
ఉన్న బస్సులనే మార్పులు చేయనున్న సంస్థ
దూర ప్రయాణాలకు మస్తు డిమాండ్
ఒక్కో బస్సుకు రూ.5 లక్షలకు పైగా ఖర్చు
ప్రభుత్వం వద్దకు ఆర్టీసీ ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ మాదిరిగానే ఆర్టీసీ బస్సుల్లోనూ స్లీపర్ క్లాస్ అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ఉన్నతాధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతమున్న బస్సుల్లోనే కొన్నింటిని స్లీపర్ బస్సులుగా మార్చి త్వరలోనే రోడ్డెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో బస్సుకు రూ.5 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే బస్సులను స్లీపర్ క్లాసులుగా మార్చే పనిని మొదలుపెట్టనున్నారు.
ఇప్పటిదాకా ప్రైవేట్‌లోనే..
ఆర్టీసీలో 9,754 బస్సులు వివిధ రూట్లలో తిరుగుతున్నాయి. అందులో 6,579 బస్సులు ఆర్టీసీవి కాగా.. మిగతా 3,175 అద్దె బస్సులు. ఉమ్మడి ఆర్టీసీలో ఒకట్రెండు మాత్రమే స్లీపర్ క్లాస్ బస్సులుండేవి. తెలంగాణ వచ్చాక ఆ ఒక్కటీ లేకుండా పోయింది. ఈ మధ్య దూర ప్రయాణాలు చేసేటోళ్లు స్లీపర్ క్లాస్ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో స్లీపర్ క్లాస్ లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్‌లో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. చార్జీ ఎక్కువే అయినా సౌకర్యం ఉంటుందన్న ఉద్దేశంతో స్లీపర్ క్లాసులవైపే చూస్తున్నారు. దీంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ కూడా స్లీపర్ క్లాస్‌లను సిద్ధం చేయబోతోంది.
మధ్యతరగతోళ్లకు నాన్ ఏసీ స్లీపర్..
ప్రస్తుతం పీకల్లోతు నష్టాల్లో మునిగిపోయిన ఆర్టీసీకి కొత్త బస్సులు కొనేంత స్థోమత లేదు. దీంతో ఉన్న బస్సులను స్లీపర్ క్లాస్‌లుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఏసీ బస్సులు అయిన గరుడ ప్లస్, రాజధాని బస్సుల్లో కొన్నింటిని మోడిఫై చేయనున్నారు. మధ్యతరగతి జనాన్ని దృష్టిలో పెట్టుకుని నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ బస్సులనూ తయారు చేయనున్నారు. దూర ప్రాంతాలన్నింటికీ బస్సులను నడపాలని ఆలోచన చేస్తున్నారు. అయితే బస్సులను స్లీపర్ క్లాసులుగా మార్చాక రవాణా శాఖ అనుమతివ్వాల్సి ఉంటుంది. మోటార్ వాహన చట్టం నిబంధనల ప్రకారం ఫిట్నెస్, తదితర అంశాలన్నింటినీ పరిశీలించి వాటికి అనుమతులు మంజూరు చేస్తారు.