ఆరుగురు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

ఆరుగురు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టుకు ఇటీవల నియమితులైన ఆరుగురు న్యాయమూర్తులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వీరందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్‌ ఏనుగుల వెంకట వేణుగోపాల్‌, జస్టిస్‌ నగేష్‌ భీమపాక, జస్టిస్‌ పుల్లా కార్తీక్‌, జస్టిస్‌ కాజ శరత్‌, జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అభినందనలు తెలిపారు. 

కరీంనగర్‌ మంకమ్మతోటలో 1967 ఆగస్టు 16న జన్మించిన జస్టిస్‌ ఏనుగుల వెంకట వేణుగోపాల్‌... 1992లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది దివంగత రామ్‌జెఠ్మలానీ వద్ద జూనియర్‌గా పనిచేశారు. రైల్వే స్టాండింగ్‌ కౌన్సిల్‌గానూ సేవలందించారు. ఆ తర్వాత 2021లో సీనియర్‌ న్యాయవాదిగా గుర్తింపు పొందారు.

జస్టిస్‌ నగేష్‌ భీమపాక స్వస్థలం భద్రాచలం. 1993లో బార్‌ కౌన్సిల్‌లో నమోదై...హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించిన ఆయన.. ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.

జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ జగిత్యాల వాసి. 1996లో బార్‌ కౌన్సిల్‌లో నమోదయ్యాక హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించి.. 2015లో ఏపీ పరిపాలన ట్రైబ్యునల్‌లో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 2017 నుంచి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.

ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీలో ఎంఏ, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన జస్టిస్‌ కాజ శరత్‌.. 2002 నుంచి హైకోర్టులో అన్ని రకాల కేసుల్లోనూ వాదనలు వినిపిస్తున్నారు.

జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాసరావుది రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట. ఆయన 2015 నుంచి సింగరేణి కాలరీస్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా కొనసాగుతున్నారు.

జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు మహబూబాబాద్‌ జిల్లా సూదనపల్లికి చెందిన వ్యక్తి కాగా.. 2001లో హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2019 నుంచి అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా సేవలందిస్తున్నారు. సివిల్‌, ఆర్థిక నేరాలు, కార్పొరేట్‌ లా, మోటారు ప్రమాదాలు, సర్వీసుకు చెందిన కేసుల్లో వాదనలు వినిపించారు.