సింగరేణి మహిళా కాలేజీకి 50 ఏండ్లు పూర్తి

సింగరేణి మహిళా కాలేజీకి 50 ఏండ్లు పూర్తి

హైదరాబాద్, వెలుగు: కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కాలేజీని స్థాపించి 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ లోగోను సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్ నుంచి వర్చువల్‌‌గా లోగోను సీఎండీ ఆవిష్కరించారు. ఈ కాలేజీ మహిళా విద్యకు అంకితమై, రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. 1975లో సింగరేణి సంస్థ  కొత్తగూడెంలో ఈ కాలేజీని స్థాపించి సింగరేణి కార్మికులు, అధికారుల పిల్లలతో పాటు సమీప గ్రామాల విద్యార్థినులకు విద్యను అందించిందని తెలిపారు.

 ఇక్కడ చదివిన విద్యార్థినులు డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఉద్యోగులుగా వివిధ రంగాలలో స్థిరపడ్డారని గుర్తుచేశారు. మొదట ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా ప్రారంభమైన ఈ కాలేజీ ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తున్నదని వివరించారు. దాదాపు 2 వేల మంది విద్యార్థినులు చదువుతున్న ఈ కాలేజీలో హాస్టల్, ప్లే గ్రౌండ్స్ , ల్యాబ్స్, ఆడిటోరియం వంటి అత్యాధునిక సౌలతులున్నాయని తెలిపారు. 

చదువుతో పాటు క్రీడల్లో కాకతీయ యూనివర్సిటీ స్థాయిలో కాలేజీ అగ్రస్థానంలో నిలుస్తోందనీ చెప్పారు. స్వర్ణోత్సవం సందర్భంగా ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బలరాం వెల్లడించారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ (పీపీ అండ్ పీఏ) కె. వెంకటేశ్వర్లు, సీపీపీ ఎ. మనోహర్, సింగరేణి విద్యాసంస్థల కార్యదర్శి గుండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.