పంజాగుట్ట, వెలుగు: దళిత క్రైస్తవులపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టిందని ప్రొఫెసర్ హరగోపాల్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ఆరోపించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో దేవని సతీశ్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులను సవరించి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. హిందూ మతంలోని అంటరానితనాన్ని, అంధవిశ్వాసాలను రూపుమాపకుండా.. దళితులు ఇతర మతాల్లోకి మారితే వారిని వేధించడం సరికాదన్నారు.
ఆనంద్ అనే పాస్టర్ కేసులో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు వచ్చిన వెంటనే కేంద్రం ఆగమేఘాల మీద బిల్లు తీసుకురావడం వెనుక దళితులను నిర్వీర్యం చేసే కుట్ర ఉందని విమర్శించారు. దళిత సంఘాలన్నీ ఏకమై కేంద్రాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గోరే అంజయ్య, బూర్గుల వెంకటేశ్వర్లు, రమణ తదితరులు పాల్గొన్నారు.

