మా దగ్గర నాటు నాటు సాంగ్ చాలా ఫేమస్: దక్షిణ కొరియా మంత్రి

మా దగ్గర నాటు నాటు సాంగ్ చాలా ఫేమస్: దక్షిణ కొరియా మంత్రి

దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి పార్క్ జిన్ ‘ఆర్ఆర్ఆర్’(RRR) సినిమాపై ప్రశంసలు కురిపించారు. తమ దేశంలో నాటు నాటు సాంగ్ చాలా ఫేమస్ అని ఆయన తెలిపారు. దర్శకుడు రాజమౌళి(Rajamouli)పై ప్రశంసలు గుప్పించారు. 

తాను ఒక అద్భుతమైన భారతీయ కథను చూశానని కొనియాడారు. తాను బాలీవుడ్ సినిమాలను సైతం చూస్తుంటానని.. 3ఇడియట్స్, చెన్నై ఎక్స్ ప్రెస్, ఆర్ఆర్ఆర్ సినిమాలు తన ఫేవరెట్ అని పేర్కొన్నారు. ఇటీవల కొరియన్ ఎంబసీ ఉద్యోగులు నాటు నాటు పాటపై స్టెప్పులు వేసిన వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. 

భారతీయుల కోసం వారు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఇలాంటి ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. శుక్రవారం విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆయనకు స్వాగతం పలికారు. దౌత్యపరంగా భారత్ తమకు కీలక భాగస్వామి అని.. ఇరు దేశాలది 50 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం అని జిన్ వివరించారు. 

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఖ్యాతి ఖండాంతరాలను దాటిన విషయం తెలిసిందే. నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారాన్ని సైతం అందుకుంది. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, అలియా భట్ లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.