టెంపుల్ బాండ్స్ తెస్తున్న మధ్యప్రదేశ్.. భక్తులిచ్చే కానుకలతోనే ఇన్వెస్టర్లు రీపేమెంట్స్ చేస్తారంట!

టెంపుల్ బాండ్స్ తెస్తున్న మధ్యప్రదేశ్.. భక్తులిచ్చే కానుకలతోనే ఇన్వెస్టర్లు రీపేమెంట్స్ చేస్తారంట!

దేశంలోనే తొలిసారిగా మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఒక సరికొత్త సంచలనానికి తెరలేపింది. భక్తి మార్గాన్ని సరికొత్త ఫైనాన్స్ వ్యూహంగా మార్చుకోవాలని చూస్తోంది. ఆధ్యాత్మికతను, ఆధునిక ఫైనాన్స్ రంగాన్ని జోడిస్తూ దేశంలోనే మొదటిసారిగా "టెంపుల్ బాండ్స్" తీసుకురావాలని నిర్ణయించింది. ఉజ్జయిని దాని చుట్టుపక్కల ప్రభుత్వ ఆధీనంలోని 11 ప్రముఖ దేవాలయాల అభివృద్ధి, ఆధునీకరణ కోసం ఈ వినూత్న బాండ్లను జారీ చేయనున్నారు. రూ.11వందల కోట్ల భారీ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా.. మొదటి విడతగా రూ.200 కోట్లు సేకరించాలని బీజేపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది.

అసలు టెంపుల్ బాండ్స్ అంటే ఏమిటి? 
సాంకేతికంగా చెప్పాలంటే ఇవి మునిసిపల్ బాండ్ల తరహాలోనే ఉంటాయి. ఈ బాండ్లను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘ఉజ్జయిని డెవలప్‌మెంట్ అథారిటీ’ జారీ చేస్తుంది. ఇందుకోసం 11 ఆలయ కమిటీలతో ప్రత్యేక ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్, బ్యాంక్ లోన్ల సహాయంతో ఈ ఆలయాల పునర్నిర్మాణం జరుగుతుంది. ఉజ్జయినిలోని చాలా దేవాలయాలు ప్రైవేట్ ట్రస్ట్‌లు కావు, ఇవన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండేవే. వీటి మేనేజ్‌మెంట్‌లో ఆయా ప్రాంతాల ఎస్డీఎంలు, తహసీల్దార్లు ఉంటారు కాబట్టి నిధుల దుర్వినియోగం జరిగే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

భక్తుల కానుకలతోనే ఇన్వెస్టర్లకు చెల్లింపులు.. 
ఈ బాండ్ల రీపేమెంట్ విధానం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది. బాండ్ల ద్వారా సేకరించిన నిధులతో ఆలయాల వద్ద మౌలిక వసతులు, సౌకర్యాలు మెరుగుపరుస్తారు. ఉదాహరణకు ఉజ్జయినిలోని కాలభైరవ ఆలయాన్ని సాధారణ రోజుల్లో 60 వేల మంది, వారాంతాల్లో 80 వేల మంది వరకు భక్తులు సందర్శిస్తుంటారు. వసతులు మెరుగైతే భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. తద్వారా ఆలయాలకు వచ్చే డొనేషన్లు, హుండీ కానుకలు, ప్రత్యేక దర్శనాల ఆదాయం భారీగా పెరుగుతుంది. ఇలా వచ్చే ఆదాయాన్నే బాండ్ల మెచ్యూరిటీ కాలం ముగిశాక ఇన్వెస్టర్లకు వడ్డీతో సహా తిరిగి చెల్లించడానికి ఉపయోగించనున్నారు. దీంతో అటు భక్తులు ఇటు ఇన్వెస్టర్లు డబుల్ హ్యాపీ ఫీలవుతారని బీజేపీ సర్కార్ భావిస్తోంది. 

ఈ టెంపుల్ బాండ్ల వల్ల ఉజ్జయిని పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక పర్యాటకం పెరిగి స్థానికులకు ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయి. అయితే మార్కెట్ విశ్లేషకులు కొన్ని సవాళ్లను కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ బాండ్ల సైజ్ చాలా చిన్నది కావడం వల్ల రిటైల్ ఇన్వెస్టర్లు దీనిని ఒక ఇన్వెస్ట్‌మెంట్‌లా కాకుండా దైవకార్యానికి ఇచ్చే విరాళంలా భావించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఆలయాల ఆడిట్ అకౌంట్లు, నిధుల లభ్యత, నియంత్రణ సంస్థల క్లారిటీపైనే ఇన్వెస్టర్ల ఆసక్తి ఆధారపడి ఉండనుంది. ఏదేమైనా.. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ఇదొక రోల్ మోడల్‌గా నిలవడం ఖాయం అంటున్నారు ఫైనాన్షియల్ అనలిస్టులు.