V6 News

కొడుకు బ్లాక్ మనీని.. వైట్ గా మార్చిన 90 ఏళ్ల తల్లికి జైలు శిక్ష

 కొడుకు బ్లాక్ మనీని.. వైట్ గా మార్చిన 90 ఏళ్ల తల్లికి జైలు శిక్ష

ఆమె వయస్సు 90 ఏళ్లు.. ఈ వయస్సులో సహజంగా ఎవరైనా ఇంట్లోనే ఉంటారు.. మంచంపైనే ఎక్కువ ఉంటారు.. బయట తిరిగే వయస్సు కాదు.. అన్ని విషయాలు గుర్తుండే వయస్సు అంతకన్నా ఏమీ కాదు.. ఇలాంటి 90 ఏళ్ల మహిళకు జైలు శిక్ష విధించింది దక్షిణ కొరియా ప్రభుత్వం. ఇంతకీ ఆ 90 ఏళ్ల తల్లి చేసిన నేరం ఏంటో తెలుసా.. కొడుకు డ్రగ్స్ అమ్మి సంపాదించిన బ్లాక్ మనీని.. వైట్ గా మార్చటం.. మనీలాండరింగ్ చేయటం.. ఏంటీ ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టారా.. అవును ఇది నిజం.. ఈ విషయం విచారణలో తేలటంతో కోర్టు జైలుకు పంపించింది ఈ 90 ఏళ్ల మహిళను.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి....

ఆమె కుమారుడు (60) ఒక పెద్ద డ్రగ్స్ ముఠా నాయకుడు. అతను 2020లో కంబోడియాలో డ్రగ్స్ కేసులో పట్టుబడి అక్కడే జైలులో ఉన్నాడు. అయితే జైలు నుంచే అతను తన నెట్‌వర్క్‌ను నడిపిస్తూ, డ్రగ్స్ అమ్మగా వచ్చిన సొమ్మును తన తల్లి ద్వారా మార్పిడి చేయించాడు.

2020 ఏప్రిల్ నుండి 2022 ఫిబ్రవరి మధ్యలో, ఆమె గుర్తు తెలియని వ్యక్తుల నుండి దాదాపు రూ. 2.2 కోట్లు అందుకుంది. ఆ డబ్బును   తన కొడుకు చెప్పిన వివిధ బ్యాంకు అకౌంట్లకు  9 సార్లు ట్రాన్స్ఫర్ చేసింది. దీనివల్ల ఆ అక్రమ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో కనిపెట్టడం పోలీసులకు కష్టంగా మారింది.

విచారణ సమయంలో తనకు ఆ డబ్బు డ్రగ్స్ వ్యాపారానిదని తెలియదని ఆమె వాదించింది. కానీ కోర్టు ఆమె వాదనను తోసిపుచ్చింది. ఆమె 2019లో ఐదుసార్లు కంబోడియా వెళ్లి కొడుకును కలిసింది. తన కొడుకు జైలులో ఉన్నాడని, అతను చేస్తున్నది అక్రమ వ్యాపారమని తెలిసే ఆమె ఈ పని చేసిందని కోర్టు నిర్ధారించింది.

 ఈ చర్యల వల్ల డ్రగ్స్ వ్యాప్తికి సహకరించినట్లవుతుంది, ఇది సమాజానికి చాలా హానికరం అని న్యాయమూర్తి అన్నారు. అయితే, ఆమె వయస్సు 90 ఏళ్లు కావడం, గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాది జైలు శిక్ష విధించింది కోర్ట్. అలాగే ఆమె దగ్గర  ఉన్న అక్రమ ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.

 ఈ కేసులో వృద్ధురాలితో పాటు ఆమె మనవరాలిని కూడా పోలీసులు విచారించారు. మనవరాలిపై కూడా దాదాపు రూ. 5 కోట్లకు పైగా అక్రమ డబ్బును పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఆ డబ్బు డ్రగ్స్ ద్వారా వచ్చిందని ఆమెకు తెలుసనే విషయానికి సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది.

ప్రస్తుతం కంబోడియా జైలులో ఉన్న సాంగ్‌ను తిరిగి దక్షిణ కొరియాకు రప్పించే ప్రయత్నాల్లో అక్కడి అధికారులు ఉన్నారు. తన తల్లిని, కూతురిని కూడా ఈ డ్రగ్స్, మనీలాండరింగ్ ఊబిలోకి నెట్టడం ఆ దేశంలో పెద్ద చర్చకు దారితీసింది.