- సింగరేణి త్రైపాక్షిక సమావేశంలో డైరెక్టర్ల సూచన
మణుగూరు, వెలుగు: సింగరేణి బొగ్గు వెలికితీతలో యంత్రాల పనిగంటలను పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని డైరెక్టర్లు సూచించారు. మణుగూరు ఇల్లందు క్లబ్‌లో బుధవారం నిర్వహించిన 19వ ఏరియా లెవెల్ త్రైపాక్షిక రక్షణ సమావేశంలో డైరెక్టర్లు కొప్పుల వెంకటేశ్వర్లు, ఐ.సత్యనారాయణ, టి.హరిప్రసాద్, ఎస్.కె.నాగుల్ మీరా, బొల్ల సుధీర్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు, మేనేజ్‌మెంట్ మధ్య సమాచార వ్యవస్థను మెరుగుపరచుకోవాలని పేర్కొన్నారు. సింగరేణిలో ఎక్కువ శాతం ప్రమాదాలు నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయని, ప్రతి ఉద్యోగి తన రక్షణపై తానే బాధ్యత వహించాలని అన్నారు. కోల్ ఇండియాతో పోలిస్తే సింగరేణిలో బొగ్గు ధరలు ఎక్కువగా ఉండటంతో మార్కెట్‌లో పోటీ పెరిగిందన్నారు. దీన్ని అధిగమించేందుకు రక్షణ సూత్రాలను పాటిస్తూ వర్కింగ్ అవర్స్ పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.
కాంట్రాక్ట్ విధానంతో పోలిస్తే డిపార్ట్మెంటల్ విధానంలో ఎక్కువ ఉత్పత్తి సాధించాలని సూచించారు. కేసిహెచ్‌పీలో దుమ్ము, ధూళి కారణంగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు నివారించేందుకు ఈపీ, వోల్వో ఆపరేటర్లకు సిమ్యులేటర్ ద్వారా శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంచాలని సూచించారు. సమావేశంలో ఏరియా జీఎం దుర్గం రామచందర్, కార్పొరేట్ జీఎం సాయిబాబు, కొత్తగూడెం రీజియన్ జీఎం శ్రీకృష్ణ గోపాల తివారి, గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ వై.రాంగోపాల్, ప్రాతినిధ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ వి.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
