జైపూర్: రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో సోమవారం తీవ్ర కలకలం రేగింది. కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ నాయకుడు అభిజీత్ దీప్కే షహీద్ స్మారక్ వద్దకు చేరుకున్న కొద్దిసేపటికే ఓ అపరిచిత వ్యక్తి ఆయనపై భౌతిక దాడికి దిగాడు. మద్దతుదారులకు దీప్కే అభివాదం చేస్తుండగా ఓ యువకుడు ఆయనను నాలుగు సార్లు చెంపదెబ్బ కొట్టాడు.
ఈ పరిణామంతో అక్కడ తోపులాట జరిగింది. ఆగ్రహానికి గురైన మద్దతుదారులు ఆ యువకుడిపై దాడి చేశారు. పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలు తదితర సమస్యలపై సీజేపీ ఈ నిరసన చేపట్టింది. దాడిపై అభిజీత్ దీప్కే ఎక్స్ వేదికగా స్పందించారు. తాను గాంధీ, అంబేద్కర్ అనుచరుడిని అని, ఈ పోరాటాన్ని శాంతి, ప్రేమతో కొనసాగిస్తానని చెప్పారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
