
జోహెన్నెస్‌బర్గ్: ఫ్లైట్‌లో ఎలుక కనిపిస్తే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడాన్ని చూశాం. పక్షి ఢీకొట్టినా.. టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చినా సేఫ్‌గా ఫ్లైట్‌ను కిందికి దించిన ఘటనలూ ఉన్నాయి. అదే ఫ్లైట్‌లో నాగుపాము కనిపిస్తే ఎలా ఉంటది.. ఆ ప్లేన్ 11వేల అడుగుల ఎత్తులో ఉంటే ప్యాసింజర్ల ఫీలింగ్ ఎలా ఉంటది.. ఆ కోబ్రా కాస్త పైలట్ సీటు కిందే ఉంటే ఇంకేమైనా ఉందా.. ఆ పైలట్ ప్రాణం అరచేతుల్లో పెట్టుకుని.. ప్లేన్‌ను సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. ఈ ఘటన సౌతాఫ్రికాలో జరిగింది. చిన్న ప్రైవేట్ ప్లేన్ సోమవారం వోర్సస్టర్ సిటీ నుంచి నెల్స్ర్పూయిట్కు బయలుదేరింది. ఫ్లైట్‌ను రుడోల్ఫ్ ఎరాస్మస్ నడుపుతున్నాడు. 11వేల అడుగుల ఎత్తుకెళ్లేసరికి రుడోల్ఫ్ నడుముకు ఏదో చల్లగా తగులుతున్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ వాటర్ బాటిల్ అనుకున్నాడు. పదే పదే తగులుతుండటంతో అటువైపు తిరిగి చూస్తే.. పాము కనిపించింది. దీంతో నోట మాటరాలేదు. ఆ టైంలో ఫ్లైట్‌లో నలుగురు ప్యాసింజర్లు ఉన్నారు.
వెల్కమ్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
పాము మెల్లిగా సీటు కిందికి వెళ్లింది గమనించాడు. భయపడకుండా ఈ విషయాన్ని వెంటనే ప్రయాణికులకు వివరించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నట్లు చెప్పాడు. సీటు కింద పాము ఉన్న సమాచారాన్ని జోహెన్నెస్‌బర్గ్‌లోని కంట్రోల్ టవర్‌కు చెప్పి.. ఫ్లైట్‌ను వెల్కమ్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.
ముందురోజే ఫ్లైట్ రెక్కల్లో..
ఆదివారం ఫ్లైట్ రెక్కల్లో పాము కనిపించడంతో పట్టుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. స్నేక్ క్యాచర్లు వచ్చి పాము కోసం వెతికినా దొరకలేదు. ఇంజనీర్లు వచ్చి మొత్తం పార్ట్స్ విప్పినా కనిపించలేదు. చివరికి అది కనిపించకుండా పోవడంతో వెళ్లిపోయి ఉంటుందనుకున్నారు.కానీ, సోమవారం పొద్దున ప్లేన్ టేకాఫ్ అయ్యాక.. ఏకంగా పైలట్ సీటు కిందే దర్శనం ఇచ్చింది.