- మూలనపడ్డ 10 బ్లాక్‌లను దక్కించుకుంటాం
- సింగరేణి సీఎండీ బలరాంనాయక్
గోదావరిఖని/జైపూర్, వెలుగు : బొగ్గు గనుల వేలంలో పాల్గొంటేనే సింగరేణి సంస్థకు మనుగడ ఉంటుందని ఆ సంస్థ సీఎండీ ఎన్.బలరాంనాయక్ చెప్పారు. ఆదివారం గోదావరిఖని, జైపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరిఖనిలో రూ.17 కోట్లతో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను, కార్మిక కాలనీలో క్వార్టర్ల స్థితిగతులను పరిశీలించారు. అనంతరం ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్ట్‌లో నిర్మించిన బేస్ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా బలరాంనాయక్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొంటామని, సింగరేణి విస్తరించిన ప్రాంతంలో మూలనపడిన మణుగూరు డిప్‌సైడ్, గాజులగూడెం, చెన్నూర్ సౌత్ బ్లాక్ వంటి పది బ్లాక్‌లను సొంతం చేసుకుంటామని స్పష్టం చేశారు. వీటి ఏర్పాటు వల్ల కనీసం పది వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు ఇంకా ఐదు నెలలే మిగిలి ఉందని, టార్గెట్‌ను చేరుకునేందుకు ప్రతి ఉద్యోగి దృష్టి సారించాలని సూచించారు. సింగరేణి క్వార్టర్లలో సౌకర్యాలు మెరుగుపర్చేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. జైపూర్‌లో ఎన్టీపీసీ మూడో యూనిట్ నిర్మాణం కోసం త్వరలోనే భూమి పూజ చేస్తామని ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో మిథనాల్ ప్లాంట్ సైతం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. శ్రీరాంపూర్ డివిజ్‌నలోని ఇందారం ఐకే ఓపెన్ కాస్ట్‌లో ఓబీ పనులకు ఎలాంటి ఆటంకం కలుగొద్దని సూచించారు.
