సార్.. నన్ను చదివించండి

సార్.. నన్ను చదివించండి
  • మంత్రి శ్రీనివాస్​గౌడ్​ను వేడుకున్న బాలుడు

మహబూబ్​నగర్, వెలుగు: పేదరికంతో చదువుకు దూరమైన బాలుడు తనను చదివించాలంటూ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ను వేడుకున్నాడు. పాలమూరు జిల్లా నవాబ్​పేట మండలం కాకర్లపహాడ్ కు చెందిన మల్లెల వెంకటేశ్, బుజ్జమ్మ దంపతుల కొడుకు విజయ్ గతేడాది 6వ తరగతి చదివాడు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ ఏడాది బడి మానేశాడు. మైసమ్మ టెంపుల్​వద్ద కూల్ డ్రింక్స్ అమ్మకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం మంత్రి శ్రీనివాస్​గౌడ్ మైసమ్మ టెంపుల్​ వద్ద అమ్మవారికి పూజ చేసేందుకు వచ్చారు. విజయ్​ మంత్రి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి చేయి పట్టుకొని ‘సార్​.. నాకు చదువుకోవాలని ఉంది’ అంటూ బోరున ఏడ్చేశాడు. స్పందించిన మంత్రి బాలుడిని తనతో పాటు పాలమూరుకు తీసుకెళ్లారు. ఓ ప్రైవేట్ స్కూల్​లో జాయిన్ చేయించారు. ఆ బాలుడికి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. బాలుడి తల్లితండ్రులకు కూడా ఉపాధి కల్పిస్తానని చెప్పారు.