గంజాయి తరలించేందుకు లారీలో స్పెషల్ క్యాబిన్

గంజాయి తరలించేందుకు లారీలో స్పెషల్ క్యాబిన్
  • సరుకు తరలించేందుకు లారీలో స్పెషల్ క్యాబిన్
  • రూ. కోటి విలువైన 400 కిలోల గంజాయి, కారు సీజ్
  • ఏడుగురు అరెస్ట్

శంషాబాద్, వెలుగు: లారీలో స్పెషల్​ క్యాబిన్​ఏర్పాటు చేసుకొని గంజాయి తరలిస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్ వోటీ  పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన పరశురాం ఆనంద పరకెల్(57), ఉమేష్ గైక్వాడ్(38), ప్రదీప్ కాలంగి(24), దత్తాసకత్(53), సతీశ్ విజయ్ షిండే(36), విశాల్ పుపట్ మాస్కె(21), అశోక్ పాటిఫుటే(50) ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా గంజాయి తరలించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాలో హీరో ఎర్రచందనం తరలించేందుకు ట్రక్​లో స్పెషల్​ క్యాబిన్ ​ఏర్పాటు చేసినట్టుగానే.. వీరు కూడా లారీలో స్పెషల్ ​క్యాబిన్​పెట్టి.. అందులో గంజాయి తరలించాలనుకున్నారు. ఈ మేరకు అంకుష్ పండూలే అనే వ్యక్తిని సంప్రదిస్తే.. అతను లారీలో క్యాబిన్ ​ఏర్పాటు చేయించి ఇచ్చాడు. లారీతో వెళ్లిన వారు.. ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సప్లయ్​ చేసే సుభాన్, బాషాలను కలిశారు. వారి వద్ద 400 కిలోల గంజాయి కొన్నారు. సరుకును మహారాష్ట్రలోని అహ్మద్ నగర్​కు తరలించేందుకు బయలుదేరారు. పక్కా సమాచారంతో లారీని ట్రేస్​చేసిన శంషాబాద్​ఎస్​వోటీ పోలీసులు చేవెళ్ల మండలం షాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద వారిని పట్టుకున్నారు. ఏడుగురిని అరెస్ట్​ చేయడంతో పాటు వారి వద్ద నుంచి 400 కేజీల గంజాయి, ఒక లారీ, ఒక కారు,9 సెల్​ఫోన్లు, రూ.15 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాల్లో 2,500 రూపాయలకు కిలో చొప్పున గంజాయి కొని మహారాష్ట్ర, హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో డిమాండ్ ను బట్టి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని డీసీపీ తెలిపారు. గంజాయి సప్లయర్లు సుభాన్, బాషా, మహారాష్ట్రకు చెందిన అంకుష్ పండూలే పరారీలో ఉన్నారని చెప్పారు.