మణిపూర్ను ఎవరూ విభజించలేరు, ముక్కలు చేయలేరు : స్మృతి ఇరానీ

మణిపూర్ను ఎవరూ విభజించలేరు, ముక్కలు చేయలేరు :  స్మృతి ఇరానీ

లోక్ సభలో  కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఫైరయ్యారు. భారతమాతను చంపారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.   మణిపూర్ ను ఎవరూ విభజించలేరు, ముక్కలు చేయలేరని స్పష్టం చేశారు.  మణిపూర్ భారత్ లో అంతర్భాగమని  ఆమె చెప్పారు.  భారతమాతను హత్య  చేశారని అంటే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తున్నారు.  

ఈ సందర్భంగా 1984 అల్లర్లు, కశ్మీర్ హింసను స్మృతి ఇరానీ ప్రస్తావించారు.  అర్టికల్ 370ని తాము రద్దు చేసి అక్కడ శాంతిని నెలకొల్పామని తెలిపారు.  దేశంలో అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీనే అని స్మృతి ఇరానీ విమర్శించారు. మీరు ఇండియాకు కాదు... అవినీతికి ప్రతిరూపం అని చెప్పారు.  కశ్మీర్ పండితుల బాధలనే మీరెప్పుడూ వినలేదని అన్నారు.  ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అఘాయిత్యాల సంగతి ఎంటీ అని ప్రశ్నించారు.  

అంతకుమందు లోక్ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ..  మణిపూర్ లో భారతమాతను హత్య చేశారని ఆరోపించారు. మీరు దేశ భక్తులు కాదు దేశ ద్రోహులని మండిపడ్డారు.  మణిపూర్ ప్రజలను చంపడం ద్వారా దేశాన్ని కూడా చంపారన్నారు.  హిందూస్థాన్ ను మర్డర్ చేశారంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.