- న్యాయపోరాటం చేస్తా: సోమిరెడ్డి
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కమిషనర్ తీరుపై చెలరేగిన వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. తన ప్రమేయం లేకుండా, కనీసం సంప్రదించకుండానే సమస్య సమసిపోయిందంటూ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటన విడుదల చేయడంపై బాధితుడు, నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బుధవారం తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) ప్రతినిధులు ఎక్సైజ్ కమిషనర్‌ను కలిశారు. అనంతరం శాఖలో గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడిందని వారు ప్రకటించారు. బదిలీల ప్రక్రియలో పని ఒత్తిడి కారణంగానే సదరు అధికారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానని, అది ఉద్దేశపూర్వకమైనది కాదని కమిషనర్ వివరణ ఇచ్చారని, ఈ మేరకు ఆయన విచారం వ్యక్తం చేసినట్లు జేఏసీ వెల్లడించింది. జేఏసీ ప్రకటనపై సోమిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

