ఒంటితనం అందరినీ బాధ పెడుతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి చాలామంది రకరకాల పనులు చేస్తుంటారు. అయితే, ఆ ఒంటరి తనాన్ని అనుభవించాలనుకుంది స్పెయిన్ కు చెందిన ఓ మహిళ. అనుకున్నదే ఆలస్యం.. 230 అడుగుల లోతున్న గుహలో 500 రోజులు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా నివసించింది. శుక్రవారం నాడు సురక్షితంగా గుహ నుంచి బయటికి వచ్చింది.
ఫ్లామిని అనే 50 ఏళ్ల మహిళ స్పెయిన్ లోని గ్రానాడాలో ఓ గుహలో 500 రోజులు నివాసం ఉంది. అథ్లెట్, పర్వతారోహకురాలు అయిన ఫ్లామిని.. ప్రపంచానికి సంబంధం లేకుండా ఒంటిగా గుహలో ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. దాంతో కొద్ది మంది సభ్యుల సాయంతో 2021 నవంబర్ 21న గుహలో అడుగుపెట్టింది.
ఫ్లామినికి అవసరం అయిన ఫుడ్, నీళ్లు అంతా తన బృందం సమకూర్చే వాళ్లు. గుహ బయట సామాగ్రి ఉంచి వెళ్లిపోయేవాళ్లు. గుహలో రెండు కెమెరాలు, మైక్ లు అమర్చి తనను పర్యవేక్షించేవాళ్లు. అంతేతప్ప తనతో ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు. ఆ మైక్ సాయంతో తన అనుభవాలను ఫ్లామిని పంచుకునేది.
గుహలోపల పుస్తకాలు చదువుతూ, హాండ్ కర్చిఫ్, హ్యాట్ లు నేస్తూ ఫ్లామిని కాలాన్ని వెల్లదీసింది. సమయం ఎంతయిందో కూడా తెలుసుకునే వెసులుబాటు లేకపోవడంతో కొంత కాలానికి రోజులు లెక్కించడం మానేసినట్లు తెలిపింది. గుహ నుంచి బయటికి వచ్చి తన టీమ్‌ను హగ్ చేసుకున్న వీడియోను స్పానిష్ టీవీ ఒకటి విడుదల చేసింది. గుహలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా ఆమె ప్రపంచ రికార్డును సృష్టించింది. కానీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మాత్రం ఈ రికార్డును ఇంకా పరిగణం లోకి తీసుకోలేదు.
