
- వారం ముందుగానే వచ్చిన రుతుపవనాలు
- మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణలోకి ఎంటర్
హైదరాబాద్, వెలుగు: నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. శనివారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోకి పూర్తిగా ప్రవేశించగా.. కర్నాటకలోని కొన్ని ప్రాంతాలకూ రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళలోకి ప్రవేశించాల్సి ఉన్నా.. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో వారం ముందుగానే వచ్చేశాయి. ఇటు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించాయి. వాటితో పాటు అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, మాహీ వంటి ప్రాంతాల్లోకి నైరుతి రుతపవనాలు ఎంటరయ్యాయి. వాతావరణం ఇలాగే అనుకూలిస్తే మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ఎంటరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే ఈ నెల 27 నాటికి తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలోని మరిన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ పేర్కొంది.
కేరళలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
రుతుపవనాల ప్రభావంతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగిలిన 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆది, సోమవారం కూడా భారీ వర్షాలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని, అత్యవసర పరిస్థితిపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని కేరళ ప్రభుత్వం పేర్కొంది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగాఉండాలని సూచించారు. అనధికార సమాచారాన్ని సోషల్ మీడియాలో వైరల్చేయవద్దని కోరింది.
అరేబియా సముద్రంలో వాయుగుండం
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఆదివారం నాటికి అది మరింత బలపడనుంది. మరోవైపు బంగాళాఖాతంలో ఈ నెల 27న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత రెండు రోజుల్లో మరింత బలపడనుందని ఐఎండీ పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. అన్ని జిల్లాలకూ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.