నల్గొండ భగీరథలో పైసల దందా

నల్గొండ భగీరథలో పైసల దందా

నల్గొండ, వెలుగుమిషన్ భగీరథ స్కీంలో గుట్టుచప్పుడు కాకుండా పైసల దందా నడుస్తోంది. స్టేట్ లో ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా నల్గొండ స్కీంకు మాత్రమే ప్రత్యేకంగా మెయింటెనెన్స్ టెండర్లు పిలవడం ఆరోపణలకు తావిస్తోంది. పాత సీపీడబ్ల్యూఎస్ స్కీంలను భగీరథలో విలీనం చేశాక మెయిన్ గ్రిడ్ పైపులైన్ తోపాటు ఆపరేషన్ అండ్ మేనేజ్ మెంట్(ఓఅండ్ఎం) పనులూ ఆయా కాంట్రాక్టు సంస్థలే చేయాలి. అగ్రిమెంట్ ప్రకారం పదేళ్లపాటు స్కీంను మెయింటెయిన్ చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టు సంస్థలదే. అగ్రిమెంట్ ప్రకారం… మెయిన్ గ్రిడ్ పైప్ లైన్  పనులు, వాటర్ సప్లై, పైప్ లైన్ లీకేజీలు ఇతర పనులన్నీ సంబంధిత సంస్థలే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ నల్గొండ జిల్లాలో మాత్రం రూల్స్ కు విరుద్ధంగా పాత సీపీడబ్ల్యూఎస్ స్కీంకు మెయింటెనెన్స్ పేరుతో ప్రత్యేకంగా టెండర్లు పిలిచారు. రాజకీయ జోక్యంతో ఈఎన్సీ స్థాయిలో పనుల మార్పు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పాత, కొత్త తేడా లేకున్నా..

నల్గొండ జిల్లాలో మేఘా, జీవీపీఆర్ సంస్థలు భగీరథ పనులు చేపట్టాయి. నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో పనులను జీవీపీఆర్ చేస్తోంది. మిగిలిన సెగ్మెంట్లలో మేఘా సంస్థ పనులు చేపడుతోంది. నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో మెయింటెనెన్స్ పనులు చేయబోమని జీవీపీఆర్ చేతులెత్తేసింది. మెయిన్ గ్రిడ్ పనుల వరకు మాత్రమే చేస్తామని చెప్పి, పాత సీపీడబ్ల్యూఎస్ పనుల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకుంది. వాస్తవంగా అయితే పాత స్కీంలను భగీరథలో కలిపేశారు. దీంతో పాత, కొత్త అనే తేడా లేకుండా మొత్తం గ్రిడ్ నిర్వహణ పనులన్నీ కాంట్రాక్టు పొందిన సంస్థలే పర్యవేక్షిస్తున్నాయి. నల్గొండ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో మెగా కంపెనీ ఇదే రకంగా చేస్తోంది. కానీ జీవీపీఆర్ మాత్రం మెయిన్ పైప్ లైన్  పనుల వరకే చేస్తామని మెలిక పెట్టింది. రెండు నియోజకవర్గాల్లో సుమారు 1200 కి.మీ. పైపు లైనుకుగాను ఇప్పటికే 900 కి.మీ. పైపు లైను పనులను జీవీపీఆర్ కంప్లీట్ చేసింది. 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు ఓఅండ్ఎం కూడా జీవీపీఆర్ చూసింది. పనులు చివరి దశకు చేరుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఓఅండ్ఎం నుంచి జీవీపీఆర్ తప్పుకోవడం అనుమానాలకు
తావిస్తోంది.

రూల్స్ కు విరుద్ధంగా…

భగీరథ గ్రిడ్ పదేళ్లపాటు మెయింటెయిన్ చేస్తానని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకుంది. రూల్స్ ప్రకారం అయితే అగ్రిమెంట్ ఉల్లంఘించిన సంస్థపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అలాంటి చర్యలేవీ లేకుండానే ఏకంగా ఓఅండ్ఎం పనుల కోసం టెండర్లు పిలిచారు. స్టేట్ మొత్తం ఒక రకమైన పాలసీ అమలు చేస్తుండగా, నల్గొండ జిల్లా వరకే ఏడాదికి రూ.8.32 కోట్లు మెయింటెనెన్స్ కు కేటాయించారు. రెండేళ్ల ఒప్పందం పైన టెండర్లు పిలిచినట్లు అధికారులు చెప్తున్నా పదేళ్లపాటు గడువు పొడిగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వంపై రూ.83 కోట్ల అదనపు భారం పడనుంది. సోమవారం (నేడు) టెండరు దాఖలుకు ఆఖరి తేదీ కావడంతో ఆఫీసర్లు దీనిపై ఆసక్తిగా చూస్తున్నారు.

చక్రం తిప్పిన కీలక నేత

నల్గొండ జిల్లాలో అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధి జోక్యంతోనే మిషన్ భగీరథ ఓఅండ్ఎం పనులకు టెండరు పిలిచినట్లు తెలిస్తోంది. తనకు సంబంధించిన వ్యక్తులకు కాంట్రాక్టు కట్టబెట్టేందుకే ఇదంతా చేశారని అధికార వర్గాలు చెప్తున్నాయి.ఓఅండ్ఎం కాంట్రాక్టు చేతికొస్తే అందులో పనిచేసే పాత సిబ్బందిని తొలగించి… తనకు అనుకూలమైన వ్యక్తులను పెట్టుకోవవడంతోపాటు, మెయింటెనెన్స్ పేరుతో నిధులు పొందే ఛాన్స్ దక్కుతుంది. దీని కోసమే ఇటీవల నల్గొండ డివిజన్ ఈఈని బదిలీ చేయించి ఆయన స్థానంలో అనుకూలమైన అధికారిని నియమించుకున్నారని మిషన్ భగీరథ అధికారుల్లోనే చర్చ జరుగుతోంది. ఓఅండ్ఎం సిబ్బంది మార్పు విషయంలో వెళ్లిపోయిన ఈఈకి, ప్రజాప్రతినిధికి మధ్య గొడవ కూడా జరిగిందని అంటున్నారు.

సీపీడబ్ల్యూఎస్,భగీరథలో భాగమే

పాత సీపీడబ్ల్యూఎస్ స్కీంలు భగీరథలో భాగమే. గ్రిడ్ లో కలిపాక పాతవి, కొత్తవనే తేడా ఉండదు. కానీ జీవీపీఆర్ పాత స్కీం పనులు చేయలేమని చెప్పింది. దీంతో సెపరేట్ గా టెండరు పిలిచారు. జీవీపీఆర్ మెయింటెనెన్స్ చేస్తామంటే మాకు ఇబ్బంది లేదు. అగ్రిమెంట్ ప్రకారం పదేళ్ల పాటు మెయింటెయిన్ చేయాలి. ఇప్పుడు టెండరు పిలిచారు కాబట్టి కొత్త పైపులైన్  మెయింటెనెన్స్ జీవీపీఆర్ కు, పాత స్కీం ఓంఅండ్ఎం వేరొక కాంట్రాక్టర్ కు అప్పగిస్తారు. స్టేట్ లో మరెక్కడా ఇలా లేదు. నల్గొండ జిల్లా వరకే పై ఆఫీసర్లు నిర్ణయం తీసుకుని టెండర్లు పిలిచారు. రిపోర్ట్ పంపడం వరకే మా బాధ్యత.

– జి.లలిత, మిషన్ భగీరథ గ్రిడ్ ఎస్ఈ, నల్గొండ జిల్లా