లండన్: ప్రతిష్టాత్మక ‘విజ్డెన్ అల్మనాక్–2026’ అవార్డుల్లో ఇండియన్ క్రికెటర్లు సత్తా చాటారు. మొత్తం 9 అవార్డులు ప్రకటించగా ఇందులో ఏడు టీమిండియా ప్లేయర్లకే దక్కడం విశేషం. గతేడాది ఇంగ్లండ్ టూర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన హైదరాబాద్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా విజ్డెన్ ‘ఫైవ్ క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్ హసీబ్ హమీద్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక విదేశీ ప్లేయర్.
మెన్స్ విభాగంలో అభిషేక్ శర్మకు ‘టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. గత సీజన్‌లో అభిషేక్ 21 మ్యాచ్‌ల్లో 193 స్ట్రయిక్ రేట్‌తో 859 రన్స్ సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ‘విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికైంది.
విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో దీప్తి 22 వికెట్లతో పాటు 215 రన్స్ చేసి టీమిండియా టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. ఇంగ్లండ్‌తో జరిగిన అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో సిరాజ్ 23 వికెట్లతో ఇంగ్లిష్ జట్టును వణికిస్తే, గిల్ 754 రన్స్ చేశాడు. రిషబ్ పంత్ కాలి వేలి గాయంతోనూ పోరాడి కీలక పరుగులు సాధించి జట్టుకు అండగా నిలిచాడు. పంత్, జడేజాల పోరాటంతో టీమిండియా ఆ సిరీస్‌ను 2–-2తో డ్రా చేసుకోగలిగింది. మిచెల్ స్టార్క్‌కు ‘మెన్స్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్’ పురస్కారం లభించింది.

