనాత్మకత ఎంత తాజాగా ఉందో మరోసారి నిరూపించారు. తెరపై కనిపించే ప్రతి ఫ్రేమ్‌లో మ్యాజిక్ ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. ‘సింగ్ గీతం’ అనేది కేవలం చూడాల్సిన సినిమా కాదు..అనుభూతి చెందాల్సిన ఓ సంగీత ప్రయాణం.” అని తెలిపారు.

ఇంకో నెటిజన్ ఈ చిత్రాన్ని విభిన్నమైన ప్రయత్నంగా అభివర్ణిస్తూ, రెండో భాగంలోని భావోద్వేగాలను ప్రత్యేకంగా ప్రశంసించాడు. “వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘సింగ్ గీతం’లో కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ తప్పకుండా చూడదగ్గ సినిమా. మొదట్లో ఆకట్టుకునే మ్యూజికల్ ఎలిమెంట్స్ మధ్యలో కొద్దిగా సాగదీతగా అనిపించినా, ఫ్లాష్‌బ్యాక్ నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషన్స్  బాగా పండాయి.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు వెన్నెముకలా నిలిచింది. ఇలాంటి విభిన్నమైన కథను ప్రయత్నించిన సింగీతం గారికి, వైజయంతీ బృందానికి అభినందనలు. ఇది అందరికీ నచ్చకపోవచ్చు.. కానీ దాని ప్రత్యేకత, భావోద్వేగాల కోసం తప్పకుండా చూడాల్సిన సినిమా” అని పేర్కొన్నాడు.